Anantapur News : అనంతపురం జిల్లాలో విషాదం, తెల్లారితే నిశ్చితార్థం గోరింటాకు కోసం వెళ్లి యువతి మృతి
Anantapur News : అనంతపురం జిల్లాలో విషాదం నెలకొంది. తెల్లారితే నిశ్చితార్థం జరగాల్సిన యువతి, గోరింటాకు కోసం వెళ్లి తిరిగిరాని లోకానికి చేరుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని వెంకటరెడ్డిపల్లి గ్రామానికి సమీపంలో శనివారం చోటు చేసుకుంది.
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తెల్లారితే నిశ్చితార్థం జరగాల్సిన యువతి, గోరింటాకు కోసం వెళ్లి తిరిగిరాని లోకానికి చేరుకుంది. సోదరుడితో కలిసి పక్క ఊరికి వెళ్లి గోరింటాకు కోసుకోని తిరిగివస్తూ కాసేపట్లో ఇంటికి చేరుకుంటారనుకునేలోపు మృత్యువు కబళించింది. ఆమె సోదరుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనతో కన్నవారిని, కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచింది.
ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని వెంకటరెడ్డిపల్లి గ్రామానికి సమీపంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం వెంకటరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీరామ్ రెడ్డి, లక్ష్మీదేవిలకు గీత, బిందు అనే ఇద్దరు కుమార్తెలు, నారాయణ రెడ్డి అనే కుమారుడు ఉన్నారు. ముగ్గురి పిల్లలను సమానంగా ఇంజినీరింగ్ చదివించారు. అయితే తల్లి లక్ష్మీదేవి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె కోరిక మేరకు పెద్ద కుమార్తె గీత (24)కు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో వరుడిని వెతకడం, ఆ సంబంధం కుదరడంతో ఆదివారం నిశ్చితార్థం పెట్టుకున్నారు. దీంతో ఆ ఇంట్లో సంతోషం నెలకొంది.
గీత గోరింటాకు పెట్టించుకోవడానికి సోదరుడు నారాయణరెడ్డితో కలిసి ద్విచక్రవాహనంలో తాడిపత్రికి వెళ్లింది. పని అయిపోయాక గ్రామానికి తిరిగి బయలుదేరారు. గ్రామం వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. దీంతో గీతా అక్కడికక్కడే మృతి చెందింది. నారాయణ రెడ్డి తలకు బలమైన గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే 108 వాహనంలో తాడిపత్రిలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పెద్దాసుపత్రికి తరలించారు. గీత మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పెళ్లి ముచ్చట తీరకుండానే వెళ్లిపోయావా తల్లీ అంటూ తల్లిదండ్రులు రోదించడం అందరినీ కలచివేసింది. జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుని అర్థంతరంగా వెళ్లిపోయావా అంటూ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ ఘటనతో వెంకటరెడ్డిపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు