AP Cabinet Decisions:సబ్ ప్లాన్ పదేళ్లు పొడిగింపు..రిటైర్మెంట్ వయసు పెంపు
AP Cabinet Decisions ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఏపీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను పదేళ్లు పొడిగించడంతో పాటు లైబ్రరీ ఉద్యోగులు, ఎయిడెడ్ టీచర్ల పదవీ విరమణ వయసును కూడా 62ఏళ్లకు పెంచాలని నిర్ణయించారు.
AP Cabinet Decisions ఎస్సీ సబ్‌ప్లాన్ చట్ట సవరణ ద్వారా రాష్ట్రంలో మరో పదేళ్లపాటు ఉపప్రణాళికను పొడిగించే ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఏపీ క్యాబినెట్ భేటీ జరిగింది. జిల్లా గ్రంథాలయ సంస్థల్లో, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసుని 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలోని 5,388 ప్రభుత్వ హైస్కూళ్లలో నైట్‌వాచ్‌మన్‌లను నియమించాలని, వారికి నెలకు రూ.6 వేల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. 'ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సేఫ్టీ అండ్ మిల్క్ స్టాండర్డ్ బిల్లు'కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పాడి రైతులతోపాటు, వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ఆ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులు, పలు చట్టాల సవరణ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆస్కార్ అవార్డు సాధించిన నాటు...నాటు.. పాట రూపకల్పన చేసినవారికి, ఆర్‌ఆర్‌ఆర్ యూనిట్‌కు కేబినెట్ అభినందనలు తెలిపింది. తెలుగు పాటకు లభించిన అరుదైన గౌరవంగా పేర్కొన్నారు.
విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు విజయవంతం కావడంతోముఖ్యమంత్రి కృషిని కొనియాడారు. ప్రభుత్వ విశ్వసనీయత, పనితీరుకు ఈ సదస్సు అద్దం పట్టిందని మంత్రివర్గ సభ్యులు కొనియాడారు. ముఖ్యమంత్రిని ప్రశంసిస్తూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఏప్రిల్ నెలలో 3వ తేదీన న పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు కావడం, రెండవ తేదీన ఆదివారం కావడంతో మూడో తేదీన పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబల్ యాక్ట్ –2019 సవరణలకు సంబంధించిన డ్రాప్ట్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ సబ్ ప్లాన్ అండ్ ట్రైబల్ సబ్ ప్లాన్ (ఆర్ధిక వనరుల ప్రణాళిక, కేటాయింపు మరియు వినియోగానికి సంబంధించి) యాక్ట్ –2013 సవరణలకు సంబంధించిన డ్రాప్ట్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
సంక్షేమహాస్టళ్లలో విద్యార్ధులకు మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పించేందుకు మరింత సూక్ష్మస్ధాయిలో పర్యవేక్షణ నిమిత్తం ప్రస్తుతం ఉన్న అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ల సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకునేందుకు నిర్ణయించారు.
సంక్షేమశాఖల్లో ప్రస్తుతం ఉన్న అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్లను సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ లలో క్లస్టర్ల వారీగా నియామకాలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మూడు మండలాలను ఒక క్లస్టర్‌గా నిర్ణయించి... ఏడాది కాలపరిమితితో ఒక అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్‌ను నియమించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ ఛైర్మన్, సభ్యుల పదవీ కాలానికి సంబంధించి... ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ యాక్టు 2019 సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఛైర్మన్, సభ్యుల పదవీకాలాన్ని మూడు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలకు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. తెలిపింది. పదవీకాలం ముగిసిన తర్వాత కూడా అదనంగా మరో రెండేళ్లు పొడిగించేలా మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ కమిషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ కమిషన్ పదవీకాలానికి సంబంధించి... ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ యాక్టు 2019 సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కమిషన్ పదవీకాలాన్ని మూడు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలకు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. పదవీకాలం ముగిసిన తర్వాత కూడా అదనంగా మరో రెండేళ్లు పొడిగించేలా మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీస్ కమిషన్ యాక్టు 1998 సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శక నియమావళిని అనుసరించి వక్ఫ్ రూల్స్ సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీ మహిళా కమిషన్ పదవీకాలానికి సంబంధించి ఏపీ వుమెన్ కమిషన్ యాక్టు –1998 సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపారు. మహిళా కమిషన్ టెన్యూర్‌ను ఐదు సంవత్సరాల నుంచి రెండేళ్లకు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీ గ్రామ సచివాలయాలు మరియు వార్డు సచివాలయాలు –2022 ఆర్డినెన్స్‌కు బదులుగా ఏపీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాల–2023 బిల్లు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీ కార్ల్– పులివెందులలో అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్ కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ద మిల్క్ ప్రోక్యూర్‌మెంట్( ప్రొటక్షన్ ఆఫ్ ఫార్మర్స్) అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సేప్టీ ఆఫ్ మిల్క్ స్టాండర్డ్స్ బిల్లు –2023 ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బిల్లు ద్వారా పాల సేకరణకు సంబంధించి పాడి రైతుల ప్రయోజనాలతో పాటు వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ మీడియా అక్రిడిటేషన్ రూల్ –2019కు మార్పులు చేస్తూ... సమగ్ర నూతన విధానానికి సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జిల్లా గ్రంధాలయ సంస్ధల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లు నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తూ... ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ యాక్టు –1960ను సవరిస్తూ... ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ అమెండ్‌మెంట్ ఆర్డినెన్స్ –2022 ప్రతిపాదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఎయిడెట్, ప్రైవేటు ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్‌లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లు నుంచి 62 ఏళ్లకు పొడిగించారు. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్టు –1982ను రీప్లేస్ చేస్తూ... ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఆర్డినెన్స్ –2022 ప్రతిపాదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.