Anantapur Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నవ జంట సహా ముగ్గురు మృతి-anantapur speedy lorry met car accident recently married couple died ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anantapur Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నవ జంట సహా ముగ్గురు మృతి

Anantapur Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నవ జంట సహా ముగ్గురు మృతి

HT Telugu Desk HT Telugu
Aug 21, 2024 04:50 PM IST

Anantapur Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన లారీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. తాడిప‌త్రి మండ‌లం వంగ‌నూరు స‌మీపంలోని బొంద‌లదిన్నే గ్రామం వ‌ద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నవ జంట సహా ముగ్గురు మృతి
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నవ జంట సహా ముగ్గురు మృతి

Anantapur Accident : అనంత‌పురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ వేగంగా ఢీకొన‌డంతో ఈ రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక‌క్కడే మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెల‌కొంది. పోలీసులు కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు.

అనంతపురం జిల్లా తాడిప‌త్రి మండ‌లం వంగ‌నూరు స‌మీపంలోని బొంద‌లదిన్నే గ్రామం వ‌ద్ద బుధ‌వారం కారును లారీ బ‌లంగా ఢీకొన‌డంతో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. తాడిప‌త్రి మండలంలోని గ‌ద‌ర‌గుట్టప‌ల్లి గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి (30), అతడి భార్య ప్రమీల (25), అత్త వెంక‌ట‌ల‌క్ష్మి (40)ల‌తో క‌ల‌సి క‌డ‌ప జిల్లా వేంప‌ల్లికి శుభ‌కార్యం నిమిత్తం వెళ్లారు.

శుభ‌కార్యం ముగించుకుని తిరిగి స్వగ్రామం గ‌ద‌ర‌గుట్టప‌ల్లికి వ‌స్తుండ‌గా బొంద‌ల‌దీన్నే వ‌ద్ద కారును అతివేగంగా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ప్రతాప్‌రెడ్డి, ప్రమీల అక్కడిక‌క్కడే మృతి చెంద‌గా, తీవ్రంగా గాయ‌ప‌డిన వెంక‌ట‌ల‌క్ష్మి ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మృతి చెందింది. కాగా ప్రతాప్ రెడ్డి, ప్రమీల ఐదు నెల‌ల క్రిత‌మే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చిల‌కాగోరింకాల్లా ఉండే వారి ప‌చ్చటి కాపురం ఆదిలోనే అనంత‌లోకానికి చేరింది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చ‌నిపోవ‌డంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెల‌కొంది. కుటుంబ స‌భ్యులు, బంధువులు క‌న్నీరు మున్నీరు అయ్యారు. గ‌ద‌ర‌గుట్టప‌ల్లి గ్రామంలో విషాద చాయ‌లు అలుముకున్నాయి. కుటుంబ స‌భ్యుల రోద‌న‌లు మిన్నంటాయి.

రోడ్డు ప్రమాదంపై స్థానికులు స‌మాచారం ఇవ్వడంతో పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు. అక్కడ అంతా ప‌రిశీలించి మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం తాడిప‌త్రి ప్రభుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు, ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు తాడిపత్రి రూర‌ల్ పోలీసులు తెలిపారు.

విజ‌య‌వాడ‌లో రోడ్డు ప్రమాదం...విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మృతి

విజ‌య‌వాడ‌లో రోడ్డు ప్రమాదం జ‌రిగింది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మృతి చెందారు. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి ఆరో బెటాలియ‌న్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కె.తారక రామారావును గుంటూరు-విజ‌య‌వాడ ర‌హ‌దారిలో క‌న‌క‌దుర్గ వార‌ధి మీద 47వ పిల్లర్ ద‌గ్గర లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో తార‌క రామారావు అక్కడిక‌క్కడే మృతి చెందారు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు