Funds To Churches : చర్చిలకు ప్రభుత్వ నిధులు… కోర్టుకెళ్తామన్న బీజేపీ…-andhra pradesh bjp fires on government funds and gran in aid to churches construction ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh Bjp Fires On Government Funds And Gran In Aid To Churches Construction

Funds To Churches : చర్చిలకు ప్రభుత్వ నిధులు… కోర్టుకెళ్తామన్న బీజేపీ…

HT Telugu Desk HT Telugu
Nov 19, 2022 09:10 AM IST

Funds To Churches ప్రజల సొమ్ముతో చర్చిల మరమ్మతులు, నిర్మాణాలకు నిధులు కేటాయించడాన్ని బీజేపీ తప్పు పడుతోంది. ఏపీలో నియోజక వర్గానికి కోటి రుపాయల చొప్పున ఆ పార్టీ తప్పు పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై న్యాయపోరాటం చేయాలని ఆ పార్టీ భావిస్తోంది.

ఏపీలో చర్చిలకు ప్రభుత్వ నిధుల కేటాయింపుపై బీజేపీ ఆగ్రహం
ఏపీలో చర్చిలకు ప్రభుత్వ నిధుల కేటాయింపుపై బీజేపీ ఆగ్రహం

Funds To Churches ప్రజల పన్నుల సొమ్ముతో చర్చిల నిర్మాణం చేపట్టాలనే ప్రభుత్వ నిర్ణయంపై న్యాయపోరాటం చేయాలని బీజేపీ భావిస్తోంది. ప్రజాధనాన్ని చర్చిల నిర్మాణానికి కేటాయించడంపై న్యాయపోరాటం చేస్తామని ఏపీ బీజేపీ ప్రకటించింది. ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడటం దారుణమని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చిల నిర్మాణం, మరమ్మతుల కోసం నియోజకవర్గానికి రూ. కోటి విడుదల చేయడం రాజకీయ దుమారానికి కారణం అవుతోంది. ప్రజల కట్టిన పన్నుల డబ్బుతో ఓటు బ్యాంకు రాజకీయాలు, మత రాజకీయాలా సిగ్గుచేటని ఏపీ బీజేపీ మండి పడింది. ప్రజల అభివృద్ధిని వారి సంక్షేమాన్ని గాలికి వదిలేసి అధికారాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా డబ్బుల పంపిణీతో పాలన సాగిస్తున్నారని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఇమామ్ లకు, మౌజంలకు, పాస్టర్లకు నెల నెలా క్రమం తప్పకుండా జీతాలు ఇస్తూ, వారి జీతాలను పెంచుతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

నెలవారీగా ప్రజలు పన్నులుగా కట్టిన డబ్బులను మత వ్యవహారాలకు వినియోగిస్తున్న ప్రభుత్వం కొత్తగా చర్చిల నిర్మాణాలకు, వాటి రిపేర్లకు నియోజక వర్గానికి కోటి చొప్పున కేటాయించడం అంటే వైసీపీ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలను పతాకస్థాయికి చేర్చడమేనని ఆరోపించారు.

ఒకవైపు బలవంతపు మతమార్పిడులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తుంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వాటిని ప్రోత్సహించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు కట్టిన పన్నులను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవడాన్ని తప్పు పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ప్రకటించారు. నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం చేయడంతో పాటు కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు.

చర్చిల నిర్మాణానికి నియోజకవర్గానికి రూ. కోటి చొప్పున మంజూరు చేస్తూ ఏపీ సర్కార్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఏపీలో మొత్తం 175 నియోజకవర్గాలు ఉన్నాయి. రూ. 175 కోట్లతో చర్చిల నిర్మాణం, చర్చిల మరమ్మతులు, ఇతర పనులకు ఈ నిధులను వినియోగించనున్నారు. జిల్లా కేంద్రాలకు మరో కోటి చొప్పున అదనంగా మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానంలో ప్రభుత్వం అందించనుంది. మొత్తంగా నియోజకవర్గాలు.. జిల్లా కేంద్రాలకు కలిపి రెండు వందల కోట్లపైనై ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు.

ప్రైవేటు చర్చిలకు ప్రజాధనం ఇవ్వడం చట్ట విరుద్ధమని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రజలు పన్నులుగా కట్టిన డబ్బులను మత పరమైన కట్టడాలకు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని బీజేపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. గతంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఎంపీ ల్యాడ్స్ నిధులను చర్చిల నిర్మాణం కోసం ఇవ్వడం జాతీయ స్థాయిలో వివాదాస్పదమయింది. ఈ అంశంపై కేంద్రం కూడా విచారణ జరుపుతోంది. అయినా ఇప్పుడు నేరుగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. చర్చిలు ప్రభుత్వానివి ఉండవని క్రిస్టియన్ సంస్థల ఆధ్వర్యంలో వాటి నిర్వహణ ఉంటుందని, ప్రైవేటు చర్చిలకు ప్రభుత్వం కోట్లు ఇవ్వడం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని బీజేపీ నేతలు చెబుతున్నారు.

IPL_Entry_Point