AP New Airport : ఏపీలో మరో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ప్లాన్.. ఆ ప్రాంత రూపురేఖలే మారిపోతాయ్!
AP New Airport : ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీన్ని సీఆర్డీఏ పరిధిలో నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇక్కడ ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తే.. ఆ ప్రాంత రూపురేఖలు మారిపోనున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే గన్నవరం (విజయవాడ), విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, రాజమండ్రిలో ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి. వీటి ద్వారా విమానాల రాకపోకలు సాగుతున్నాయి. అయితే.. ఎయిర్ కనెక్టివిటీని మరింత పెంచాలని కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే మరో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించాలని భావిస్తోంది.

దావోస్‌లో చర్చలు..
సీఆర్డీఏ పరిధిలో 3,000 నుంచి 5,000 ఎకరాల విస్తీర్ణంలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి నారా లోకేష్, ప్రభుత్వ అధికారులు ఎయిర్ ఇండియాతో సహా అనేక కంపెనీల ప్రతినిధులతో దావోస్‌లో సమావేశమయ్యారు. విమానాశ్రయ నిర్మాణం ప్రణాళికలపై చర్చించారు. దీంతో కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మాణం అంశం తెరపైకి వచ్చింది.
అమరావతికి సమీపంలో..
ఈ కొత్త విమానాశ్రయాన్ని అమరావతికి అతి సమీపంలో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో గన్నవరం విమానాశ్రయం ఉంది. ఇది విజయవాడ నుంచి 21.3 కిలోమీటర్ల దూరంలో ఉంది. విశాఖపట్నం వెళ్లే జాతీయ రహదారి పక్కనే ఎయిర్‌పోర్ట్ ఉంది. అయితే.. ఈ జాతీయ రహదారి నిత్యం రద్దీగా ఉంటోంది. ఇక్కడికి చేరుకోవడం కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో.. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
భూముల ధరలు పెరిగే ఛాన్స్..
కొత్త విమానాశ్రయాన్ని అమరావతికి సమీపంలో ప్లాన్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం అమరావతిలో మళ్లీ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ భూములు సరిపడా అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తే.. వివిధ కంపెనీలు తమ కార్యాలయాలను అమరావతిలో ఏర్పాటు చేస్తారని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు భూముల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.
పనులు వేగంగా..
అమరావతి ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్‌ను నిర్మిస్తే.. ఇక్కడ ఎలాంటి రద్దీ ఉండదు కాబట్టి వేగంగా పనులు జరిగే అవకాశం ఉంది. పక్కా ప్రణాళికతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మాణం చేపట్టవచ్చు. అలాగే రాజధానిలో విమానాశ్రయం ఉంటుంది. అమరావతికి వచ్చేవారు నేరుగా చేరుకోవచ్చు. అమరావతి అభివృద్ధి కూడా వేగంగా జరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.