AP Tidco Houses : టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన.. త్వరలో లబ్ధిదారులకు గుడ్‌న్యూస్
AP Tidco Houses : టిడ్కో ఇళ్లకు సంబంధించి మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. వీలైనంత త్వరగా టిడ్కో ఇళ్లకు మౌళిక వసతులు పూర్తి చేస్తామని చెప్పారు. కాంట్రాక్టర్ల సమస్యలపై సీఈలతో కమిటీ వేస్తామని నారాయణ స్పష్టం చేశారు. గత పాలనలో టిడ్కో ఇళ్లను నాశనం చేశారని నారాయణ ఆరోపించారు.
అసెంబ్లీలో టిడ్కో ఇళ్లపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ల లబ్దిదారుల ఎంపిక, నగదు లావాదేవీల్లో అక్రమాలపై దర్యాప్తనకు ఆదేశించారు. దేశంలోనే అత్యధికంగా ఏపీకి కేంద్రం నుంచి ఏడు లక్షల 1480 ఇళ్లను తీసుకొచ్చామని మంత్రి వివరించారు.
'2014-19 మధ్య రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఇళ్లకు పాలనాపరైన అనుమతులు ఇచ్చింది. ఇళ్ల నిర్మాణం గట్టిగా ఉండాలనే ఉద్దేశంతో షీర్ వాల్ టెక్నాలజీతో నిర్మించాం. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొత్తం నాశనం చేశారు. జగన్ చేసిన పనులన్నీ తుగ్లక్ పనులు. టిడ్కో లబ్ధిదారులు చాలా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. ఇళ్ల కోసం డీడీలు కట్టిన లబ్ధిదారులను బలవంతంగా వెనక్కి తీసుకునేలా చేశారు' అని నారాయణ వ్యాఖ్యానించారు.
'తమకు అనుకూలంగా ఉన్నవారికే గత ప్రభుత్వంలో ఇళ్లను కేటాయించారు. లబ్ధిదారుల ఎంపికలో తప్పు చేసిన అధికారులపైనా చర్యలు తీసుకుంటాం. ఇళ్ల కేటాయింపు, బ్యాంకులకు డీడీలు సమర్పించని అక్రమాలపై దర్యాప్తునకు అదేశిస్తున్నాం. ప్రస్తుతం టిడ్కో ఇళ్లకు మౌళిక వసతుల కల్పన కోసం రూ.5200 కోట్లు అవసరం. హడ్కో లేదా ఇతర బ్యాంకుల లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. వీలైనంత త్వరగా టిడ్కో ఇళ్లకు మౌళిక వసతులు పూర్తి చేస్తాం. కాంట్రాక్టర్ల సమస్యలపై సీఈలతో కమిటీ వేస్తాం' అని మంత్రి నారాయణ ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు.. హడ్కో (హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) ఇటీవల సమ్మతం తెలిపింది. రెండు రోజుల పాటు టిడ్కో అధికారులతో భేటీ అయిన హడ్కో ప్రతినిధులు ఈ మేరకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. మొత్తంగా రూ.5,070 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై సమగ్ర నివేదికను హడ్కోకు సమర్పించనున్నారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో టిడ్కో ఇళ్లు ఎంత మేర పూర్తయ్యాయి? ఎన్ని ఏయే దశల్లో ఉన్నాయి? మొత్తం ఇళ్లు పూర్తవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది అన్న వివరాలను సమగ్రంగా నివేదిక రూపంలో అందించాలని హడ్కో అధికారులు కోరారు. దీంతో దీనిపై కసరత్తు పూర్తి చేసిన మొత్తం వివరాలతో నివేదికను హడ్కోకు అందించనున్నారు.