Baby Kidnap case: అనంతపురం జిల్లాలో ఐదు రోజుల పసికందు అపహరణ కేసును గంటల వ్యవధిలో చేధించిన పోలీసులు
Baby Kidnap case: అనంతపురం జిల్లాలో ఐదు రోజుల పసికందు అపహరణ కేసును గంటల వ్యవధిలోనే పోలీసులు చేధించారు.
Baby Kidnap case: అనంతరంపురం జిల్లాలో ఐదు రోజుల పసికందు అపహరణకు గురైంది. గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేధించారు. పసికందును తల్లిదండ్రులకు అప్పగించారు. కథ సుఖాంతం అవ్వడంతో ఇటు తల్లిదండ్రులు, అటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటన అనంతరంపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. స్థానిక ఏ.నారాయణపురానికి చెందిన ఆమని అనే మహిళ ఐదు రోజుల పసికందును ఆదివారం అపహరించింది. దీన్ని పోలీసులు మూడు గంటల్లోనే ఛేదించారు.
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం నాగలూరు గ్రామానికి చెందిన గర్భిణీ అమృత ఈనెల 16న అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు కోసం చేరింది. ఈనెల 23న అమృత ప్రసవించింది. ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటి నుండి ఆసుపత్రిలోని గైనిక్ విభాగంలోనే తల్లి, బిడ్డ ఉంటూ వైద్య సేవలు పొందుతున్నారు.
అయితే హఠత్తుగా ఆదివారం తెల్లవారుజామున 4ః30 గంటల సమయంలో తల్లిపక్కన బిడ్డ లేదు. స్థానికి ఏ.నారాయణపురానికి చెందిన ఆమని అనే మహిళ పసికందును అపహరించింది. అయితే బిడ్డ ఏమైందోనని అందరూ కంగారు పడ్డారు. బిడ్డ అదృశ్యమైందని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ దృష్టికి తీసుకెళ్లడంతో పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అనంతపురం డీఎస్పీ టీవీవీ ప్రతాప్, రెండో పట్టణ, నాల్గో పట్టణ సీఐలు క్రాంతి కుమార్, ప్రతాప్ రెడ్డి, అవుట్ పోస్టు ఏఎస్ఐ త్రిలోక్‌నాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసులు బృందం రంగంలోకి దిగింది. ఆసుపత్రిలోని గైనిక్ విభాగ వార్డును దిగ్బంధనం చేసి అనుమానితులను విచారించారు.
అదే సమయంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో ఒక మహిళ పసికందును తీసుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ మహిళ ఎవరని ఆరా తీస్తే స్థానిక ఏ.నారాయణపురానికి చెందిన ఆమనిగా పోలీసులు నిర్థారణకు వచ్చారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తే, అసలు విషయం బయటపడింది. తానే పసికందును అపహరించునట్లు ఒప్పుకుంది. వెంటనే ఆమె వద్ద నుంచి ఆ పసికందును స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం బిడ్డను పోలీసులు తల్లిదండ్రులు అమృత, అనిల్ కుమార్‌లకు అప్పగించారు. దీంతో పసికందు అదృశ్య ఘటన కథ సుఖాంతం అయింది. దీంతో ఇటు తల్లిదండ్రులు, అటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులకు బిడ్డ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. పసికందును అపహరించిన మహిళ ఆమనిపై చట్టపరమైన చర్యలకు పోలీసులు ఉపక్రమించారు. ఆమెపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
(రిపోర్టింగ్ జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)