AP HC on Social Media : సోషల్ మీడియాలో విమర్శిస్తే తప్పేంటి…?-andhra pradesh high court verdict on social media postings case on software engineer ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh High Court Verdict On Social Media Postings Case On Software Engineer

AP HC on Social Media : సోషల్ మీడియాలో విమర్శిస్తే తప్పేంటి…?

HT Telugu Desk HT Telugu
Dec 18, 2022 09:11 AM IST

AP HC on Social Media సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు పెడితే తప్పేంటని, రెండు సమూహాల మధ్య చిచ్చు పెట్టినట్లు ఎలా అవుతుందని ఏపీ హైకోర్టు పోలీసుల్ని ప్రశ్నించింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌‌పై పశ్చిమ గోదావరి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేసింది.

సోషల్‌ మీడియా పోస్టులపై  కేసు కొట్టేసిన హైకోర్టు
సోషల్‌ మీడియా పోస్టులపై కేసు కొట్టేసిన హైకోర్టు

AP HC on Social Media రాజకీయ నాయకుల్ని విమర్శిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం సమూహాల మధ్య విద్వేషం రెచ్చగొట్టినట్లు ఎలా అవుతుందని పశ్చిమ గోదావరి పోలీసులను ఏపీ హైకోర్టు ప్రశ్నించింది.

ట్రెండింగ్ వార్తలు

ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టారనే కారణంతో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పోలీసులు ఓ కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా చిన కాకానికి చెందిన సీహెచ్‌ గోపీకృష్ణపై 2020 మే నెలలో పశ్చిమ గోదావరి పోలీసులు నమోదుచేసిన కేసును కొట్టేసింది. పోలీసుల నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా పాలకొల్లు కోర్టులో జరుగుతున్న కేసును కొట్టేసింది.

సోషల్‌ మీడియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ పెట్టిన పోస్టు ఎవరికైనా పరువునష్టం కలిగిస్తే దానిపై అభ్యంతరాలను బాధితులే ఫిర్యాదు చేయగలరని కోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్‌పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు ఈ మేరకు తీర్పు వెలువరించారు.

గుంటూరు జిల్లా చినకాకానికి చెందిన గోపీకృష్ణ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో పాలకొల్లుకు చెందిన పసుపులేటి వీరాస్వామి 2020 మే 5న గోపీకృష్ణపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీనిపై పాలకొల్లు కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసును కొట్టేయాలని గోపీకృష్ణ ఏపీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు వేశారు. పిటిషనర్‌ తరపున న్యాయవాది కోటేశ్వరీ దేవి వాదనలు వినిపించారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన సానుభూతిపరులను వేధించడానికి తప్పుడు ఫిర్యాదు చేశారని కోర్టులో వాదించారు. వాస్తవాలను పరిశీలించకుండా పోలీసులు పిటిషనర్‌పై కేసు పెట్టారన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును పొగుడుతూ పిటిషనర్‌ పోస్టులు పెట్టారే తప్ప, రెండు గ్రూపుల మధ్య విద్వేషాలు పెంచే ప్రస్తావనే పోస్టుల్లో లేదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పిటిషనర్‌పై నమోదుచేసిన కేసును కొట్టేశారు.

ఫేస్‌బుక్‌లో పోస్టులను పరిశీలిస్తే రెండు సమూహాల మధ్య శత్రుత్వం పెంచేలా లేవన్నారు. ఫేస్‌బుక్‌ పోస్టులపై ఫిర్యాదు చేసిన వ్యక్తికి ఈ వ్యవహారంతో నేరుగా సంబంధం లేదని, ఎవరికైనా పరువు నష్టం కలిగితే వారే నేరుగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

IPL_Entry_Point