AP Assembly Session Live Updates: 172 మంది ఎమ్మెల్యేల ప్రమాణం పూర్తి - అసెంబ్లీ రేపటికి వాయిదా-andhra pradesh assembly live news updates ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Assembly Session Live Updates: 172 మంది ఎమ్మెల్యేల ప్రమాణం పూర్తి - అసెంబ్లీ రేపటికి వాయిదా
ఏపీ అసెంబ్లీలో శాసనసభ్యుడిగా చంద్రబాబు ప్రమాణం

ఏపీ అసెంబ్లీలో శాసనసభ్యుడిగా చంద్రబాబు ప్రమాణం

AP Assembly Session Live Updates: 172 మంది ఎమ్మెల్యేల ప్రమాణం పూర్తి - అసెంబ్లీ రేపటికి వాయిదా

Updated Jun 21, 2024 02:21 PM ISTUpdated Jun 21, 2024 02:21 PM IST
  • Share on Facebook
Updated Jun 21, 2024 02:21 PM IST
  • Share on Facebook

  • AP Assembly Session Live Updates: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 16వ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చే ముందు వెంకటపాలెంలో చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

Fri, 21 Jun 202408:51 AM IST

శాసనసభ రేపటికి వాయిదా

శాసనసభ రేపటికి వాయిదా పడింది .అందుబాటులో లేని, ఇతర కారణాలతో ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రమాణం చేయలేదు. ఇవాళ 172 మందితో ప్రొటెం స్పీకర్‌ బుచ్చయ్యచౌదరి ప్రమాణం చేయించారు. రేపు ఉదయం 10.30 గంటలకు తిరిగి సభ ప్రారంభం కానుంది. రేపు జీవీ ఆంజనేయులు, పితాని, వనమాడి వెంకటేశ్వరరావు ప్రమాణం చేయనున్నారు.

Fri, 21 Jun 202408:18 AM IST

ఏపీ అసెంబ్లీ వాయిదా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తి కావడంతో సభను రేపటికి వాయిదా వేశారు. శనివారం ఏపీ అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక జరుగనుంది.

Fri, 21 Jun 202408:00 AM IST

శాసన సభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు నామినేషన్

శాసనసభ స్పీకర్ గా చింతకాలయ అయ్యన్నపాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. అయ్యన్నపాత్రుడు తరపున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ,మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్ అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

Fri, 21 Jun 202407:48 AM IST

ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది. శాసనసభ్యుడిగా ప్రమాణం చేసిన తర్వాత వైసీపీ అధ్యక్షుడు జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో కాసేపు భేటీ అయ్యారు.

Fri, 21 Jun 202407:01 AM IST

ఎమ్మెల్యేగా రఘురామ ప్రమాణం

ఉండి ఎమ్మెల్యేగా రఘురామ కృష్ణంరాజు ప్రమాణం చేశారు.

Fri, 21 Jun 202406:22 AM IST

నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది.

ఏపీ అసెంబ్లీలో సిఎం చంద్రబాబుకు ఎమ్మెల్యేల నుంచి ఘన స్వాగతం లభించింది. నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.

Fri, 21 Jun 202406:18 AM IST

ఏపీ అసెంబ్లీ వాయిదా

ఏపీ శాసన సభ టీ బ్రేక్ కోసం వాయిదా పడింది.

Fri, 21 Jun 202405:42 AM IST

అంత:కరణ శుద్ధితో మాయం…

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో శాసనసభ్యుల ప్రమాణంలో చాలామందికి నోరు తిరగని పదం మాయమైంది. పలువురు సభ్యులు తడబడి, పలకడానికి తత్తరపడే అంత: కరణ శుద్ధితో పదాన్ని తొలగించారు. స్వీకరించే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తామని ప్రమాణాన్ని సవరించారు.

Fri, 21 Jun 202405:34 AM IST

అసెంబ్లీ వెనుక గేటు నుంచి శాసనసభలోకి జగన్

ఏపీ శాసనసభా సమావేశాల నేపథ్యంలో మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి శాసనసభ ప్రాంగణం వెనుక గేటు నుంచి అసెంబ్లీలోకి ప్రవేశించారు. రాజధాని గ్రామాల రైతుల నిరసనలకు దిగుతారనే ఉద్దేశంలో వెనుకవైపు నుంచి సభలోకి ప్రవేశించారు.

Fri, 21 Jun 202405:20 AM IST

ఛాంబర్‌కు వెళ్లిపోయిన జగన్

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత వైసీపీ అధ్యక్షుడు జగన్ శాసనసభ ఆవరణలోని తన ఛాంబర్‌కు వెళ్లిపోయారు. సభలో సభ్యులకు అభివాదం చేసి అసెంబ్లీ హాల్ నుంచి బయటకు వెళ్లిపోయారు.

Fri, 21 Jun 202405:05 AM IST

ఆంగ్లంలో ప్రమాణం చేసిన అదితి గజపతరాజు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో శాసనసభ్యుల ప్రమాణ స్వీకారంలో అదితి గజపతిరాజు ఇంగ్లీషులో ప్రమాణం చేశారు.

Fri, 21 Jun 202404:56 AM IST

వైఎస్‌ జగన్ మోహన్ అనే నేను…

ఏపీ అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. సీఎం, డిప్యూటీ సిఎం, మంత్రులు ప్రమాణం చేసిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు జగన్ ప్రమాణం చేశారు. తొలుత వైఎస్‌ జగన్‌ అనే అని పలికిన జగన్ తర్వాత రెండోసారి జగన్ మోహన్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణం చేశారు.

Fri, 21 Jun 202404:48 AM IST

మంత్రుల ప్రమాణం

ఏపీ శాసనసభలో సిఎం, డిప్యూటీ సిఎం ప్రమాణం చేసిన తర్వాత అక్షర క్రమంలో క్యాబినెట్ మంత్రులు ప్రమాణం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్‌తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌తో పాటు బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ మంత్రిగా ప్రమాణం చేశారు.

Fri, 21 Jun 202404:28 AM IST

అక్షర క్రమంలోనే ప్రమాణ స్వీకారం

చంద్రబాబు ప్రమాణం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్‌ శాసనసభలో ప్రమాణం చేశారు. అనంతరం ఏపీ హోంమంత్రి అనిత, అచ్చన్నాయుడు అక్షర క్రమంలో ప్రమాణం చేశారు.

Fri, 21 Jun 202404:26 AM IST

శాసనసభ్యుడిగా పవన్ కళ్యాణ్ ప్రమాణం

ఏపీ అసెంబ్లీలో శాసన సభ్యుడిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ ప్రమాణం చేశారు. అనంతరం ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అభినందనలు తెలిపారు.

Fri, 21 Jun 202404:25 AM IST

ప్రతిపక్ష నాయకుడు లేకుండా స్పీకర్ వద్దకు చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ సంప్రదాయాల ప్రకారం శాసనసభా పక్ష నాయకుడిని ప్రతిపక్ష నాయకుడితో కలిసి ప్రొటెం స్పీకర్ వద్దకు వెళ్లే ఆనవాయితీ ఉంది. సభ్యుల ప్రమాణ స్వీకారానికి జగన్ గైర్హాజరు కావడంతో చంద్రబాబు ఒక్కరే స్పీకర్‌ను అభినందించారు.

Fri, 21 Jun 202404:23 AM IST

నారా చంద్రబాబు నాయుడు అనే నేను..

ఏపీ అసెంబ్లీలో సిఎం నారా చంద్రబాబు నాయుడు శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు. శాసనసభ్యునిగా ఎన్నికైనందున, శాసనం ద్వారా నిర్మితమైన భారతరాజ్యాంగం పట్ల నిజమైన విధేయత చూపుతానని, సమగ్రత కాపాడతానని, స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేశారు.సభ నియమాకాలకు కట్టుబడి, వాటిని అనుసరిస్తూ, సభా మర్యాదలు కాపాడతానని, సంప్రదాయాలు కాపాడతానని దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

Fri, 21 Jun 202404:22 AM IST

అందుబాటులో ఉన్న స్థానాల్లో కూర్చోవచ్చు

ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు శాసనసభలో కొత్తగా ఎన్నికైన సభ్యులు అందుబాటులో ఉన్న స్థానాల్లో కూర్చునేందుకు ప్రొటెం స్పీకర్ అనుమతించారు.

Fri, 21 Jun 202404:20 AM IST

16వ శాసనసభ ప్రారంభం

కొత్త సభ్యుల ప్రమాణాన్ని ప్రొటెం స్పీకర్ ప్రారంభించారు. శాసనసభ్యుడిగా, శాసన సభ నిబంధనలను పాటించేలా రెండు సార్లు ప్రమాణం చేయాల్సి ఉంటుంది.

Fri, 21 Jun 202404:19 AM IST

ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన సభ ప్రారంభమైంది. శాసన సభ కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్యను ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య నియామకాన్ని ప్రకటించారు.

Fri, 21 Jun 202404:18 AM IST

గౌరవసభకు స్వాగతం నినాదాలు…

ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. గౌరవ సభకు స్వాగతం అంటూ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు.

Fri, 21 Jun 202404:17 AM IST

ఎమ్మెల్యేగా తొలిసారి లోకేష్‌…

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా తొలిసారి లోకేష్‌ అడుగుపెట్టారు.

Fri, 21 Jun 202404:12 AM IST

చంద్రబాబుకు స్వాగతం పలికిన పవన్ కళ్యాణ్

ఏపీ అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ స్వాగతం పలికారు. అనంతరం సిఎం ఛాంబర్‌లో కొలువుదీరిన చంద్రబాబులు వేద పండితులు ఆశీర్వచనాలు అందచేశారు.

Fri, 21 Jun 202404:11 AM IST

శాసనసభకు చేరిన చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ ప్రాంగణానికి ముఖ్యమత్రి చేరుకున్నారు. మూడున్నరేళ్ల క్రితం ఏ మార్గంలో బయటకు వెళ్లారో అదే మార్గంలో సభకు చేరుకున్నారు. శాసనసభలో ఎమ్మెల్యేల ప్రవేశ మార్గంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శాసనసభా ప్రాంగణానికి సీఎం చంద్రబాబు ప్రణమిల్లారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్చరణాలతో స్వాగతం పలికారు.

Fri, 21 Jun 202404:10 AM IST

జగన్‌కు కూడా ప్రోటోకాల్

ఏపీ అసెంబ్లీలో కొత్త సభ్యుల ప్రమాణం సందర్బంగా ప్రతిపక్ష నాయకుడు జగన్‌కు ప్రోటోకాల్ ఇవ్వాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు. జగన్ వాహనాన్ని సభా ప్రాంగణంలోకి అనుమతించాలని అధికారుల్ని ఆదేశించారు. సిఎం, డిప్యూటీ సిఎం తర్వాత జగన్‌ను ప్రమాణం చేయనున్నారు.

Fri, 21 Jun 202403:57 AM IST

ఎమ్మెల్యేల మార్గంలోనే చంద్రబాబు

ఏ మార్గంలో బయటకు వెళ్లారో అదే మార్గంలో చంద్రబాబు శాసన సభలో అడుగుపెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన సంఖ్యాబలం లేకపోవడంతో గేటు బయట దిగి కాలినడకనే లోపలకు రావాల్సి ఉంటుందని, జగన్ వాహనాన్ని లోపలకు అనుమతించాలని చంద్రబాబు ఆదేశించారని శాసన సభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. చిన్న చిన్న అంశాలను రాజకీయం చేయొద్దని జగన్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని తమకు స్పష్టం చేశారని, సిఎం, డిప్యూటీ సిఎం తర్వాత జగన్‌కు ప్రమాణం చేసే అవకాశం ఇవ్వాలని అధికారులకు ఆదేశించినట్టు పయ్యావుల చెప్పారు.

Fri, 21 Jun 202403:54 AM IST

శాసన సభకు చేరుకున్న పవన్ కళ్యాణ్

ఏపీ అసెంబ్లీ ప్రాంగణానికి జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పవన్‌తో పాటు జనసేన ఎమ్మెల్యేలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

Fri, 21 Jun 202403:51 AM IST

ఎన్టీఆర్‌కు చంద్రబాబు నివాళులు

శాసనసభకు వెళ్లే ముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి సిఎం చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నివాళులు అర్పించారు. చంద్రబాబు వెంట బాలకృష్ణ, అచ్చన్నాయుడు, శ్రావణ్ కుమార్‌, సవిత ఇతర ఎమ్మెల్యేలు ఉన్నారు.

Fri, 21 Jun 202405:22 AM IST

రెండున్నరేళ్ల తర్వాత శాసనసభకు

2021 నవంబర్‌లో ఏపీ అసెంబ్లీ సమావేశాలను చంద్రబాబు బహిష్కరించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులపై సభలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ సభలో అడుగు పెట్టనని శపథం చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్లీ శాసనసభలో నేడు అడుగు పెడుతున్నారు.

Fri, 21 Jun 202403:44 AM IST

పసుపు చొక్కాలతో సభకు…

టీడీపీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలు పసుపు చొక్కాలతో తొలిరోజు సభకు హాజరు కానున్నారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో టీడీపీకి 164మంది సభ్యుల బలం ఉంది. జనసేనకు 12మంది, వైసీపీకి 11మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

Fri, 21 Jun 202403:43 AM IST

వెంకటపాలెంలో కోలాహలం

2016-19 మధ్య కాలంలో అసెంబ్లీ సమావేశాలకు ముందు వెంకటపాలెం గ్రామంలో ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించి శాసనసభకు వెళ్లే ఆనవాయితీని చంద్రబాబు కొనసాగిస్తున్నారు.

Fri, 21 Jun 202403:42 AM IST

వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు

ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు వెంకటపాలెం గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి సిఎం చంద్రబాబు నివాళులు అర్పిస్తారు. టీడీపీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలతో కలిసి శాసనసభకు చేరుకుంటారు.

Fri, 21 Jun 202403:40 AM IST

మరికాసేపట్లో ప్రమాణం చేయనున్న చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేస్తారు.