Anakapalli Fire Accident : అనకాపల్లి జిల్లా కైలాసపట్నం ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్ర అనిత వంగలపూడి, కలెక్టర్, ఎస్పీతో సీఎం ఫోన్ లో మాట్లాడారు. ప్రమాదానికి కారణాలు, బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
"అనకాపల్లి జిల్లా, కోటవురట్లలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఆరుగురు కార్మికులు మృతి చెందడం దిగ్భ్రాంతి కలిగించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సమాచారం ఆందోళన కలిగించింది. ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి అనితతో ఫోన్‌లో మాట్లాడాను. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించాను. అగ్నిప్రమాద సమయంలో కర్మాగారంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు, వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందని ఆరా తీశాను. బాధిత కుటుంబాలను ఆదుకుంటాము. ధైర్యంగా ఉండాలని కోరుతున్నాను. ఘటనపై విచారణ చేసి నివేదించాలని ఆదేశించాను" -సీఎం చంద్రబాబు
"అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మృతిచెందడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇదొక దురదృష్టకర ఘటన. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను"-మంత్రి నారా లోకేశ్
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని ఒక బాణా సంచా తయారీ కేంద్రంలో ప్రమాద ఘటన పట్ల మాజీ సీఎం , వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం, మరికొందరు తీవ్రంగా గాయపడడం తీవ్ర విచారకరమన్నారు. మరణించినవారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారి కుటుంబాలకు తోడుగా నిలవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆదేశించారు.
క్షతగాత్రులకు మంచి వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలు తిరిగి కోలుకునేలా అన్నిరకాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఈ ప్రమాదం పార్టీ నాయకుల ద్వారా తెలియగానే వెంటనే ఘటనాస్థలానికి వెళ్లి, సహాయంగా నిలవాలని వైసీపీ నాయకులను వైఎస్.జగన్ ఆదేశించారు.
అనకాపల్లి జిల్లాలో కైలాసపట్నంలో బాణసంచా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్ కు తరలించారు. బాధితుల్లో ఎక్కువ మంది తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందినవారు ఉన్నట్లు సమాచారం. పేలుడు సమయంలో పరిశ్రమలో 15 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కలెక్టర్ విజయకృష్ణన్ విచారణకు ఆదేశించారు.
కైలాసపట్నం గ్రామానికి చెందిన తాతబాబు(45), యాది గోవింద్(45), రాజపేటకు చెందిన దాడి రామలక్ష్మి(38), సామర్లకోటకు చెందిన నిర్మల (38), పురం పాప(40), వేణుబాబు (40), చౌడువాడకు చెందిన సేనాపతి బాబురావు, విశాఖకు చెందిన మనోహర్(30) ఈ ప్రమాదంలో మరణించారు.
సంబంధిత కథనం