March 06 Telugu News Updates : ఎంపీ అవినాష్‌ రెడ్డికి మళ్లీ నోటీసులు..-andhra pradesh and telangana telugu news updates 06 march 2023 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh And Telangana Telugu News Updates 06 March 2023

వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌కు మళ్లీ నోటీసులు(MINT_PRINT)

March 06 Telugu News Updates : ఎంపీ అవినాష్‌ రెడ్డికి మళ్లీ నోటీసులు..

01:50 PM ISTHT Telugu Desk
  • Share on Facebook
01:50 PM IST

  • వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సిబిఐ మరోమారు నోటీసులు జారీ చేసింది. నేడు విచారణకు రావాలని నోటీసులివ్వగా ముందస్తు కార్యక్రమాలతో రాలేనని అవినాష్ తెలిపారు. దీంతో ఈ నెల 10వ తేదీన విచారణకు రావాలని సిబిఐ మరో నోటీసు జారీ చేసింది. అవినాష్ రెడ్డి తండ్రికి సైతం నోటీసులిచ్చింది.

Mon, 06 Mar 202301:50 PM IST

మెడికల్ కాలేజీలపై ఆర్టీఐ సమాధానం..

రాష్ట్రానికి మెడికల్ కళాశాలల కేటాయింపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పీఎంఎస్ఎస్వై స్కీమ్ కింద తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని వైద్య కళాశాలలు కేటాయించారంటూ... ఆర్టీఐ యాక్టివిస్ట్ ఇనగంటి రవికుమార్ అడిగిన ప్రశ్నకు... కేంద్ర ఆరోగ్య శాఖ సమాధానం ఇచ్చింది. పీఎంఎస్ఎస్వై మొదటి మూడు విడతల్లో.. తెలంగాణ ప్రభుత్వం ఎన్ని మెడికల్ కళాశాలలు, ఏ ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిందో తెలపాలంటూ కోరగా.... మూడు విడతల్లో దేశవ్యాప్తంగా 157 కళాశాలలు మంజూరు చేశామని కేంద్రం బదులిచ్చింది. ఏ దశలోనూ.. తెలంగాణ సర్కార్ ప్రతిపాదనలు పంపలేదని ఆర్టీఐ ద్వారా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. నాలుగో దశ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ... నాలుగో విడత ఇంకా ప్రారంభించలేదని, రాష్ట్రాల నుంచి ఇంకా ఎలాంటి ప్రతిపాదనలు ఆహ్వానించలేదని స్పష్టం చేసింది.

Mon, 06 Mar 202312:47 PM IST

రేవంత్ యాత్రకి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశం

టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యాత్రకు పూర్తి భద్రత కల్పించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టగా... యాత్ర సందర్భంగా రేవంత్ చుట్టూ 69 మంది భద్రత సిబ్బందిని ఏర్పాటు చేశామని ప్రభుత్వం తరపున న్యాయవాదులు పేర్కొన్నారు. అయితే.. అది కేవలం యాత్ర, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ కోసమే అన్న రేవంత్ న్యాయవాదులు... అదనపు భద్రత కల్పించాలని కోరారు. ఇరువురి వాదనలు నమోదు చేసుకున్న న్యాయస్థానం... రేవంత్ యాత్రకు పూర్తి భద్రత కల్పించాలని.. నైట్ హాల్ట్ లోనూ సెక్యూరిటీ కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Mon, 06 Mar 202312:42 PM IST

జయరాం హత్య కేసులో తీర్పు

చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్ట్ తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డిని దోషిగా తేల్చిన న్యాయస్థానం.. ముగ్గురు పోలీస్ అధికారులని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నా మొత్తం 12 మందిలో రాకేష్ రెడ్డి మినహా మిగతా 11 మందిని నిర్దోషులుగా పేర్కొంటూ.. నాంపల్లి కోర్టు తీర్పు చెప్పింది. దోషిగా తేలిన రాకేశ్ రెడ్డికి మార్చి 9న న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనుంది. 2019 జనవరి 31న జయరాంను.. రాకేశ్ రెడ్డి హత్య చేశాడు. 

Mon, 06 Mar 202312:35 PM IST

తిరుమలలో.. “శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి”..

మార్చి 7న తిరుమల శ్రీ కుమారధార తీర్థ ముక్కోటికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులను ఉదయం 6 గంటల నుంచి తీర్థానికి అనుమతిస్తారు. కుమారధార తీర్థం ముక్కోటికి వెళ్లే భక్తులకు డ్యాం వద్ద అన్నప్రసాదం మరియు తాగు నీరు అందిస్తారు.  గుండె సంబంధిత వ్యాధులు, ఆస్తమా, స్థూలకాయం, రక్తపోటు ఉన్న భక్తులు మరియు వృద్ధులు ట్రెక్కింగ్ చేయ వద్దని టీటీడీ అధికారులు కోరారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పాప వినాశనం నుంచి కుమారధార తీర్థ ప్రవేశం మార్గం మూసివేయబడుతుందని.. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు.

Mon, 06 Mar 202312:32 PM IST

జీఐఎస్ ఒప్పందాలు గ్రౌండింగ్ చేస్తాం..

విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ - జీఐఎస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని.. పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు... రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. దాదాపు 352 ఎంఓయూలు, రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, 6 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పనకు విశాఖ వేదిక కావడం సంతోషకర విషయమన్నారు. జీఐఎస్ ఎంఓయూలు కూడా తప్పనిసరిగా కార్యరూపం దాలుస్తాయని చెప్పారు. వచ్చే కొన్ని నెలల్లో, నెలకు కనీసం రెండు పరిశ్రమలు గ్రౌండ్‌ అయ్యే విధంగా చర్యలు చేపడతామని... పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని వివరించారు. జీఐఎస్‌పై దేశ వ్యాప్తంగా ఇప్పటికే చర్చ మొదలైందని చెప్పారు. 

Mon, 06 Mar 202312:31 PM IST

కేసీఆర్ పై బండి ఫైర్..

దేశంలో ఇప్పటి వరకు బంగారం, డబ్బు ఎత్తికెళ్లే దొంగలను చూశామని.... కానీ డెడ్ బాడీని ఎత్తికెళ్లే నీచమైన వాళ్లను కేసీఆర్ ప్రభుత్వంలోనే చూస్తున్నామని... రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో మహిళలు రోడ్డు మీద తిరగలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళల మాన, ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని, సీఎం బిడ్డ చేతికున్న వాచీకున్న విలువ మహిళలకు లేకుండా పోయిందన్నారు. సీఎం బిడ్డ చేతి వాచీ విలువ రూ. 20 లక్షలైతే... మెడికో విద్యార్థి ప్రీతి చనిపోతే రూ.10 లక్షల పరిహారం ఇస్తాననడం సిగ్గు చేటని విమర్శించారు. తెలంగాణలో మహిళలపై కొనసాగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ ‘‘నిరసన దీక్ష’’ చేపట్టారు.

Mon, 06 Mar 202312:30 PM IST

సీఎం కేసీఆర్ కు ఫాక్స్ కాన్ ఛైర్మన్ లేఖ

తెలంగాణ రాష్ట్రంలో ఫాక్స్ కాన్ ఉత్పత్తి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని సంస్థ ఛైర్మన్ యంగ్ లియూ స్పష్టం చేశారు. హైదరాబాద్ సమీపంలోని కొంగరకలాన్ లో మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ను నెలకొల్పుతామని... తయారీ కేంద్రాన్ని వీలైనంత తొందరగా నిర్వహణలోకి తెచ్చేందుకు ప్రభుత్వ సహకారం కోరుతున్నామని అన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన సంస్థ ఛైర్మన్ యంగ్ లియూ... తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి, ఆయ‌న విజ‌న్‌ త‌న‌కు ఎంతో ప్రేర‌ణ ఇచ్చింద‌ని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఫాక్స్‌కాన్ కంపెనీ తెలంగాణలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలా ? వద్దా ? అనే సందిగ్ధంలో ఉందని పేర్కొంటూ జరుగుతున్న ప్రచారాన్ని లేఖ ద్వారా తోసిపుచ్చారు... సంస్థ ఛైర్మన్ యంగ్ లియూ. రాష్ట్రంలో సంస్థ పెట్టుబడుల విషయంలో నిబద్ధతతో ఉన్నామని స్పష్టం చేశారు.

Mon, 06 Mar 202312:29 PM IST

సాత్విక్ సూసైడ్ కేసు

సంచలనం సృష్టించిన హైదరాబాద్ నార్సింగిలోని శ్రీ చైతన్య కళాశాల విద్యార్థి సాత్విక్‌ సూసైడ్ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లెక్చరర్‌ ఆచార్య, వార్డెన్‌ నరేష్‌, ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డితో పాటు జగన్ లను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వీరికి న్యాయస్థానం.. 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో.. న్యాయస్థానానికి రిమాండ్ రిపోర్ట్ సమర్పించిన పోలీసులు... అందులో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కళాశాల వేధింపుల వల్లే సాత్విక్ మృతి చెందాడని వివరించారు. విద్యార్థుల ముందు బూతులు తిడుతూ కొట్టడంతో సాత్విక్ తీవ్ర మనస్తాపం చెందాడని పేర్కొన్నారు. కళాశాలలో విద్యార్థులపై వేధింపులు నిజమేనని తేల్చారు.

Mon, 06 Mar 202306:51 AM IST

9 నుంచి ఉద్యోగుల పోరుబాట

ఉద్యోగులు, టీచర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేదని  ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 9 నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడుతున్నట్లు ఏపీ జేఏసీ ప్రకటించింది.  ఉద్యమానికి ఏపీసీపీఎస్ఏ మద్దతు ప్రకటించింది.  హామీ ఇచ్చి మరిచిన అంశాలను గుర్తు చేయడానికే ఉద్యమం చేపడుతున్నామన్నారు.  డీఏ బకాయిలు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారని,  సీపీఎస్ రద్దు చేస్తామన్న హామీ ఏమైందన్నారు. జీపీఎస్ విధానాన్ని పూర్తిగా తోసిపుచ్చామని,  ప్రభుత్వంతో చర్చలకు రాబోమని స్పష్టం చేశామని  ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. 

Mon, 06 Mar 202306:01 AM IST

జనసేన ఆవిర్భావ సభపై కసరత్తు

జనసేన ఆవిర్భావ సభపై కసరత్తు చేస్తున్నారు.  ఈ నెల 8న ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీల ఏర్పాటు చేయనున్నారు. ఆవిర్భావ సభ నిర్వహణ కోసం  రెండు రోజులు ముందే పవన్ కళ్యాణ్ విజయవాడ రానున్నారు. ఈనెల 12న హరిరామ జోగయ్య, అన్ని నియోజకవర్గాల కాపు నేతలతో పవన్ భేటీ కానున్నారు.  ఈ నెల 13న జనసేన ముఖ్య నేతలతో అంతర్గత భేటీలు నిర్వహించనున్నారు. 

Mon, 06 Mar 202305:30 AM IST

షూటింగ్‌లో గాయపడిన అమితాబ్

బిగ్ బి అమితాబ్ కు గాయాలయ్యాయి.  హైదరాబాద్ లో  జరిగిన షూటింగ్ లో గాయ పడ్డారు.  4 రోజుల క్రితం ప్రాజెక్ట్ ‘కె’ షూటింగ్ సమయంలో అమితాబ్  గాయపడ్డారు. ముంబైలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తన బ్లాగ్‌లో బిగ్ బి వివరించారు. 

Mon, 06 Mar 202304:03 AM IST

నదుల అనుసంధానంపై టాస్క్ ఫోర్స్ సమావేశం..

హైదరాబాద్‌లోని జలసౌధలో నదుల అనుసంధానంపై టాస్క్ ఫోర్స్ సమావేశం జరుగనుంది. సమావేశంలో  తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నీటిపారుదలశాఖ అధికారులు పాల్గొననున్నారు. నదుల అనుసంధానంపై  జాతీయ నీటిఅభివృద్ధి సంస్థ టాస్క్‌ఫోర్స్‌ చర్చించనుంది. 

Mon, 06 Mar 202304:00 AM IST

కోనసీమ జిల్లాలో గంజాయి విక్రయాలు

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న  రెండు ముఠాలను పోలీసులు  పట్టుకున్నారు.  ముమ్మిడివరంలో ఆరుగురిని అరెస్ట్ చేశారు.  అమలాపురం బైపాస్‍ రోడ్డులో మరో ఏడుగురిని  అరెస్ట్ చేశారు.  మొత్తం 34 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.  13 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‍కు తరలించారు.

Mon, 06 Mar 202303:57 AM IST

లోకేష్‌కు కొడాలి నాని సవాలు

నారా లోకేష్‌ను మాజీ మంత్రి కొడాలి నాని సవాల్ చేశారు. చంద్రబాబు, లోకేశ్‍కు దమ్ముంటే గుడివాడ, గన్నవరం నుంచి పోటీ చేయాలన్నారు. వైసీపీకి పోటీగా లోకేశ్ యువగళం సభ పెట్టాలన్నారు. యువగళం సభకు పోటీగా సిద్ధార్థ్ రెడ్డిని పంపుతామని, యువగళం సభ కన్నా సిద్ధార్థరెడ్డి సభకు పది రెట్లు యువత ఎక్కువ రాకుంటే రాజకీయాలు వదిలేస్తానని మాజీమంత్రి కొడాలి నాని సవాలు చేశారు.

Mon, 06 Mar 202303:56 AM IST

వైద్య ఆరోగ్య శాఖపై సిఎం సమీక్ష

 వైద్యారోగ్య శాఖపై సీఎం జగన్ నేడు  సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు  సమీక్ష జరుగనుంది. వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష  మంత్రి రజనితో పాటు వైద్య శాఖకు చెందిన  ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. 

Mon, 06 Mar 202303:54 AM IST

36వ రోజుకు చేరిన పాదయాత్ర

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 36వ రోజుకి చేరింది. ఉదయం 9 గంటలకు వేపులబయలులో బీసీ నేతలతో లోకేశ్ భేటీ కానున్నారు. సాయంత్రం 5.15 గంటలకు కలికిరిలో రైతులతో లోకేశ్ భేటీ అవుతారు.