Telugu News  /  Andhra Pradesh  /  Andhra Pradesh And Telangana Telugu Live News Updates 4 January2022

చిత్తూరులో చంద్రబాబు ప్రచార వాహనాన్ని అదుపులోకి తీసుకుంటున్న పోెలీసులు

December 04 Telugu News Updates : టెన్షన్.. టెన్షన్ - కుప్పం చేరుకున్న చంద్రబాబు

చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించేందుకు సిద్ధమైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పోలీసులు షాక్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రచారరథంతో పాటు, మైక్‌లు ఏర్పాటు చేసిన వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరులో చంద్రబాబు నాయుడు పర్యటనకు అనుమతులు లేవని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Wed, 04 Jan 202316:34 IST

టికెట్లు వచ్చేశాయ్… 

భాగ్యనగరంలో మళ్లీ కార్ల రేస్ మొదలుకానుంది. హుస్సేన్‌ సాగర్‌ తీరంలో ఫిబ్రవరి 11 నుంచి మళ్లీ ఫార్ములా ఈ రేస్‌ కార్లు సందడి చేయనున్నాయి. ఈ మేరకు ఇందుకు సంబంధించిన టికెట్లను నిర్వాహకులు బుధవారం విడుదల చేశారు. రూ.1000 నుంచి రూ.10,000 వేల వరకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

Wed, 04 Jan 202316:34 IST

కొత్త ఇంఛార్జ్

Telangana Congress New Incharge: తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జిగా మాణిక్‌రావు గోవిందరావు ఠాక్రే నియమితులయ్యారు. ఇప్పటివరకు ఉన్న ఠాగూర్ కు గోవా బాధ్యతలను అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్.

Wed, 04 Jan 202314:41 IST

వైరల్ న్యూస్ …

తెలంగాణ కాంగ్రెస్... గత కొంత కాలంగా అంతర్గత కుమ్ములాటలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సీనియర్లు, జూనియర్లు అనటమే కాదు.. ఏకంగా సేవ్ కాంగ్రెస్ అనే నినాదం వచ్చే వరకు వచ్చింది కథ..! ఇంతలోనే ఢిల్లీ నుంచి డిగ్గీరాజా వచ్చినప్పటికీ పరిస్థితిలో పెద్ద మార్పులు లేనట్లే కనిపించింది. ఇక శిక్షణ తరగతులకు దాదాపు సీనియర్లు అంతా డుమ్మా కొట్టారు. ఇదిలా ఉండగానే... మరో వార్తల తెగ చెక్కర్లు కొడుతున్నాయి. టీపీసీసీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి మాణిక్యం ఠాగూర్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి.

Wed, 04 Jan 202313:53 IST

చంద్రబాబు ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. కర్ణాటక సరిహద్దు పెద్దూరుకు చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. రోడ్‌షో, సభకు అనుమతి లేదంటూ అడ్డుకోవడంతో పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారు. పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఎందుకు అనుమతి ఇవ్వరంటూ ఆవేశంతో ఊగిపోయారు. పోలీసుల వైఖరికి నిరసనగా టీడీపీ కార్యకర్తల నిరసనకు దిగారు. చంద్రబాబు మద్దతుగా నినాదాలు చేశారు. కుప్పంలో ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.

Wed, 04 Jan 202313:52 IST

అరెస్ట్… 

బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న మహిళను గమనించాడు ఓ యువకుడు. అంతే తనలో వక్రబుద్ధిని బయటపెట్టాడు. సెల్ ఫోన్ లో నగ్న దృశ్యాలను చిత్రీకరించే పనిలో పడ్డాడు. ఈ విషయాన్ని సదరు మహిళ గ్రహించటంతో అతగాడు అక్కడ్నుంచి పరారయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

ఏం జరిగిందంటే...

యూసుఫ్‌గూడకు చెందిన యువతి(30) గత నెల 31న ఉదయం తన ఇంట్లో స్నానం చేస్తుంది. ఈ విషయాన్ని పై అంతస్తులో ఉండే అఖిల్ అనే యువకుడు గమనించాడు. వెంటిలేటర్ సాయంతో తన సెల్ ఫోన్ లో నగ్న దృశ్యాలను చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. దీనిని గుర్తించిన మహిళ అరవటంతో యువకుడు పరారయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులకు విషయం చెప్పగా... బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Wed, 04 Jan 202311:34 IST

కుప్పానికి చంద్రబాబు 

హైటెన్షన్ వాతావరణ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం చేరుకున్నారు. ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మరోవైపు పోలీసులు భారీగా మోహరించారు.

Wed, 04 Jan 202311:13 IST

సీఎం ఆదేశాలు 

గ్రామ, వార్డు సచివాలయాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ, వార్డు సచివాయాలను ఏర్పాటు చేశామన్న ఆయన... చివరి స్థాయి వరకూ సమర్థవంతమైన డెలివరీ మెకానిజమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ఈ తరహా వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలని... సరైన ఎస్‌ఓపీలు, పర్యవేక్షణ లేకపోతే ప్రయోజనం ఉండదన్నారు. సిబ్బంది హాజరు దగ్గర నుంచి అన్నిరకాలుగా పర్యవేక్షణ ఉండాలన్న ముఖ్యమమంత్రి... గ్రామ, వార్డు సచివాలయాల్లో మధ్యాహ్నం 3 గంటలనుంచి 5 గంటలవరకూ స్పందన నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ విభాగాల వారీగా మండలాల స్థాయిలో పర్యవేక్షణ ఉండాలి.

Wed, 04 Jan 202310:30 IST

స్పెషల్ ట్రైన్స్…. 

కాచిగూడ - తిరుపతి (ట్రైన్ 07179) మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు అధికారులు. ఈ ట్రైన్ బుధవారం రోజున సేవలు అందిచనుంది. ఇక తిరుపతి నుంచి - కాచిగూడ(07180)కు కూడా ప్రత్యేక రైలు వెళ్లనుంది. ఇది 5వ తేదీన అందుబాటులో ఉంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు మల్కాజ్ గారి, జనగాం, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

సికింద్రాబాద్ - రామంతపూర్(ట్రైన్ నెం. 07695) మధ్య జనవరి 11, 18,25వ తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. రామంతపూర్ నుంచి సికింద్రాబాద్ (ట్రైన్ నెం. 07696)కు జనవరి 6, 13, 20, 27 తేదీల్లో స్పెషల్ ట్రైన్స్ సేవలు అందిస్తాయి.

ఈ ప్రత్యేక రైళ్లు... నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, చెన్నై, చెంగల్ పట్టు, విల్లుపురం, చిదంబరం, సిర్ ఖాజీ, తిరువుర్, తిరుతురైపుండి, అదిరామ్ పట్నం, పట్టుకొట్టై, అరంటంగి, కరైకుడి, శివగంగా, మనమధురై స్టేషన్లల్లో ఆగుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లలో 2ac, 3ac స్లీపర్ క్లాస్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ సేవలను వినియోగించుకోవాలని ప్రయాణికులను కోరారు.

Wed, 04 Jan 202310:06 IST

ఎమ్మెల్యే దాడి

మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్ గేట్ సిబ్బందిపై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడికి పాల్పడ్డారు. మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బెల్లంపల్లికి వస్తున్న క్రమంలో టోల్ గేట్ వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని ఆపడంతో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య టోల్గేట్ సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడ్డారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వడంతో ఘటన కాస్త వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మందమర్రి పోలీసులు స్పందిస్తూ... దాడిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.

Wed, 04 Jan 20239:20 IST

కొత్త ప్యాకేజీ 

IRCTC Tourism Tirupati Coastal Karnataka Tour: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తిరుపతి నుంచి కర్ణాటకలోని పలు ప్రాంతాలను చూసేందుకు తాజాగా ఓ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'COASTAL KARNATAKA EX RENIGUNTA' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. గోకర్ణ, కొల్లూరు, మంగళూరు, మురుడేశ్వర్, శృంగేరి, ఉడిపి వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి.

Wed, 04 Jan 20238:10 IST

 వృద్ధురాలి ఆత్మహత్య

హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పై నుంచి దూకి వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. ఆర్ధిక ఇబ్బందులతో వృద్ధురాలు స్టేషన్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 

Wed, 04 Jan 20236:38 IST

పార్టీ మారడానికే  ఆనం విమర్శలు…

 నెల్లూరు రాజకీయాలు కాకరేపుతున్నాయి.   ఎమ్మెల్యే ఉండగానే ఇన్‍ఛార్జ్ ని నియమించడంతో జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.  నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆనం, సమన్వయకర్త నేదురుమల్లి పర్యటనలు ఏర్పాటు చేశారు. మరోవైపు  ఆనంపై నేదురుమల్లి రామ్‍కుమార్ ఫైర్ అయ్యారు.  పార్టీ మారే ఉద్దేశంతోనే ఆనం వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రభుత్వంపై ఆనం ఆరోపణలు చేయడంతోనే వెంకటగిరి సమన్వయకర్తగా  నియమించారని చెప్పారు. వెంకటగిరి నుంచి  పోటీ చేసే అంశంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని  నేదురుమల్లి రామ్‍కుమార్ రెడ్డి  చెబుతున్నారు. 

Wed, 04 Jan 20236:36 IST

వ్యాపారల కోసమే బిఆర్ఎస్‌లో చేరికలు

హైదరాబాద్‍లో వ్యాపార అవసరాలకే ఏపీ నేతలు బీఆర్‍ఎస్‍లో చేరుతున్నారని కోదండరామ్ ఆరోపించారు.  బీఆర్‍ఎస్ అనేది కేసీఆర్‍కు వచ్చిన మూర్ఖపు ఆలోచన అని,  కేసీఆర్ బలమే తెలంగాణ  అని ఇప్పుడు  తెలంగాణ తనకు అవసరం లేదనుకుంటున్నారని ఆరోపించారు.  ఎన్టీఆర్, మమత, స్టాలిన్ ఇలా ఎవరూ ప్రాంతీయ అస్తిత్వాన్ని వదులుకోలేదని,   ఏపీలో ఎందుకు పోటీ చేయడం లేదని విమర్శలు వస్తాయనే కేసీఆర్ ఏపీలో పోటీకి దిగుతున్నట్లు ఉన్నారన్నారు.  కేసీఆర్ భవిష్యత్ ఆయన పార్టీ పేరులాగే భారంగా మారుతుందని  కోదండరామ్ జోశ్యం చెప్పారు. 

Wed, 04 Jan 20236:34 IST

లోన్ యాప్ దారుణాలు

చిత్తూరు జిల్లాలో  లోన్ యాప్ వేధింపులను భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.  లోన్‍యాప్‍లో రూ.80 వేలు డబ్బులు తీసుకున్న యువకుడు, లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేనంటూ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.  మృతుడు చిత్తూరు జిల్లా పెనుమూరుకు చెందిన జానకీరాంగా గుర్తించారు. 

Wed, 04 Jan 20236:33 IST

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమల  శ్రీ వారిని దర్శించుకున్న మంగళవారం  71,924 మంది భక్తులు దర్శించుకున్నారు.  శ్రీవారి ఆలయ హుండీ ఆదాయం రూ.3.13 కోట్లు లభించింది.   నేటి నుంచి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ కౌంటర్ల కుదించనున్నారు. 

Wed, 04 Jan 20236:31 IST

ఐటీ సోదాలు

హైదరాబాద్‍లో పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. గచ్చిబౌలిలోని ఎక్సెల్ కంపెనీ కార్యాలయంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.  దేశ వ్యాప్తంగా 18 ప్రాంతాల్లోని కంపెనీల్లో తనిఖీలు చేపట్టారు.  చెన్నై హెడ్ ఆఫీస్‍గా ఎక్సెల్ కార్యాలయాల్లో తనిఖీ చేశారు.  గచ్చిబౌలి, బాచుపల్లి, చందానగర్‍లోనూ సోదాలు చేపట్టారు. 

Wed, 04 Jan 20236:30 IST

ఓట్ల తొలగింపు విచారణ

 అనంతపురం జిల్లాలో భారత ఎన్నికల కమిషన్ బృందం పర్యటించనుంది.  ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ ఓట్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో  ఢిల్లీ నుంచి నేరుగా క్షేత్రస్థాయిలో విచారణకు వస్తున్న భారత ఎన్నికల సంఘం కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ . విడపనకల్లు మండలం చీకలగురికిలో టీడీపీ ఓట్ల తొలగించారి, ఫోర్జరీ నోటీసుల తయారీపై గతంలో పలుమార్లు అధికారులకు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఫిర్యాదు చేశారు.  కేంద్ర ఎన్నికల అధికారి రానున్న నేపథ్యంలో బీఎల్వోలు గోపి, మధును  కలెక్టర్ నాగలక్ష్మి  సస్పెండ్ చేశారు.  జిల్లా అధికారులతోనూ కేంద్ర ఎన్నికల సంఘం అధికారి భేటీ కానున్నారు.  వాలంటీర్ల సహకారంతో టీడీపీ ఓట్లు తొలగిస్తున్నారని ఆధారాలతో సీఈసీకిపయ్యావుల కేశవ్ ఫిర్యాదు చేశారు. 

Wed, 04 Jan 20236:27 IST

విశాఖ‌లో కరోనా కలకలం

ఆస్ట్రేలియా నుంచి రాష్ట్రానికి వచ్చిన మహిళకు కరోనా నిర్ధారణ అయ్యింది.   సింగపూర్ మీదుగా విశాఖ వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ ‌గా తేలింది. బాధితురాలి కుటుంబసభ్యులకు కరోనా నెగెటివ్‍గా గుర్తించారు.  విజయనగరం జిల్లా బొండపల్లి మండలానికి చెందిన మహిళకు కరోనా  సోకినట్లు గుర్తించారు.  బాధితురాలు రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నట్లు ఎయిర్ సువిధ పత్రంలో వెల్లడించారు.  బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందన్న అధికారులు, నమూనాలను  జీనోమ్ సీక్వెన్స్ కోసం విజయవాడ తరలించారు.  రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

ఆర్టికల్ షేర్ చేయండి