Anakapalli Blast : అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణా సంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. కోటవురట్ల మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామన్నారు. 2026 వరకు బాణసంచా తయారీ కేంద్రానికి లైసెన్స్ ఉందని, ప్రమాదానికి కారణాలు విచారణలో తేలుస్తామన్నారు.
"నా నియోజకవర్గం పాయకరావుపేటలోని కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణాసంచా తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందడంపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు సహాయక చర్యలను స్వయంగా సమీక్షించాలని బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఫోన్ చేసి స్వయంగా నాతో మాట్లాడారు.
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణా సంచా పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాద ప్రాంతాన్ని స్థానిక అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాతో కలిసి పరిశీలించాను. ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నాను. చోడవరం, రావికమతం, నక్కపల్లి పరిసర ప్రాంతాల నుండి వచ్చిన ఫైర్ ఇంజన్ల ద్వారా ఘటనా స్థలంలో వ్యాపించిన మంటలను వేగంగా అదుపు చేయగలిగాం" -హోంమంత్రి అనిత
అనకాపల్లి జిల్లా కోటవురట్లలోని కైలాసపట్నంలో జరిగిన ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బంది తక్షణం స్పందించారని హోంమంత్రి అనిత తెలిపారు. స్థానికులు, అధికారుల సాయంతో క్షతగాత్రులను నర్సిపట్నం ఏరియా ఆస్పత్రికి, కేజీహెచ్ ఆసుపత్రికి తరలించామన్నారు. నర్సీపట్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎంపీ సీఎం రమేష్ తో కలిసి పరామర్శించామని తెలిపారు. మృతి చెందిన కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతామన్నారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
"అనకాపల్లి జిల్లా కోటవురట్ల దగ్గర బాణాసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున్న భారీ పేలుడు మూలంగా ఆరుగురు దుర్మరణం పాలయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ప్రమాద ఘటన గురించి తెలియగానే హోంశాఖ మంత్రి అనితతో ఫోన్‌లో మాట్లాడాను. ఘటన వివరాలు, బాధితుల పరిస్థితి గురించి తెలిపారు. అధికార యంత్రాంగం సత్వరమే స్పందించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటుంది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొంటుంది.
కొద్ది రోజుల కిందట అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు వెళ్ళిన సందర్భంలో విశాఖలో భారీ పరిశ్రమలతోపాటు చిన్న, మధ్య, సూక్ష్మ పరిశ్రమల్లో పర్యావరణ సంబంధిత అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలతోపాటు భద్రతపరమైన జాగ్రత్తల గురించి చర్చించాలని భావించాను. అత్యవసరంగా సింగపూర్ వెళ్లాల్సి వచ్చింది. తదుపరి విశాఖ పర్యటనలో ఈ అంశంపై దృష్టిపెడతాను" - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
సంబంధిత కథనం