AP Mlc Elections : ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు, పోలింగ్ రోజున క్యాజువల్ లీవ్ గా ప్రకటించిన ప్రభుత్వం-andhra pradesh mlc election day government declares casual leave ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Mlc Elections : ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు, పోలింగ్ రోజున క్యాజువల్ లీవ్ గా ప్రకటించిన ప్రభుత్వం

AP Mlc Elections : ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు, పోలింగ్ రోజున క్యాజువల్ లీవ్ గా ప్రకటించిన ప్రభుత్వం

HT Telugu Desk HT Telugu
Updated Feb 18, 2025 05:28 PM IST

AP Mlc Elections : ఏపీలో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రెండు రోజులు సెల‌వు రాబోతుంది. పోలింగ్ రోజున(ఫిబ్రవరి 27) స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇస్తున్నట్లు ప్రకటించింది.

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు, పోలింగ్ రోజున క్యాజువల్ లీవ్ గా ప్రకటించిన ప్రభుత్వం
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు, పోలింగ్ రోజున క్యాజువల్ లీవ్ గా ప్రకటించిన ప్రభుత్వం

AP Mlc Elections : రాష్ట్రంలో గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రెండు రోజులు సెల‌వు రాబోతుంది. ఓట‌ర్లుగా ఉన్న ఉద్యోగుల‌కు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం పోలింగ్ రోజు (2025 ఫిబ్రవరి 27) స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రంలో ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లా ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గం, ఉమ్మడి ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప‌ట్టభ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ప‌ట్టభ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గ స్థానాల‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ జిల్లాల ప‌రిధిలోని ఉద్యోగుల‌కు ఎన్నిక‌ల సంఘం క్యాజువ‌ల్ లీవ్‌ను ప్రక‌టించింది. దీంతో ఉద్యోగ‌, ఉపాధ్యాయులు తమ ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది.

రాష్ట్ర శాసన మండలికి జరిగే ఎన్నికలలో బోనఫైడ్ ఓటర్లుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల రోజున ప్రత్యేక క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వీలు కల్పించినట్లు తెలిపారు.

ఈ మేరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు (భాగం), కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల (పార్ట్) కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు ఈ ఉత్తర్వుల‌ను పంపిన‌ట్లు పేర్కొన్నారు.

ఈ విషయాన్ని అధికారులు తమ జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తెలియజేయాలని సూచించారు. తద్వారా ఆయా నియోజకవర్గాల్లోని బోనఫైడ్ ఓటర్లైన ఉద్యోగులకు పోలింగ్ రోజున (ఫిబ్రవ‌రి 27) ప్రత్యేక క్యాజువల్ లీవ్ మంజూరు చేయడానికి వీలు కల్పించిన‌ట్లు పేర్కొన్నారు.

ప్రైవేటు ఉద్యోగుల‌కు నిబంధ‌న లేదు

ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర శాసన మండలి ఎన్నికలకు సాధారణ సెలవు ప్రకటించడానికి ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 కింద ఎటువంటి నిబంధన లేదని జిల్లా ఎన్నికల అధికారులకు తెలియ‌జేశారు. అందువల్ల, రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు లేదా ఇతర సంస్థల యాజమాన్యాలు గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలలోని ఏదైనా గ్రాడ్యుయేట్ ఓటర్లుగా నమోదైన వారి ఉద్యోగులకు అవసరమైన సౌకర్యాలను మంజూరు చేయాలని కోరుతూ ప్రధాన ఎన్నికల అధికారి విజ్ఞప్తి చేశారు.

ఉదాహరణకు కార్యాలయానికి, విధులకు ఆలస్యంగా హాజరు కావడానికి అనుమతి, షిఫ్ట్‌ల సర్దుబాట్లు, పోలింగ్ రోజున (ఫిబ్రవ‌రి 27) వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా తక్కువ సమయం డ్యూటీ గంటలు వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని కోరారు.

అయితే ప్రభుత్వ ఉద్యోగుల‌కు పోలింగ్ రోజున క్యాజువ‌ల్ లీవ్ ప్రక‌టించ‌డంతో వారికి వ‌రుస‌గా రెండు రోజులు సెల‌వు వ‌స్తోంది. ఫిబ్రవ‌రి 26న శివ‌రాత్రి సంద‌ర్భంగా సాధార‌ణ సెల‌వు రావ‌డంతో పాటు మ‌రుస‌టి రోజే క్యాజువ‌ల్ లీవ్ ప్రకటించ‌డంతో ఉద్యోగ‌, ఉపాధ్యాయుల‌కు వ‌రుస‌గా రెండు రోజులు సెల‌వులు రాబోతున్నాయి.

ఓటర్లు ఎంత మంది?

1. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగే ఎన్నిక‌ల్లో మొత్తం ప‌ది మంది అభ్యర్థులు బ‌రిలో ఉన్నారు. 123 పోలింగ్ స్టేష‌న్లలో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మొత్తం 22,493 మంది ఓట‌ర్లు ఉన్నారు. అందులో 13,503 మంది పురుషులు, 8,985 మంది మ‌హిళ‌లు ఉన్నారు. శ్రీకాకుళం, విజ‌య‌న‌గరం, మ‌న్యం పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లా (పార్ట్‌), విశాఖ‌ప‌ట్నం, అన‌కాప‌ల్లి జిల్లాల ప‌రిధిలోని ఎన్నిక జ‌రుగుతోంది. ప‌ది మందిలో పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజ‌య‌గౌరి (యూటీఎఫ్‌), పాక‌ల‌పాటి ర‌ఘువ‌ర్మ (ఏపీటీఎఫ్‌), గాదె శ్రీ‌నివాసుల‌నాయుడు (పీఆర్‌టీయూ) మ‌ధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది.

2. ఉమ్మడి ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప‌ట్టభ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగే ఎన్నిక‌ల్లో 34 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ, ప్రధానంగా టీడీపీ అభ్యర్థి పేరాబ‌త్తుల రాజ‌శేఖ‌ర్‌, పీడీఎఫ్ అభ్యర్థి డీవీ రాఘ‌వులు మ‌ధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. మొత్తం 3,14,984 ఓట్లు ఉండ‌గా, అందులో 1,83,347 మంది ఓట‌ర్లు పురుషులు కాగా, 1,31,618 మంది మ‌హిళ‌లు ఉన్నారు. అలాగే 19 మంది ట్రాన్స్ జండ‌ర్స్ కూడా ఉన్నారు. మొత్తం 456 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాకినాడ‌, తూర్పు గోదావ‌రి, బీఆర్ అంబేడ్కర్ కోన‌సీమ‌, అల్లూరి సీతారామ‌రాజు (పార్ట్‌), ప‌శ్చిమ గోదావ‌రి, ఏలూరు (పార్ట్‌) జిల్లాల్లో పోలింగ్ జ‌రుగుతుంది.

3. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ప‌ట్టభ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గంలో 30 మంది అభ్యర్థులు బ‌రిలో ఉన్నప్పటికీ, ప్రధానంగా టీడీపీ అభ్యర్థి ఆల‌పాటి రాజేంద్రప్రసాద్ (రాజా), పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ ల‌క్ష్మణ‌రావు మ‌ధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. మొత్తం 3,46,529 ఓట్లు ఉన్నాయి. మొత్తం 416 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కృష్ణా, ఏన్టీఆర్‌, ఏలూరు (పార్ట్‌), గుంటూరు, ప‌ల్నాడు, బాప‌ట్ల (పార్ట్‌) జిల్లాల్లో పోలింగ్ జ‌రుగుతుంది.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రాజు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం