Child Aadhaar Camps : ఏపీలో చిన్నారులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు, ఆధార్ అప్‌డేట్‌కు అవ‌కాశం- ఏ తేదీల్లో అంటే?-andhra pradesh aadhaar update special camps for children announced dates here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Child Aadhaar Camps : ఏపీలో చిన్నారులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు, ఆధార్ అప్‌డేట్‌కు అవ‌కాశం- ఏ తేదీల్లో అంటే?

Child Aadhaar Camps : ఏపీలో చిన్నారులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు, ఆధార్ అప్‌డేట్‌కు అవ‌కాశం- ఏ తేదీల్లో అంటే?

HT Telugu Desk HT Telugu

Child Aadhaar Camps : ఏపీలో చిన్నారులకు ప్రత్యేకంగా ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. మార్చి 19 నుంచి మార్చి 22 వరకు, తిరిగి మార్చి 25 నుంచి మార్చి 28 వరకు రెండు విడతల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు నిర్వహిస్తారు.

ఏపీలో చిన్నారులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు, ఆధార్ అప్‌డేట్‌కు కూడా అవ‌కాశం- ఏ తేదీల్లో అంటే?

Child Aadhaar Camps : రాష్ట్రంలో చిన్నారులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించ‌నున్నారు. రెండు విడ‌త‌లుగా నిర్వహించే ఈ క్యాంపులు, మార్చి 19 నుంచి మార్చి 22 వరకు మొద‌టి విడ‌త‌గా జ‌రుగుతాయి. రెండో విడ‌త‌గా మార్చి 25 నుంచి మార్చి 28 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చిన్నారుల‌కు ఆధార్ న‌మోదుతో పాటు అప్‌డేట్ కూడా చేయించుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది.

రాష్ట్రవ్యాప్తంగా 0-6 ఏళ్ల వ‌య‌స్సు గ‌ల చిన్నారుల‌కు ఆధార్ న‌మోదు చేసేందుకు ప్రత్యేక ఆధార్ క్యాంపుల‌ను నిర్వహిస్తున్నట్లు గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల శాఖ పేర్కొంది. తప్పనిసరిగా చిన్నారులకు ఆధార్ న‌మోదయ్యే విధంగా చ‌ర్యలు తీసుకోవాల‌ని అన్ని జిల్లాల క‌లెక్టర్లకు ఆ శాఖ డైరెక్టర్ శివ‌ప్రసాద్ సోమ‌వారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,65,264 మంది చిన్నారులు ఉండ‌గా, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఉండి కూడా ఆధార్ కార్డులు లేని ఆరేళ్లలోపు చిన్నారులు 1,86,709 ఉన్నట్లు గుర్తించారు.

వీరిలో కొందరు వేరే ప్రాంతాలకు బదిలీ అయి వెళ్లిపోవడం, ఇతర రాష్ట్రాలు ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పటు చేసుకోవడం ఇతర కారణాల వల్ల ఆధార్ కార్డులు తీసుకోలేకపోయినట్లు తెలిసింది. జియో ట్యాగింగ్ ప్రక్రియలో వీరి వివరాలు చూపించక పోవడంతో ట్యాగింగ్ ప్రక్రియకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జనన ధ్రువీకరణ పత్రాలు ఉన్న చిన్నారులందరి వివరాలతో ఆధార్ కార్డులు పొందేందుకు ప్రత్యేకంగా ఈ నెలలో రెండు ప్రత్యేక శిబిరాలను ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్వహించాలని ఆదేశించింది.

ఆధార్ అప్డేట్

ఈనెల 19 నుంచి 22 వరకు, తిరిగి 25 నుంచి 28 వరకు వీటిని నిర్వహించి చిన్నారుల వివరాలతో ఆధార్ కార్డులు మంజూరు చేయాలని సూచించింది. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా వీరితోపాటు ఆధార్ అప్‌డేట్ కాని వారు సుమారు 52.02 లక్షల మంది ఉన్నట్లు గుర్తించింది. వీరు కూడా వారి వివరాలు అప్‌డేట్ చేసుకొనేందుకు అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియ కోసం విధులు నిర్వహించే డిజిటల్ అసిస్టెంట్లు, వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీలకు శిబిరాల నిర్వహణ సమయంలో ఇతర బాధ్యతల నుంచి మినహాయింపు ఇవ్వాలని అన్ని జిల్లాల‌ కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేర‌కు గ్రామ‌, వార్డు స‌చివాల‌య డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ ఎం. శివ‌ప్రసాద్, అన్ని జిల్లాల క‌లెక్టర్లకు, గ్రామ‌, వార్డు స‌చివాల‌య‌ జిల్లా ఇన్‌ఛార్జ్‌ల‌కు లేఖ రాశారు.

క‌లెక్టర్ల ఆదేశాల‌ను మండ‌ల ప‌రిష‌త్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీవో) కి పంపిస్తారు. మండ‌లంలోని ఉన్న చిన్నారులు ఎంత‌మంది? అందులో ఎంత మంది చిన్నారులు ఆధార్ న‌మోదు చేసుకోలేద‌ని స‌మాచారం త‌యారు చేయాల‌ని క‌లెక్టర్లు ఆదేశిస్తారు. దీంతో ఎంపీడీవోలు అంగ‌న్‌వాడీ కేంద్రాల ద్వారా, అలాగే స‌చివాల‌యాల ద్వారా డేటాను సేక‌రించి, ప్రత్యేక క్యాంపులు ఎక్కడెక్కడ నిర్వహించాలనే దానిపై ప్రణాళిక రూపొందించారు. అందుకునుగుణంగా నేటి నుంచి ఆధార్ క్యాంపులు జ‌ర‌గ‌నున్నాయి.

మార్చి 19 నుంచి మార్చి 22 వ‌ర‌కు నాలుగు రోజుల పాటు ఆధార్ ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించాల‌ని ఆదేశించారు. అలాగే రెండో విడుత మార్చి 25 నుంచి మార్చి 28 వ‌ర‌కు నాలుగు రోజుల పాటు ఆధార్ ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించాల‌ని ఆదేశించారు. మండ‌ల ప‌రిష‌త్ డ‌వ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్లు (ఎంపీడీవో)లు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు త‌గిన చ‌ర్యలు చేప‌ట్టాల‌ని సూచించారు.

ముఖ్యమైన అంశాలు

1. చిన్నారుల‌కు ఆధార్ న‌మోదుకు క్యూర్ కోడ్ ఉన్న పుట్టిన తేదీ స‌ర్టిఫికేట్‌

2. ద‌ర‌ఖాస్తు ఫారం ఉండాలి.

3. బిడ్డను త‌ల్లి లేదా తండ్రి మాత్రమే ఆధార్ క్యాంప్‌కు తీసుకెళ్లాలి.

4. వేరెవ్వరూ తీసుకెళ్లడానికి లేదు.

5. బిడ్డను ఆధార్ సెంట‌ర్‌కు తీసుకెళ్లే వారి (త‌ల్లి లేదా తండ్రి) ఆధార్ కార్డును త‌ప్పనిస‌రిగా తీసుకెళ్లాలి.

6. చిన్నారుల ఆధార్ న‌మోదుకు ఎటువంటి రుసుము లేదు. ఉచిత‌మే.

రిపోర్టింగ్ : జ‌గదీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

HT Telugu Desk

సంబంధిత కథనం