Jaganannaku Chebudam : త్వరలో జగనన్నకు చెబుదాం…-andhra pradesh chief minister jagan mohan reddy review on jaganannaku chebudam programme ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jaganannaku Chebudam : త్వరలో జగనన్నకు చెబుదాం…

Jaganannaku Chebudam : త్వరలో జగనన్నకు చెబుదాం…

HT Telugu Desk HT Telugu
Feb 03, 2023 07:34 PM IST

Jaganannaku Chebudam ఏపీ ప్రభుత్వం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ప్రజలను వచ్చే వినతుల్ని సంతృప్తికర స్థాయిలో పరిష్కరించడమే లక్ష‌్యంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా అత్యధిక అర్జీలు అందుకున్న ప్రభుత్వ విభాగాల అధిపతులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై సమీక్ష నిర్వహిస్తున్న సిఎం
జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై సమీక్ష నిర్వహిస్తున్న సిఎం

Jaganannaku Chebudam ప్రజల నుంచి వచ్చిన వినతులను సంతృప్తి కర స్థాయిలో పరిష్కరించడమే లక్ష్యంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కీలక శాఖల అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా అత్యధిక అర్జీలు అందుకుంటున్న ప్రభుత్వ విభాగ అధిపతులతో సమీక్ష నిర్వహించిన సిఎం అర్జీల పరిష్కారంలో అనుసరించాల్సిన విధానాలపై సమగ్రంగా చర్చించారు.

జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభానికి అధికారులు సన్నద్ధం కావాలని ఆదేశించిన ముఖ్యమంత్రి, అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. ప్రతి ప్రభుత్వ విభాగాధిపతి ప్రతి వినతిని పరిష్కారం అయ్యేంతవరకూ ట్రాక్‌ చేయాలని సూచించారు.

అందిన అర్జీలపై ప్రతి వారం ఆడిట్‌ నిర్వహించాలని, దీనిపై ప్రతి వారం నివేదికలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదుల ట్రాకింగ్, పర్యవేక్షణ జరుగుతుందా? లేదా? అన్నదానిపై ప్రతివారం కూడా సమీక్ష చేయాలని సూచించారు. అలా చేస్తేనే ఈ కార్యక్రమం సవ్యంగా సాగుతుందన్నారు.

వివిధ ప్రభుత్వ విభాగాల్లో అర్జీలు, ఫిర్యాదుల స్వీకరణకు ఇప్పటికే ఉన్న కాల్‌ సెంటర్లను అనుసంధానం చేయాలని, వివిధ విభాగాల్లో వినతుల పరిష్కారం కోసం ఇప్పటివరకూ ఉన్న పద్ధతులను మరోసారి పరిశీలించి, తిరిగి పునర్నిర్మాణం చేయాలన్నారు.

సీఎంఓతో పాటు ప్రతి ప్రభుత్వ శాఖలో కూడా జగనన్నకు చెబుదాం ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ విభాగాలు ఉండాలని, జిల్లా స్థాయిలోనూ, మండలస్థాయిలో కూడా ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్స్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మానిటరింగ్‌ యూనిట్లు మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల స్థాయిలో కూడా ఉండాలని, మానిటరింగ్‌ యూనిట్లు సమర్థవంతంగా పనిచేస్తేనే కార్యక్రమం బాగా జరుగుతుందన్నారు.

స్పందనకు అత్యంత సమర్థవంతమైన, మెరుగైన విధానమే ‘‘ జగనన్నకు చెబుదాం’’ కార్యక్రమమని చెప్పిన సిఎం, సంబంధిత విభాగంలో సరిగ్గా పని జరగలేదనే కారణంతోనే వినతులు, ఫిర్యాదులు వస్తాయని, ఇలాంటి సందర్భాల్లో వారిని సంతృప్తి పరిచేలా పరిష్కారం చూపడం అన్నది సవాల్‌తో కూడుకున్నదని చెప్పారు.

సహనం, ఓపిక, పునఃపరిశీలన, విధానాల పునర్నిర్మాణాలతో ముందుకు సాగాలన్నారు. స్పందన డేటా ప్రకారం అత్యధికంగా ఫిర్యాదులు రెవిన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, హోంశాఖ, ఆరోగ్యం–కుటుంబ సంక్షేమ శాఖల నుంచి వస్తున్నాయని, జగనన్నకు చెబుదాం ప్రారంభమైన తర్వాత ఇవే విభాగాలనుంచి వినతులు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.

అయా శాఖలకు చెందిన విభాగాధిపతులు అర్జీల పరిష్కారంపై మరింత దృష్టిపెట్టాల్సి ఉంటుందన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై సిబ్బందికి ఓరియెంటేషన్‌ ఇవ్వాలని, మానిటరింగ్‌ యూనిట్లు ఏర్పాటుపైకూడా మార్గదర్శకాలు రూపొందించాలన్నారు.

నిర్దేశిత సమయంలోగా వినతులు పరిష్కారం కావాలని, ఆ సమయంలోగా పరిష్కారం కావడం, పరిష్కారంలో నాణ్యత ఉండడం అన్నది చాలా ముఖ్యమని ముఖ్యమంత్రి ఆదేశించారు. పరిష్కారం అయిన తర్వాత వినతులిచ్చిన వారి నుంచి లేఖ తీసుకోవాలని, పలానా అర్జీని తిరస్కరించాల్సిన నేపథ్యంలో అక్కడ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సిఎం సూచించారు.

తిరస్కరణకు గురైనా జరిగిన ప్రక్రియపై అర్జీదారులు సంతృప్తి వ్యక్తం చేసేలా ఉండాలని, అవినీతికి సంబంధించి అంశాలను చాలా గట్టిగా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. తప్పు చేయడానికి భయపడే పరిస్థితి ఉండాలని, పోలీసులకు వచ్చే అర్జీల పరిష్కారానికి మండల స్థాయిలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

పోలీసులు, రెవిన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్‌ అధికారులతో కూడిన మండల, మున్సిపల్‌ స్ధాయి సమన్వయ కమిటీ ప్రతివారం సమావేశం కావాలన్నారు. వారంలో ఒకరోజు సమావేశమై అర్జీల పరిష్కారంపై దృష్టిపెట్టాలని ఆదేశించిన ముఖ్యమంత్రి ప్రభుత్వ విభాగాధిపతులు త్వరలో కలెక్టర్లతో సమావేశం నిర్వహించి.. వారికీ అవగాహన కల్పించాలని ఆదేశించారు.

Whats_app_banner