Lokesh With Tesla CFO: ఈవీల తయారీకి అనంతపురం అనువైన ప్రదేశం.. టెస్లా సీఎఫ్‌ఓతో లోకేష్‌ భేటీ-anantapur is an ideal place to manufacture evs lokesh met tesla cfo ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Lokesh With Tesla Cfo: ఈవీల తయారీకి అనంతపురం అనువైన ప్రదేశం.. టెస్లా సీఎఫ్‌ఓతో లోకేష్‌ భేటీ

Lokesh With Tesla CFO: ఈవీల తయారీకి అనంతపురం అనువైన ప్రదేశం.. టెస్లా సీఎఫ్‌ఓతో లోకేష్‌ భేటీ

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 28, 2024 01:14 PM IST

Lokesh With Tesla CFO: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగానికి అనంతపురం వ్యూహాత్మక ప్రదేశమని...పెట్టుబడులు పెట్టాలని మంత్రి నారా లోకేష్‌ టెస్లా ప్రతినిధులకు సూచించారు. స్మార్ట్ సిటీలు, గ్రామీణ విద్యుదీకరణ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించాలని టెస్లా సిఎఫ్ఓ వైభవ్ తనేజాకు మంత్రి లోకేష్ సూచించారు.

ఏపీకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాల్లో మంత్రి నారా లోకేష్‌, టెస్లా, పెరోట్ గ్రూప్ ప్రతినిధులతో భేటీ
ఏపీకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాల్లో మంత్రి నారా లోకేష్‌, టెస్లా, పెరోట్ గ్రూప్ ప్రతినిధులతో భేటీ

Lokesh With Tesla CFO: అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్‌ ఆస్టిన్ లోని టెస్లా కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో అగ్రస్థానంలో ఉన్న టెస్లా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలపై టెస్లా సిఎఫ్ఓ వైభవ్ తనేజాతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా సిఎఫ్ఓ వైభవ్ తనేజా మాట్లాడుతూ... ఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్, బ్యాటరీ స్టోరేజిలో తమ సంస్థ గ్లోబల్ లీడర్ గా ఉందని తెలిపారు. ఇంటి నుండి గ్రిడ్ వరకు బ్యాటరీ పవర్ స్టోరేజి పరికరాలు, సోలార్ ప్యానల్స్, సోలార్ షింగిల్స్, డ్రైవింగ్ ఇన్నొవేషన్, మోడల్ -3, పవర్ వాల్ వంటి ఉత్పత్తుల ద్వారా ఇంధనరంగంలో స్థిరమైన వృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు.

గత ఏడాది 18.8శాతం వృద్ధి సాధించి 832 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో 97బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... విజనరీ లీడర్ చంద్రబాబు గారి నేతృత్వాన 2029 నాటికి ఎపిలో 72 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

టెస్లాకు సంపూర్ణ సహకారం…

మా లక్ష్యసాధనకు టెస్లా వంటి అగ్రశ్రేణి గ్లోబల్ కంపెనీల సహాయ,సహకారాలు అవసరమని మంత్రి లోకేష్‌ అన్నారు. గతంలో చంద్రబాబు సిఎంగా ఉన్నపుడు ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషిచేశారు, కియా, హీరో మోటార్స్ వంటి కంపెనీలను రాష్ట్రానికి రప్పించారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ, రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ రంగాలపై ఆయన దృష్టిసారించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా టెస్లా EV తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు వ్యూహాత్మక ప్రదేశంగా ఉంటుందని వివరించారు. ప్రగతిశీల నాయకత్వంలో పరిశ్రమలకు అనుకూలమైన సులభతరమైన విధానాలు ఎపిలో అమలు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా సౌరశక్తి నిల్వ వ్యవస్థలు, ముఖ్యంగా స్మార్ట్ సిటీలు, గ్రామీణ విద్యుదీకరణకు సౌర ఫలకాలను అమర్చడంలో భాగస్వామ్యం వహించాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ ఆశయాలకు అనుగుణంగా రెన్యువబుల్ ఎనర్జీపై దృష్టిసారిస్తే సహకారం అందిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాబోయే డేటా సెంటర్, ఐటి హబ్‌లకు వినూత్న బ్యాటరీ పవర్ స్టోరేజి పరిష్కారాలు అవసరం, టెస్లా ఎపికి వస్తే ఈ రంగంలో కీలకపాత్ర వహించే అవకాశం ఉంటుంది. రాష్ట్రవ్యాప్త EV ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం, సూపర్‌చార్జింగ్ టెక్నాలజీ అమలులో భాగస్వామ్యం వహించాలని కోరారు.

ఆర్ అండ్ డి, ఇన్నోవేషన్‌లో కీలక పాత్ర పోషిస్తూ, స్థిరమైన ఇంధన పరిష్కారాలపై దృష్టి సారించిన టెస్లా... ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ పార్కులను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.

ఏవియేషన్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టండి

పెరోట్ గ్రూప్ అండ్ హిల్‌వుడ్ డెవలప్‌మెంట్ చైర్మన్ రాస్ పెరోట్ జూనియర్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ డల్లాస్ లో భేటీ అయ్యారు. పెరోట్ జూనియర్ రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, డాటా సెంటర్, ఎనర్జీ రంగాల్లో విభిన్న పోర్ట్‌ఫోలియోలను పర్యవేక్షిస్తున్నారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల్లో ఆయన అగ్రగామిగా ఉన్నారు.

అలయన్స్ టెక్సాస్‌తో సహా యునైటెడ్ స్టేట్స్‌లోని కొన్ని విజయవంతమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పెరోట్ కీలక భూమిక వహించారు. 27,000 ఎకరాల మాస్టర్-ప్లాన్డ్ కమ్యూనిటీ అలయన్స్ టెక్సాస్‌ను అభివృద్ధి చేయడంలో రాస్ పెరోట్ జూనియర్ విశేషమైన గుర్తింపు పొందారు. రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్ ఏవియేషన్‌ రంగాల్లో పెరోట్ రూపొందించిన వెంచర్లు అమెరికాలో బిలియన్ల మేర ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపాయి. తన ప్రాజెక్ట్‌లలో అధునాతన సాంకేతికతలు, అంతరిక్ష ఆవిష్కరణలతో పెరోట్ సరికొత్త ట్రెండ్ సృష్టించారు.

ఏపీలో మౌలిక సదుపాయాలపై వివరణ..

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ఇన్నోవేటివ్ రియల్ ఎస్టేట్ & పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల్లో మీ వినూత్న విధానాలు మా రాష్ట్ర ఆర్థిక వృద్ధి, స్థిరత్వానికి తోడ్పడతాయి. మీ దార్శనిక ప్రాజెక్టులైన అలయన్స్‌టెక్సాస్ వంటివి ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల వృద్ధి వ్యూహంతో బాగా సరిపోతాయి. అలయన్స్ టెక్సాస్ తరహాలో పారిశ్రామిక, లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేయడానికి ఎపిలోని తీరప్రాంతంలో అనువైన వాతావరణం నెలకొని ఉంది. ఎపిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించే అంశాన్ని పరిశీలించండి. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లు, పెద్ద పట్టణాల అభివృద్ధిలో సహకారం అందించండి.

విశాఖపట్నంలో ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటుచేయాలని భావిస్తున్నామని ఏరోస్పేస్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలు నెరేవేర్చడం, ఏవియేషన్ హబ్‌గా అభివృద్ధి చేయడంలో మీ అనుభవం, సహకారం మాకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

మా ఆకాంక్షలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి భాగస్వామ్యం వహించే అంశాన్ని పరిశీలించండి. విశాఖలో డాటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన ఎకో సిస్టం ఉంది. ఈ రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక ప్రదేశం. నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్, ఏరోస్పేస్‌లో గ్లోబల్ ప్లేయర్‌లను ఆకర్షించడానికి మీ వంటి అనుభవజ్ఞుల నైపుణ్యం మాకు ఉపయోగపడుతుందన్నారు.

వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో పోర్టులు, హైవేలు, పట్టణాభివృద్ధి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పిపిపి ప్రాతిపదికన భాగస్వామ్యం వహించే అవకాశాలను పరిశీలించాల్సిందిగా మంత్రి లోకేష్ పెరోట్ జూనియర్ ను కోరారు.

Whats_app_banner