గెస్ట్ లెక్చరర్లకు గుడ్ న్యూస్, జీతాలు భారీగా పెంచిన ఏపీ ప్రభుత్వం-ఉత్తర్వులు జారీ-andhra pradesh govt announces significant pay raise for guest lecturers in junior colleges ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  గెస్ట్ లెక్చరర్లకు గుడ్ న్యూస్, జీతాలు భారీగా పెంచిన ఏపీ ప్రభుత్వం-ఉత్తర్వులు జారీ

గెస్ట్ లెక్చరర్లకు గుడ్ న్యూస్, జీతాలు భారీగా పెంచిన ఏపీ ప్రభుత్వం-ఉత్తర్వులు జారీ

ఏపీ ప్రభుత్వం జూనియర్ కాలేజీల్లో పనిచేస్తోన్న గెస్ట్ లెక్చరర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తోన్న గెస్ట్ లెక్చరర్ల జీతాలు గంటకు రూ.150 నుంచి రూ.375కు పెంచారు. నెలకు అత్యధికంగా రూ.27 వేలుగా నిర్ణయించారు.

గెస్ట్ లెక్చరర్లకు గుడ్ న్యూస్, జీతాలు భారీగా పెంచిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తోన్న గెస్ట్ లెక్చరర్ల జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గంటకు రూ.150 పారితోషికం ఇస్తుండగా...దీనిని రూ.375కు పెంచింది. నెలకు అత్యధికంగా రూ.27000గా నిర్ణయించింది. తక్షణమే జీతాల పెంపు ఆదేశాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.

“వారు గెస్ట్ లెక్చరర్లు కాదు, మన యువత భవిష్యత్తుకు మార్గదర్శకులు. వారి సేవలకు న్యాయం చేయాలనే సంకల్పంతో జీతాలు పెంచాం. గత 10 సంవత్సరాలుగా గంటకు ఇస్తున్న రూ.150 పారితోషికాన్ని గంటకు రూ.375 కి పెంచడం ద్వారా నెల వారీ పారితోషికం గరిష్టంగా రూ.10,000 నుండి రూ.27,000 కు పెరిగింది. ఇది వారి ప్రతిభకు ప్రభుత్వం ఇచ్చిన గౌరవం”- మంత్రి నారా లోకేశ్

వేతనాలు పెంపు డిమాండ్

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న వారికి గంటకు రూ.150 చొప్పున నెలకు రూ.10,000 వరకూ గౌరవ వేతనంగా చెల్లిస్తున్నారు. గౌరవ వేతనాన్ని పెంచాలంటూ గత కొన్నేళ్లుగా గెస్ట్ లెక్చరర్లు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే గంటకు రూ.375 వరకు, గరిష్ఠంగా నెలకు రూ.27,000 చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.

పీజీ పూర్తి చేసిన వారికి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లుగా అవకాశం కల్పిస్తున్నారు. పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసి, నియామక ప్రక్రియ చేపడుతుంది. పీజీలో 60 శాతం మార్కులు సాధించిన వారిని అర్హులు నిర్ణయించారు. దీంతో పాటు ఏపీసెట్, యూజీసీ నెట్, పీహెచ్‌డీ చేసిన వారికి గెస్ట్ లెక్చరర్లగా ప్రాధాన్యత ఇస్తారు.

నియామక ప్రక్రియలో రాత పరీక్ష, ఇంటర్వ్యూలు, డెమో లెక్చర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. గెస్ట్ లెక్చరర్ల పోస్టుల కోసం ఆయా కళాశాలల ప్రిన్సిపాల్‌లు ప్రత్యేకంగా నోటిఫికేషన్‌లను విడుదల చేస్తారు. గెస్ట్ లెక్చరర్లకు అందించే వేతనం తక్కువగా ఉందని, దీనిని పెంచాలని జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు.

ఒప్పంద లెక్చరర్ల సర్వీసు పొడిగింపు

మరోవైపు ఇంటర్మీడియట్‌ విద్యలో పనిచేస్తోన్న 3,572 మంది ఒప్పంద లెక్చరర్ల సర్వీసును ఏపీ ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ మేరకు ఇటీవల పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ఉత్తర్వులు జారీచేశారు. వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి జూన్‌ 1 నుంచి 2026 ఏప్రిల్‌ 30 వరకు ఒప్పంద లెక్చరర్ల సేవలను పునరుద్ధరించారు.

ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తోన్న 3,619 మందిలో 60 ఏళ్లు నిండిన 47 మందిని మినహాయించారు. అలాగే ఒప్పంద లెక్చరర్లు గతేడాది మే నెలలో పని చేసిన కాలానికి జీతాలు ఇచ్చేందుకు విద్యాశాఖ ఆమోదం తెలిపింది.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం