Godavari Kodi Pandalu : కాలుదువ్వుతున్న పందెంరాయుళ్లు, గోదావరి జిల్లాల్లో బరులు రెడీ-కోడి పందాలకు ఫేమస్ స్పాట్ లు ఇవే
Godavari Kodi Pandalu : గోదావరి జిల్లాలు కోడి పందాలకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే బరులు రెడీ చేశారు. బరులు చుట్టూ పందెంరాయుళ్లకు, చూసేవాళ్లకు ఏ లోటు రాకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు ఫేమస్ ఏరియాలు ఉన్నాయి. అవేంటంటే.
Godavari Kodi Pandalu : "ఆయ్ మేం గోదారోళ్లమండి...మాకు కూసింత ఏటకారం ఎక్కువని బయట టాకండోయ్. అంటే గోదారమ్మ నీళ్లు తాగుతున్నాం కదా ఆ మాత్రం ఉంటాదండోయ్. ఇంతకి అసలు విషయం చెప్పడం మరిచిపోయానండోయ్...గోదారి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు మొదలెట్టేశారు. అన్నింటికంటే ముఖ్యమైంది...అదేనండి కోళ్ల పందాలు. మావోళ్లకు కూసింక కంగారండోయ్ బాబు. అందుకే నెల రోజుల ముందే బరులు చూసేశారు. పండగక్కి వారం రోజుల ముందే బరులు రెడీ చేసేశారు. ఇంకేంటండి పందెంపుంజులను రంగంలోకి దించేడమే. తొందరగా గోదారి జిల్లాలకు వచ్చేసి మా ఆతిథ్యం స్వీకరించి, సరదాగా మూడు రోజులు కోడి పందాలు చూసి, ఆంధ్రా పిండి వంటలు రుచిచూసి...కాసిన్ని నవ్వులు, కూసింత ఏటకారం మూటకట్టుకోండోయ్...ఆయ్" అంటూ గోదావరి జిల్లాల ప్రజలు సోషల్ మీడియాలో వీడియోలు పోస్టుచేస్తున్నారు.
సంక్రాంతి సంబరాలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. హరిదాసుల కీర్తనలు, బసవన్నల రంకెలు, కోడి పందాలు, ముగ్గులు, పిండి వంటలు, గొబ్బెమ్మలు....ఇలా గోదావరి జిల్లాల్లో ప్రతి ఇల్లు బంధువులు, స్నేహితులతో పండగ మూడు రోజులు కళకళలాడిపోతుంది. పండుగకు మూడు రోజులు అనధికారంగా కోడిపందాలు నిర్వహిస్తారు. కోడి పందాల్లో గోదావరి జిల్లాలను కొట్టింది లేదని టాక్. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులు కోడి పందాలు నిర్వహిస్తారు. ఈ మూడు రోజులు వందల కోట్లలో డబ్బు చేతులు మారుతుంది. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో కోడి పందాల బరులు సిద్ధం అయ్యాయి. చిన్న, పెద్ద, భారీ బరులను సిద్ధం చేస్తున్నారు.
భారీ బరులు
భారీ బరులను సిద్ధం చేసేందుకు దాదాపుగా రూ.30 లక్షల దాకా ఖర్చుచేస్తున్నారు. అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. భారీ బరి, చుట్టూ స్క్రీన్లు, లైవ్ టెలికాస్ట్, యాంకర్లు, ఎత్తైన స్టేజ్, సౌండ్ బాక్సులు, ఇక బయట చికెన్ పకోడి షాపులు, కూల్ డ్రింక్స్ షాపులు, బెల్ట్ షాపులు, గుండాటలు, ఇలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లకు అయ్యే ఖర్చును నిర్వాహకులు పందెంరాయుళ్ల నుంచి వసూలు చేస్తారు. ఒక్కో పందెం నుంచి పది పర్సెంట్ కమీషన్ తీసుకుంటారు. 10 లక్షల పందెం కాస్తే, అందులో లక్ష రూపాయలు బరి నిర్వాహకులకు ఇవ్వాలి. పందెం రాయుళ్లకు కావాల్సిన సకల సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అందుకోసం ప్రతి పందానికి కమీషన్ వసూలుచేస్తారు.
ఫేమస్ స్పాట్స్
సాధారణంగా ప్రతి గ్రామంలో సంక్రాంతి మూడు రోజులు కోళ్ల పందాలు జరుగుతాయి. కొందరు బరులు గీస్తే, మరికొందరు ఏ కాల్వ గట్టునో ఖాళీ స్థలంలోనో పందాలు వేస్తుంటారు. గోదావరి జిల్లాల్లో కోళ్ల పందాలకు బాగా ఫేమస్ ఏరియాలు భీమవరం, ఐభీమవరం, వెంప, ఏలూరు, అమలాపురం, కోనసీమ కొబ్బరి తోటలు. ఇక్కడ కోట్లలో పందాలు కడతారు. బరిలో పందాలతో పాటు బయట పందాలతో కలిపి పండుగ మూడు రోజులు కొన్ని వందల కోట్లు చేతులు మారతాయి. గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రూ.3 వేల కోట్లకు పైనే డబ్బు చేతుమారతాయని గత లెక్కలు చెబుతున్నాయి. బెట్టింగుల లెక్కలు కూడా కలిపితే ఇది రెట్టింపు అవుతుంది.
కాకి, నెమలి, అబ్రాస్, డేగ, పచ్చకాకి, కేతువ, పర్లా...ఇలా కోడి రంగును బట్టి పేరుపెడతారు. సుమారు రెండేళ్ల వయసు కలిగిన పుంజులను పందేలకు రెడీ చేస్తారు. పందాల కోసం వీటికి ప్రత్యేకమైన ఫుడ్ తో పాటు శిక్షణ ఇస్తారు. మటన్, బాదం, జీడిపప్పు... ఇలా బలమైన ఆహారంతో పందెం కోడిపుంజులు మేపుతారు. ఇలా పెంచిన పుంజులు వాటి రంగు, ఎత్తు, పోరాట పటిమను బట్టి రూ.50 వేల నుంచి లక్ష వరకు అమ్ముతారు. వీటిపై కోట్లలో పందాలు జరుగుతుంటాయి.
సంబంధిత కథనం