వరదల ఎఫెక్ట్...ఉపాధ్యాయ దినోత్సవం వాయిదా… అవార్డుల ప్రదానోత్సవం కూడా
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు, వరదలతో విజయవాడ, గుంటూరుతో సహా పలు ప్రాంతాలు సతమతవుతున్నాయి. కొన్ని ప్రాంతాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 5న జరగాల్సిన ఉపాధ్యాయ దినోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు, వరదలతో విజయవాడ, గుంటూరుతో సహా పలు ప్రాంతాలు సతమతవుతున్నాయి. కొన్ని ప్రాంతాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 5న జరగాల్సిన ఉపాధ్యాయ దినోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ప్రతిఏటా సెప్టెంబర్ 5న నిర్వహించే రాష్ట్రస్థాయిలో ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సుబ్బారావు వెల్లడించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయులు పాల్గొవల్సి ఉంది. అందుకు అనుగుణంగానే అధికారులు సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం నిర్వహణకు కూడా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు కూడా సమాచారం అందించారు.
కానీ రాష్ట్రంలో అకాల వరదలు, భారీ వర్షాల కారణంగా విజయవాడ, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి తదితర జిల్లాలు సతమతమవుతున్నాయి. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది. అలాగే రాష్ట్ర పోలీసు, ఎన్‌డీఆర్ఎఫ్, వైమానిక దళం వంటి జాతీయ సంస్థలు కూడా సహాయ చర్యల్లో పాల్గొన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులందరూ వరద బాధితుల సహాయ కార్యక్రమాల్లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 5న జరగాల్సిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే పురస్కార గ్రహీతల రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్స కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు వెల్లడించారు. అయితే ఎప్పుడు నిర్వహిస్తారనే సమాచారం త్వరలోనే వెల్లడిస్తామని పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సుబ్బారావు తెలిపారు.
ఇద్దరికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
రాష్ట్రంలోని ఇద్దరు ఉపాధ్యాయులకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు లభించాయి. కృష్ణా జిల్లా గుడివాడలోని ఎస్పీఎస్ మున్సిపల్ హైస్కూల్ ఉపాధ్యాయుడు మిద్దె శ్రీనివాసరావు, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఊరందూకు జడ్పీ హైస్కూల్ సోషల్ ఉపాధ్యాయుడు కూనాటి సురేష్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక అయ్యారు. సెప్టెంబర్ 5న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే కార్యక్రమంలో వీరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేస్తారు.
ఉపాధ్యాయ దినోత్సవం
ఉపాధ్యాయ దినోత్సవం దేశంలో మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి రోజున సెప్టెంబర్ 5న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. అయితే ఆ రోజున సెలవు దినం కాదు. ఎందుకుంటే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాల్సిన రోజు. పాఠశాలలు, విద్యా సంస్థలు యధావిధిగా జరిగి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆ రోజున ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలలో పురస్కారాలు, గౌరవ సత్కారాలు జరుపుతారు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబర్ 5న జరుపుకుంటారు.
-జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు