Amaravati Volunteers :అమరావతిలో భూమిలేని వాలంటీర్లకు పెన్షన్..మరి వారి సంగతేంటి?-andhra pradesh government restores pensions for un employed youth of capital area villages ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh Government Restores Pensions For Un Employed Youth Of Capital Area Villages

Amaravati Volunteers :అమరావతిలో భూమిలేని వాలంటీర్లకు పెన్షన్..మరి వారి సంగతేంటి?

HT Telugu Desk HT Telugu
Feb 24, 2023 07:39 AM IST

Amaravati Volunteers ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని కోసం భూములు సమీకరించిన గ్రామాల్లో వాలంటీర్లుగా పనిచేస్తున్న నిరుద్యోగ యువతీ యువకుల కుటుంబాలకు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిలో భూమి లేని నిరుపేద యువతకు టీడీపీ హయం నుంచి ఆర్ధిక సాయాన్ని అందించినా పలు కారణాలతో రద్దయ్యాయి.

రాజధాని గ్రామాల్లో పెన్షన్ల పునరుద్ధరణ
రాజధాని గ్రామాల్లో పెన్షన్ల పునరుద్ధరణ

Amaravati Volunteers రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన గ్రామాల్లో వాలంటీర్లుగా పనిచేస్తున్న యువత కుటుంబాలకు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ప్రభుత్వం నెలనెల అందించే సాయాన్ని కొద్ది నెలల క్రితం రద్దు చేశారు. దీనిపై రాజధాని ప్రాంతంలో ఉంటున్న భూమిలేని కుటుంబాలకు చెందిన యువత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో సానుకూలంగా స్పందించారు.

ట్రెండింగ్ వార్తలు

రాష్ట్ర విభజన తర్వాత రాజధాని నిర్మాణం కోసం గుంటూరు జిల్లాలో కృష్ణా నది వెంబడి ఉన్న 29గ్రామాలను ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో ఉన్న భూముల్ని ప్రభుత్వానికి అప్పగించడంతో బదులుగా వారికి అభివృద్ధి చేసిన భూముల్ని అప్పగిస్తామని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అదే సమయంలో భూమి లేకుండా వ్యవసాయ పనులపై ఆధారపడిన గ్రామీణ యువతకు జీవనభృతిని చెల్లిస్తూ వచ్చింది. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత కొంత కాలం ఈ చెల్లింపులు నిలిచిపోయాయి. 2019 అక్టోబర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది.

గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లను క్రమబద్దీకరించిన సమయంలో వాలంటీర్లు గా పనిచేస్తున్న యువతకు గతంలో మంజూరు చేసిన జీవనభృతి పెన్షన్లను రద్దు చేశారు. వాలంటీర్లను సైతం ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడమే దీనికి కారణంగా తెలుస్తోంది. దీనిపై రాజధాని ప్రాంత రైతులు ప్రభుత్వానికి విన్నవించడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సీఎం జగన్ ఆదేశాలతో అమరావతిలో భూమి లేని గ్రామ వాలంటీర్ల కుటుంబాలకు నెలకు రూ.2,500 పెన్షన్ మంజూరు చేస్తున్నట్లు మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి వెల్లడించారు.

మార్చి ఒకటో తేదీ నుండి పెన్షన్ పధకం అమరావతి గ్రామ వాలంటీర్లకు వర్తిస్తుందని శ్రీలక్మి తెలిపారు. అమరావతిలో భూమి లేని నిరుపేద కుటుంబాలకు చెందిన యువతీ యువకులైన గ్రామ వాలంటర్లుగా పని చేస్తున్నారు. వీరిని ఉద్యోగులుగా పరిగణించి 6 పాయింట్ల వెరిఫికేషన్‌ పేరుతో అయా కుటుంబాలకు ప్రభుత్వం పెన్షన్లను రద్దు చేసింది. ఇలా రాజధానిలోని 29గ్రామాల్లో 200మంది కుటుంబాలకు పెన్షన్లను కోల్పోయినట్లు చెబుతున్నారు.

ఇటీవల పురపాలక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి అమరావతి గ్రామాల పర్యటనలో ఉన్న సమయంలో భూమి లేని నిరుపేద కుటుంబాలకు చెందిన వాలంటీర్లు, పెన్షన్లు కోల్పోయిన విషయాన్ని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దృష్టికి ఈ విషయం తెచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన శ్రీలక్ష్మి ఈ సమస్యను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని అమరావతి వాలంటీర్ల కు హామీ ఇచ్చారు. అమరావతి ప్రాంతంలో వాలంటీర్లు ఎదుర్కొంటున్న సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను వివరించారు.

దీనిపై వెంటనే స్పందించిన సీఎం జగన్ వారికి పెన్షన్లు అందించాలని ఆదేశించారు.అమరావతిలో భూమి లేని నిరుపేద కుటుంబాలకు చెందిన సుమారు 200 మంది గ్రామ వాలంటీర్ల కుటుంబాలకు మార్చి1వ తేదీ నుండి పెన్షన్ అందిస్తున్నామని మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి ప్రకటించారు. దీంతో అక్కడి నిరుపేద వాలంటీర్లకు ప్రయోజనం కలగబోతోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో చిన్నాచితక ఉద్యోగాలు చేస్తున్న వారి కుటుంబాలకు సైతం ప్రభుత్వం పెన్షన్లు రద్దు చేసింది. ఒకే కుటుంబంలో ఉంటున్నారనే కారణంతో ప్రభుత్వ ఉద్యోగులు కాకున్నా పెద్ద సంఖ్యలో పెన్షన్లను రద్దు చేశారు.

IPL_Entry_Point