IAS Husband Arrest:స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో ఐఏఎస్ అధికారి భర్త అరెస్ట్….
IAS Husband Arrest ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో యూపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి భర్తను సిఐడి అరెస్ట్ చేసింది. ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడ తరలిస్తున్నారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన మరికొందర్ని అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
IAS Husband Arrest ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో మాజీ సీఈఓ భర్తను ఏపీ సిఐడి ఢిల్లీలో అరెస్ట్ చేసింది. యూపీ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న సీమెన్స్ కంపెనీ మాజీ ఉద్యోగి భాస్కర్ సతీమణికి కుంభకోణంలో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ సీఈఓగా బాధ్యతలు అప్పగించినట్లు గుర్తించారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసు దర్యాప్తులో భాగంగా మాజీ ఎండీ ఆర్జా శ్రీకాంత్‌కు ఇప్పటికే సిఐడి నోటీసులు ఇవ్వగా తాజాగా సీమెన్స్ కంపెనీ మాజీ ఉద్యోగి భాస్కర్‌ను సీఐడి అరెస్ట్ చేసింది.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు సీమెన్స్ కంపెనీతో ఎంవోయూ కుదిరిన తరువాత సీమెన్స్ కంపెనీ ఉద్యోగి భాస్కర్ తన భార్య అపర్ణకు ఏపీఎస్‌ఎస్‌డీసీలో డిప్యూటీ సీఈవోగా పోస్టింగు ఇప్పించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏపీఎస్‌ఎస్‌డీసీ నాటి ఎండీ, సీఈవో గంటా సుబ్బారావుతో భాస్కర్ కుమ్మక్కయ్యారని సిఐడి ఆరోపిస్తోంది. టీడీపీ ప్రభుత్వ పెద్దల సహకారంతో ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అపర్ణను రాష్ట్రానికి డెప్యుటేషన్‌పై తీసుకువచ్చారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో భాస్కర్ భార్య అపర్ణకు డిప్యూటీ సీఈవోగా పోస్టింగు ఇచ్చారు. సీమెన్స్ కంపెనీలో భాస్కర్ కీలకంగా వ్యవహరించారు. ఆయన భార్యను డిప్యూటేషన్‌పై వచ్చిన తర్వాత ఏపీఎస్‌ఎస్‌డీసీలో డిప్యూటీ సీఈవోగా నియమించడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని, ఇది సర్వీస్ రూల్స్ ఉల్లంఘింనే అని సిఐడి అభియోగిస్తోంది. భాస్కర్ సీమెన్స్ సంస్థలో పనిచేస్తున్న విషయాన్ని దాచిపెట్టి కుంభకోణానికి సహకరించినట్లు సిఐడి ఆరోపిస్తోంది.
సీమెన్స్‌లో ఉన్నతోద్యోగిగా ఉన్న భాస్కర్….
సీమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో జీవీఎస్ భాస్కర్ గతంలో పనిచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని ఆయన ఇంట్లో బుధవారం అదుపులోకి సిఐడి అదుపులోకి తీసుకుంది. స్థానిక కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తీసుకు వస్తున్నారు. జీవీఎస్ భాస్కర్‌తో సహా ఈ కేసులో ఇప్పటి వరకు సీఐడీ 8 మందిని అరెస్టు చేసింది.
ప్రాజెక్టు విలువ పెంచి ప్రభుత్వ ఖజానాకు చిల్లు…
సీమెన్స్ ట్రైనింగ్ ప్రాజెక్టులో ప్రజా ధనాన్ని కొల్లగొట్టడంలో జీవీఎస్ భాస్కర్ ప్రధాన పాత్ర పోషించారని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. సీమెన్స్ కంపెనీ పేరుతో షెల్ కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం రూపకల్పనలో భాస్కర్ కీలకంగా వ్యవహరించారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుతో తమకేమీ తెలియదని, తమ కంపెనీ అసలు ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఇప్పటికే ప్రకటించింది.
సీమెన్స్ ఇండియా లిమిటెడ్‌కు అప్పట్లో ఎండీగా ఉన్న సుమన్ బోస్‌తో కుమ్మక్కై ఎంవోయూ కథ నడిపారని సిఐడి ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో భాస్కర్ కీలకంగా వ్యవహరించారు. అంచనాలను పెంచి ప్రాజెక్టు వ్యయాన్ని రూ.3,300 కోట్లుగా చూపించారని ఆరోపిస్తోంది. ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా పది శాతాన్ని రూ.371 కోట్లు సమకూర్చాలని లెక్కేశారు. ఎంఓయూ కుదిరిన తర్వాత సీమెన్స్ కంపెనీ కేవలం రూ.58 కోట్లు విలువైన సాఫ్ట్‌వేర్‌ను మాత్రమే సమకూర్చినట్లు తేలింది.
టీడీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే భాస్కర్ ప్రాజెక్టు వ్యయాన్ని పెంచేశారని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ప్రాజెక్టు వ్యయాన్ని థర్డ్ పార్టీ ద్వారా నిర్ధారించే సమయంలో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ డిజైన్ (సీఐటీడీ)కు నివేదికను కూడా ప్రభావితం చేసినట్లు గుర్తించారు. ఇతర నిందితులతో కలిసి సిఐడిటి అనుకూలంగా నివేదిక వచ్చేలా మేనేజ్ చేశారని ఆరోపిస్తోంది.
ప్రాజెక్టు నిధులు కొల్లగొట్టడానికి అనుకూలంగా అవగాహన ఒప్పందాన్ని తయారు చేశారని సిఐడి వాదిస్తోంది. ఒప్పందం విలువ రూ.3,300 కోట్లకు చూపించినా ప్రభుత్వం వాటాగా రూ.371 కోట్లు చెల్లించాలనే దగ్గర మాత్రం కుట్ర పన్నినట్లు గుర్తించారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో టెక్నాలజీ పార్ట్‌నర్స్‌గా ఉన్న సీమెన్స్, డిజైన్ టెక్‌లకు కేవలం రూ.371 కోట్ల వర్క్ ఆర్డర్ ఇస్తున్నట్టుగా రాయడంతో, వర్క్ ఆర్డర్ విలువ మేరకే సీమెన్స్, డిజైన్‌టెక్ కంపెనీలకు ప్రభుత్వం డబ్బు చెల్లించిందనే భావన కలిగించారు.
ప్రాజెక్టు వ్యయం రూ.3,300 కోట్లలో సీమెన్స్ కంపెనీ 90 శాతం నిధులను సీమెన్స్ సంస్థ సమకూర్చాలన్నప్రధాన అంశాన్ని.. ఆ తరువాత పేరాల్లో లేకుండా చేశారు. రూ.371 కోట్ల వర్క్ ఆర్డర్ మేరకే ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తున్నట్టు భ్రాంతి కలిగించారు. ఇదంతా నాటి ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కై చేశారని సీఐడీ దర్యాప్తులో ఆధారాలతో సహా రుజువైంది.
ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన భాస్కర్ షెల్ కంపెనీల్లో ఆయన పాత్ర ఉందని గుర్తించారు. ఎస్‌ఐఎస్‌డబ్లూ కంపెనీకి చెందిన అప్టస్ హెల్త్‌కేర్‌ను షెల్ కంపెనీగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీలకు చెల్లించిన రూ.371 కోట్లను ఈ కంపెనీ ద్వారానే విదేశీ ఖాతాలకు మళ్లించారు. ఆ షెల్ కంపెనీతో భాస్కర్‌కు సన్నిహిత సంబంధాలున్నట్టుగా సీఐడీ గుర్తించింది. త్వరలో మరిన్ని అరెస్టులు ఉంటాయని సిఐడి వర్గాలు చెబుతున్నాయి.