Etikoppaka Sakatam : ఏపీ ఏటికొప్పాక శకటానికి కేంద్ర ప్రభుత్వ జ్యూరీ అవార్డు, 30 ఏళ్ల తర్వాత బహుమతి
Etikoppaka Sakatam : రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రదర్శించిన ఏపీ ఏటికొప్పాక శకటానికి కేంద్ర ప్రభుత్వ జ్యూరీ బహుమతి లభించింది. 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఏపీ శకటం మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్ర వారసత్వ సంప్రదాయానికి ప్రతీకగా.. ఏటికొప్పాక శకటం రిపబ్లిక్ డే పరేడ్ లో హైలెట్ గా నిలిచింది.
Etikoppaka Sakatam : దిల్లీలో కర్తవ్యపథ్ లో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవం పరేడ్‌లో ప్రదర్శించిన శకటాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శకటానికి కేంద్ర ప్రభుత్వం జ్యూరీ అవార్డు ప్రకటించింది. ఏపీలోని చేతి వృత్తుల ప్రాముఖ్యత చాటుతూ, రాష్ట్ర వారసత్వ సంప్రదాయానికి ప్రతీకగా ఉన్న ఏటికొప్పాక బొమ్మలతో రూపొందించిన శకటాన్ని రిపబ్లిక్ డే పరేడ్ ఉత్సవంలో హైలెట్‌గా నిలిచింది.

ఏపీ శకటం యావత్ దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది. సామాజిక మాధ్యమాలలో లక్షలాది మంది ఈ శకటానికి మంత్రముగ్దులై ప్రశంసలతో ముంచెత్తారు. రాష్ట్రంలో చేతివృత్తులు, హస్తకళలకు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో విస్తృత ప్రచారం తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఆలోచనలతో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఈ శకటాన్ని రూపొందించింది.
సామాజిక మాధ్యమాల్లో వైరల్
శకటం ముందు వినాయకుడు, చివర కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి ఎత్తైన రూపాలతో, ఇరువైపులా బొబ్బిలి వీణలు, తెలుగువారి కట్టుబొట్టు ప్రతిబింబించేలా అమర్చిన ఏటికొప్పాక బొమ్మల కొలువుతో శకటం ఆకట్టుకుంది. శకటం నడుస్తున్నంత సేపు ఏటి కొప్పాక బొమ్మల ప్రాశస్త్యాన్ని చాటుతూ ‘’బొమ్మలు బొమ్మలు ఏటికొప్పాక బొమ్మలు, ఆంధ్ర ప్రదేశ్ బొమ్మలు, ఇవి విద్యను నేర్పే బొమ్మలు, వినోదాల బొమ్మలు, భక్తి చాటే బొమ్మలు, హస్తకళల హంగులు, సహజ ప్రకృతి రంగులు’’ అంటూ సాగే గీతం ప్రజలందరి హృదయాలను దోచుకుంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు సైతం ఈ శకటం మనోహరమైన రూపాన్ని చూసి ఆనందించారు. అలాగే నెటిజన్లు సైతం ఏపీ ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల శకటాన్ని పెద్ద ఎత్తున సామాజిక మధ్యమాల్లో షేర్ చేసుకున్నారు. చాలా మంది నెటిజన్లు తమ సామాజిక మాధ్యమాల్లో తమ డీపీలుగా కూడా ఈ శకటాన్ని ప్రదర్శించారు. ఓటింగ్‌లో కూడా పెద్ద ఎత్తున ఏటికొప్పాక శకటానికి మద్దతు పలికారు.
30 ఏళ్ల తర్వాత తొలిసారి జూరీ అవార్డు
గణతంత్ర దినోత్సవాలలో ప్రదర్శించిన శకటాలకు సంబంధించి 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ శకటానికి కేంద్ర ప్రభుత్వ జూరీ పురస్కారం లభించింది. ఏటికొప్పాక బొమ్మల శకటానికి కేంద్ర ప్రభుత్వం జ్యూరీ తృతీయ బహుమతి ప్రకటించింది.
సీఎం, డిప్యూటీ సీఎం ప్రశంసలు
ఏటికొప్పాక శకటానికి తృతీయ బహుమతి రావడంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ప్రశంసించారు. రిపబ్లిక్ డే సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరూ తమ సామాజిక మాధ్యమాల్లో ఈ శకటాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. దశాబ్దాల తర్వాత రాష్ట్ర శకటానికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం లభించడం పట్ల సర్వత్ర హర్షాతిరేకాలు వ్యాక్తమవుతున్నాయి. ఏటికొప్పాక బొమ్మలకు జియో ట్యాగింగ్ చేసి, ఈ బొమ్మలను అంతర్జాతీయంగా కూడా ప్రసిద్దిని పొందేలా రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోందన్నారు.
ఆధ్యాత్మిక, సంస్కృతిక వైభవాన్ని చాటేలా
ఏటికొప్పాక బొమ్మల శకటం మూడో స్థానంలో నిలవడంపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆనందం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక భావంతో పాటు రాష్ట్ర సంస్కృతిక వైభవాన్ని చాటేలా తీర్చిదిద్దిన శకటం ప్రధాని మోదీతో పాటు ప్రజల మనసును దోచుకోవడం సంతోషానిచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం హస్తకళలకు ప్రాధాన్యతనిస్తోందని, విస్తృతంగా ప్రచారాన్ని కల్పిస్తోందని మంత్రి పేర్కొన్నారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏటికొప్పాక బొమ్మల శకటం తయారు చేసిన, హస్తిన వేదికపై ప్రదర్శించిన బృందానికి మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు. అదే విధంగా తొలి స్థానంలో నిలిచిన యూపీ మహాకుంభ్ శకటం, రెండో స్థానంలో త్రిపుర రాష్ట్ర శకటం రూపకర్తలకు అభినందనలు తెలిపారు.