AP New Mlcs Oath : స్థానిక సంస్థల నుంచి కొత్తగా ఎన్నికైన 8 మంది ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం-andhra pradesh legislative council newly elected eight members take oath ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh Legislative Council Newly Elected Eight Members Take Oath

AP New Mlcs Oath : స్థానిక సంస్థల నుంచి కొత్తగా ఎన్నికైన 8 మంది ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం

Bandaru Satyaprasad HT Telugu
May 15, 2023 02:33 PM IST

AP New Mlcs Oath : ఏపీ శాసనమండలికి స్థానిక సంస్థల నుంచి కొత్తగా ఎన్నికైన 8 మంది ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు వారితో ప్రమాణం చేయించారు.

ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం (HT )

AP New Mlcs Oath : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి...ఇటీవల వివిధ స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన 8 మంది నూతన శాసన మండలి సభ్యులు(MLCs)గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు సోమవారం వెలగపూడిలోని అసెంబ్లీ భవనం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు నూతన సభ్యులతో ప్రమాణం చేయించారు. శాసన సభ సెక్రటరీ జనరల్ డా.పి.పి.కె.రామాచార్యులు నూతన ఎమ్మెల్సీల పేర్లను వరుస క్రమంలో పిలవగా... మండలి ఛైర్మన్ మోషేన్ రాజు వారిచే ప్రమాణం చేయించారు. ఎమ్మెల్సీలుగా కడప స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన పి.రామసుబ్బా రెడ్డి, నెల్లూరు స్థానిక సంస్థల నుంచి మేరిగ మురళీధర్, పశ్చిమ గోదావరి స్థానిక సంస్థల నుంచి కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాధ్, తూర్పు గోదావరి స్థానిక సంస్థల నుంచి కుడిపూడి సూర్యనారాయణ రావు, శ్రీకాకుళం స్థానిక సంస్థల నుంచి నర్తు రామారావు, చిత్తూరు స్థానిక సంస్థల నుంచి సుబ్రహ్మణ్యం సిఫాయి, కర్నూల్ స్థానిక సంస్థల నుంచి డా.ఎ. మధుసూదన్ ప్రమాణం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

ఈకార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సీహెచ్.శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, శాసనసభ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజు, మండలి చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ విప్ జంగా కృష్ణ మూర్తి పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థ ఎమ్మెల్సీలు వైసీపీదే హవా!

ఇటీవల జరిగిన ఏపీ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికలు జరిగిన 4 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. సంఖ్యాబలం లేకపోయినప్పటికీ బరిలో నిలిచిన టీడీపీ... ఊహించినట్లుగానే ఒక స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ విజయం సాధించారు. కవురు శ్రీనివాస్ కు 481 ఓట్లు రాగా, వంకా రవీంద్రనాథ్ కు 460 ఓట్లు పోలైయ్యాయి. మొత్తం 1105 ఓట్లు ఉండగా 1088 మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైసీపీకి చెందిన కవురు శ్రీనివాస్‌కు 481 మొదటి ప్రాధాన్యతా ఓట్లు రగా, వంకా రవీంద్రనరాథ్‌కు 460 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి వీరవల్లి చంద్రశేఖర్‌కు 120 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇటు కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచారు. ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ మధుసూధన్ రావు విజయం సాధించారు. శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నర్తు రామారావు గెలుపొందారు. నర్తు రామారావుకు 636 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థికి 108 ఓట్లు పడ్డాయి.

ఐదు స్థానాల్లో ఏకగ్రీవం

స్థానిక సంస్థల నియోజకవర్గాలకు సంబంధించి అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలకు చెందిన ఐదు స్థానాలు వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన వారంతా ఇవాళ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.

IPL_Entry_Point