APCM Monitors : పట్టణాల్లో మౌలిక సదుపాయాల పర్యవేక్షణకు యాప్-andhra pradesh cm monitoring municipal service mobile app for public ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh Cm Monitoring Municipal Service Mobile App For Public

APCM Monitors : పట్టణాల్లో మౌలిక సదుపాయాల పర్యవేక్షణకు యాప్

HT Telugu Desk HT Telugu
Nov 25, 2022 04:31 PM IST

APCM Monitors నగరాలు, పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. సమస్యలపై సత్వర పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టడానికి దీర్ఘకాలంలో నిర్మాణాత్మక వ్యవస్థ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనికోసం పట్టణాభివృద్ధిశాఖ ‘‘ఏపీ సీఎం ఎంఎస్‌’’ ఏపీ కన్‌సిస్టెంట్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ మున్సిపల్‌ సర్వీసెస్‌ ప్రత్యేక యాప్‌ రూపొందిస్తోంది. యాప్‌తో రియల్‌టైం మానిటరింగ్‌ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. మరో నెలరోజుల్లో యాప్‌ సిద్ధం అవుతుందని అధికారులు తెలిపారు.

ఏపి సిఎం జగన్మోహన్ రెడ్డి
ఏపి సిఎం జగన్మోహన్ రెడ్డి

APCM Monitors ఆంధ్రప్రదేశ‌్‌లోని మునిసిపాలిటీలు, పట్టణాలు, కార్పొరేషన్ల పరిధిలో రోడ్లపై గుంతలు, రోడ్లకు మరమ్మతులు, పచ్చదనం, సుందరీకరణ, వీధిలైట్ల నిర్వహణ, ఫుట్‌పాత్స్, మురుగు కాల్వల్లో పూడిక తొలగించడం, భూగర్భ మురుగునీటి వ్యవస్థల నిర్వహణ, పబ్లిక్‌ టాయ్‌లెట్ల ఏర్పాటు, వాటి నిర్వహణ, ట్రాఫిక్‌ జంక్షన్లు, వాటి నిర్వహణ అంశాలపై యాప్‌ ద్వారా రియల్‌ టైం మానిటరింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

రాష్ట్రంలోని 4,119 వార్డు సచివాలయాల పరిధిలో ఈ మౌలికసదుపాయాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండేలా విధులు నిర్వహించాలని సిఎం ఆదేశించారు. వార్డు సెక్రటరీలు తమ పరిధిలో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి 12 గంటలవరకూ తనిఖీలు నిర్వహించాలని ఆదేవించారు. తమ పరిధిలోని సుమారు 6–7 కి.మీ. మేరరోడ్లపై నిరంతర పర్యవేక్షణతోపాటు, పైన పేర్కొన్న వాటిపై నిరంతర తనిఖీలు చేపట్టాలనపి ఆదేశించారు. ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే ఫొటో తీసి యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయాలని వాటిని గుర్తించి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు పౌరులకూ ఫోటోలు అప్‌లోడ్‌ చేసే అవకాశం కల్పించాలని సూచించారు.

కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా తమ దృష్టికి వచ్చిన అంశాలను యాప్‌ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్నారు. ఎప్పటికప్పుడు ఈ సమస్యలు సంబంధిత విభాగాలకు వెళ్లి అక్కడనుంచి పరిష్కారాలు లభించాలని సూచించారు. నివేదించిన ప్రతి సమస్య పరిష్కారంపైనా మానిటరింగ్‌ ఉండాలని సిఎం ఆదేశించారు.

మున్సిపల్‌ సర్వీసుల కోసం నగరాలు, పట్టణాల్లో తీసుకు వస్తున్న యాప్‌ను తర్వాత గ్రామాల్లోకూడా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. నగరాల్లో, పట్టణాల్లో రోడ్లు, మురుగునీటి కాల్వలు సహా.. ఇతర మౌలిక సదుపాయాలు నిర్వహణ బాగుండాలన్నారు. ఇప్పుడు తీసుకొస్తున్న యాప్‌ ద్వారా వచ్చే గ్రీవెన్స్‌ను పరిష్కరించే వ్యవస్థ బలోపేతంగా ఉండాలన్నారు.వర్షాకాలం సహా అన్ని కాలాల్లోనూ బాగుండేలా రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీ అంశంపైనాకూడా దృష్టిపెట్టాలన్నారు.

దీర్ఘకాలం మన్నే పద్ధతిలో రోడ్ల నిర్మాణం సాగేలా చూడాలని సీఎం ఆదేశించారు. మున్సిపల్‌ సర్వీసులు పారదర్శకంగా ప్రజలకు అందాలని, టౌన్‌ ప్లానింగ్‌ సహా ఇతరత్రా విభాగాల్లో సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్స్‌ను పరిశీలన చేయాలన్నారు. ప్రజలకు సత్వరంగా సేవలు అందడం, నిర్దేశిత సమయంలోగా అనుమతులు రావడం, అవినీతి లేకుండా చూడ్డమే లక్ష్యంగా మార్పులు తీసుకురావాలని సిఎం సూచించారు.

సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్ల్‌పై నిశిత సమీక్షచేసి తగిన ప్రణాళికను రూపొందించాలని సీఎం ఆదేశించారు. రాజమండ్రిలోనూ వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంటు నిర్మాణ ప్రతిపాదనకు సీఎం గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు. 28 అర్భన్‌ లోకల్‌ బాడీస్‌ను కవర్‌ చేస్తూ ప్లాంట్‌ నిర్మాణ చేపట్టనున్నారు. 7.5 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యంతో వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.

IPL_Entry_Point