Andhra Budget: ప్రత్యక్ష నగదు బదిలీతో రూ.1.97లక్షల కోట్లు బదిలీ చేశామన్న బుగ్గన-andhra pradesh finance minister buggana rajendra nath introduced 2023 24 financial budget in assembly ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Budget: ప్రత్యక్ష నగదు బదిలీతో రూ.1.97లక్షల కోట్లు బదిలీ చేశామన్న బుగ్గన

Andhra Budget: ప్రత్యక్ష నగదు బదిలీతో రూ.1.97లక్షల కోట్లు బదిలీ చేశామన్న బుగ్గన

HT Telugu Desk HT Telugu
Mar 16, 2023 10:56 AM IST

Andhra Budget: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో 2023-24 ఆర్ధిక సంవత్సర బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్‌ రెడ్డి ప్రవేశపెట్టారు. 2019లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో ప్రతికూల పరిస్థితులు, కోవిడ్‌ కాలంలో గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయని ఆర్ధిక మంత్రి తెలిపారు. సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్‌ రూపొందించినట్లు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌ను ముఖ్యమంత్రికి అందచేస్తున్న బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌ను ముఖ్యమంత్రికి అందచేస్తున్న బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

Andhra Budget: "పలికెడిది భాగవతమట..పలికించెడివాడు రామభద్రుంట" అంటూ బమ్మెర పోతన రచించిన పద్యాన్ని ఉటంకిస్తూ ఆర్ధిక మంత్రి బుగ్గన శాసనసభలో 2023-24 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడుగుబలహీన వర్గాలు, ప్రజల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న బాధ్యత, ప్రేమ రాష్ట్ర బడ్జెట్‌లో కనిపిస్తుందని బుగ్గన చెప్పారు.నిరంతరం కార్యదీక్షత, విశాల దృక్పథంతో పనిచేయాలని రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ సూక్తులను వివరిస్తూ బుగ్గన ప్రసంగం ప్రారంభించారు.

ఆర్ధిక మంత్రి బుగ్గన ప్రసంగం మొదలైన వెంటనే బడ్జెట్‌ ప్రసంగానికి ప్రతిపక్ష సభ్యులు అడ్డుతగలడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియకుండా అడ్డుతగులుతున్న ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి బయటకు పంపి బడ్జెట్ కొనసాగించాలని ముఖ్యమంత్రి స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.

టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు నిరసనకు దిగడంతో బెందాళం అశోక్, ఆదిరెడ్డి భవానీ, అచ్చన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జోగేశ్వరరావు, గద్దెరామ్మోహన్, మంతెన సత్యనారాయణరాజు, గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు, డోల బాలవీరాంజనేయ స్వామి, నందమూరి బాలకృష్ణ, వెలగపూడి రామకృష్ణబాబులు సభకు అడ్డు తగలడంతో వారిని సస్పెండ్ చేయాలని సిఎం స్పీకర్‌ను కోరారు. దీంతో ఆర్ధిక మంత్రి తీర్మానం ప్రతిపాదించారు. తీర్మానానికి అనుగుణంగా టీడీపీ సభ్యుల్ని ఒకరోజు పాటు సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు.

కోవిడ్ తర్వాత సుస్థిర అభివృద్ది లక్ష్యాలు, సుపరిపాలన లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నట్లు బుగ్గన చెప్పారు.ప్రపంచ స్థాయి ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే రాష్ట్రం ముందుకు సాగుతోందని చెప్పారు. స్థిరమైన అభివృద్ధికి సుపరిపాలన అవసరమని బుగ్గన చెప్పారు.సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అందుకోడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు బుగ్గన చెప్పారు.

గ్రామవార్డు సచివాలయాల ఏర్పాటు, ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 30లక్షల ఇంటి స్థలాల పంపిణీ, 44.49లక్షల మంది తల్లులకు ఆర్ధిక సాయం చేశామని చెప్పారు. సిబిఎస్‌ఈ విద్యాబోధన, ఫీజు రీయింబర్స్‌మెంట్, వైఎస్సార్ చేయూత, నవరత్నాలు, జగనన్న తోడు, ఆరోగ్య శ్రీ, ఆరోగ్య ఆసరా, సామాజిక సంక్షేమ కార్పొరేషన్లు, రైతు భరోసా కేంద్రాలు సహా ఎన్నో మార్పులు చేసినట్లు వివరించారు.

డిబిటిల ద్వారా లక్షా 97వేల కోట్ల రుపాయల బదిలీ

ప్రత్యక్ష బదిలీ పథకాల్లో లక్షా 97వేల కోట్ల రుపాయలను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా లబ్దిదారులకు పారదర్శకంగా విడుదల చేసినట్లు చెప్పారు

2018-19లో స్థూల ఉత్పత్తిలో దేశంలో ఏపీ 22వ స్థానంలో ఉందని బుగ్గన చెప్పారు. ఏపీ అభివృద్ధి విధానాల వల్ల 2020-21నాటికి రాష్ట్రం పురోభివృద్ధిలో స్థిరమైన ధరలతో దేశంలో ఒకటో స్థానానికి చేరిందని చెప్పారు. రాష్ట్రం వృద్ధి రేటు 11.43 శాతాన్ని సాధించడానికి వీలైందన్నారు. అత్యంత క్లిష్టమైన సమయాల్లో లక్ష్యాలను సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వ విజయం సాధించిందని చెప్పారు.

నవరత్నాల, మ్యానిఫెస్టో పథకాల్లో భాగంగా జీవనోపాధి, సామాజిక భద్రత, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధిలను చేరుకోవడానికి ముందుకెళుతున్నట్లు చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 62శాతం ఆధారపడి ఉన్నందున వైఎస్సార్ సున్నా వడ్డీ, రైతు భరోసా కేంద్రాలు, పొలంబడి, పరికరాలపై రాయితీ, వైఎస్సార్‌ రైతు భరోసా పిఎం కిసాన్‌ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.

భూమిని సాగుచేసే వారు అత్యంత ము‌ఖ్యమైన వారంటూ అమెరికా అధ్యక్షుడు థామస్ జెఫర్‌సన్ చేసిన వ్యాఖ‌ల్ని బుగ్గన ఉటంకించారు. అమెరికా 21లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసి అతిపెద్ద దేశాన్ని ఏర్పాటు చేశాడని గుర్తు చేశారు.మనుషులంతా ఒకేలా సృష్టించబడ్డారని థామస్ జెఫర్‌సన్‌ చెప్పారనే విషయాన్ని తమ ప్రభుత్వానికి ఎప్పుడు గుర్తుంటుందన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా-పిఎం కిసాన్‌ పథకాల ద్వారా రైతులకు మూడు విడతల్లో రూ.13,500 కేటాయిస్తున్నట్లు చెప్పారు.

2023-24 బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా..

2023-2024 బడ్జెట్ అంచనా రూ.2,79,279గా ప్రకటించారు. ఇందులో రంగాల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి.

వైయస్ఆర్ పెన్షన్ కానుక రూ.21,434.72 కోట్లు

వైఎస్ఆర్ రైతు భరోసా రూ.4,020 కోట్లు

జగనన్న విద్యా దీవెన రూ.2,841.64 కోట్లు

జగనన్న వసతి దీవెన రూ.2,200 కోట్లు

వైయస్‌ఆర్-పీఎం బీమా యోజన రూ.1600 కోట్లు

డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు

రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు

వైయస్ఆర్ కాపు నేస్తం రూ.550 కోట్లు

జగనన్న చేదోడు రూ.350 కోట్లు

వైయస్‌ఆర్ వాహనమిత్ర రూ.275 కోట్లు

వైయస్‌ఆర్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు

వైయస్ఆర్ మత్స్యకార భరోసా రూ.125 కోట్లు

మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రూ.50 కోట్లు

రైతు కుటుంబాల పరిహారం కోసం రూ.20 కోట్లు

లా నేస్తం రూ.17 కోట్లు

జగనన్న తోడు రూ.35 కోట్లు

ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు

వైయస్‌ఆర్ కల్యాణమస్తు రూ.200 కోట్లు

వైయస్ఆర్ ఆసరా రూ.6700 కోట్లు

వైయస్ఆర్ చేయూత రూ.5000 కోట్లు

అమ్మ ఒడి రూ.6500 కోట్లు

మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు

***

ధరల స్థిరీకరణ నిధి రూ.3,000 కోట్లు

వ్యవసాయ యాంత్రీకరణ రూ.1,212 కోట్లు

వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం రూ.15,882 కోట్లు

మన బడి నాడు-నేడు రూ.3,500 కోట్లు

జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు

పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ.15,873 కోట్లు

పురపాలక, పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రూ.1,166 కోట్లు

యువజన అభివృద్ధి, పర్యాటకం, సాంస్కృతిక శాఖ రూ.1,291 కోట్లు

షెడ్యూల్ కులాల కాంపొనెంట్ కోసం రూ.20,005 కోట్లు

షెడ్యూల్ తెగల కాంపొనెంట్ కోసం రూ.6,929 కోట్లు

వెనుకబడిన తరగతుల కాంపొనెంట్ కోసం రూ.38,605 కోట్లు

కాపు సంక్షేమం రూ.4,887 కోట్లు

మైనార్టీల సంక్షేమం రూ.4,203 కోట్లు

పేదలు అందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు

పరిశ్రమలు, వాణిజ్యం రూ.2,602 కోట్లు

రోడ్లు, భవనాల శాఖకు రూ.9,118 కోట్లు

నీటి వనరుల అభివృద్ధికి (ఇరిగేషన్‌) రూ.11,908 కోట్లు

పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ రూ.685 కోట్లు

ఎనర్జీ రూ.6,456 కోట్లు

గ్రామ, వార్డు సచివాలయ శాఖకి రూ.3,858 కోట్లు

గడప గడపకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు

IPL_Entry_Point