PNBS RTC Bus Accident: విజయవాడలో ప్రయాణికులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, ముగ్గురు మృతి
PNBS RTC Bus Accident: విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ గుంటూరు ఏసీ సర్వీస్ బస్సు బ్రేకులు ఫెయిలై ప్లాట్‌ఫామ్ మీదకు దూసుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
PNBS RTC Bus Accident: విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే మెట్రో లగ్జరీ బస్సు అదుపు తప్పి ప్రయాణికుల మీదకు దూసుకెళ్ళింది. ఈ ఘటనలో ఆర్టీసి కండక్టర్‌తో పాటు మరో మహిళ అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదంలో రెండున్నరేళ్ల చిన్నారి కూడా మృతి చెందింది.
విజయవాడ గుంటూరు మధ్య నడిచే వోల్వో మెట్రో లగ్జరీ సర్వీస్ బస్సును ఉదయం 8.30గంటలకు ప్లాట్‌ఫాం నంబర్ 12నుంచి బయల్దేరుతుండగా ఈ ఘటన జరిగింది. ప్లాట్‌ఫాం మీద నుంచి రివర్స్‌లో వెనక్కి వెళ్లాల్సిన బస్సులు ముందుకు దూసుకురావడంతో ప్రమాదం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. డ్రైవర్ ఏమరపాటుగా ఉండటంతో ఘటన జరిగి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.
బ్రేకులు ఫెయిల్ అయ్యిందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. విజయవాడ గుంటూరు సర్వీసులో ప్రయాణికులకు టిక్కెట్లు ఇచ్చిన తర్వాత కండక్టర్ కిందకు దిగిపోయారు. ఈ ఘటనలో ప్లాట్‌ఫాం మీద నిలబడి ఉన్న కండక్టర్‌తో పాటు మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు.
విజయవాడ -గుంటూరు మెట్రో సర్వీస్ ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తుంటుంది. పిఎన్‌బిఎస్‌తో పాటు తాడేపల్లి సమీపంలో ప్రయాణికులకు టిక్కెట్లు ఇస్తుంటారు. విజయవాడ నుంచి 40నిమిషాల్లోపే గుంటూరు చేరే వీలుండటంతో ఎక్కువ మంది ప్రయాణికులు ఈ సర్వీసులో ప్రయాణిస్తుంటారు. విజయవాడ-గుంటూరు డైలీ సర్వీస్ చేసే కాలేజీ విద్యార్ధులు, ఉద్యోగులతో పాటు సాధారణ ప్రయాణికులతో ఈ సర్వీసు నడుస్తుంది.
సోమవారం విధులకు హాజరయ్యేందుకు బస్టాండ్‌లో గుంటూరు బస్సులు వెళ్లే 12వ నంబర్ ప్లాట్‌ఫాం వద్ద పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఎదురు చూస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. విజయవాడ గుంటూరు మధ్య ప్రతి పది నిమిషాలకో సర్వీసు నడుస్తుంది. రెండు నగరాల మధ్య ప్రయాణించే వారు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఆర్టీసి ఈ రూట్‌లో ఎక్కువ బస్సులు నడుపుతుంది.
ప్రయాణికులతో రద్దీగా ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో మిగిలిన వారు హడలిపోయారు. ఈ ఘటనలో ఆర్టీసి కాంట్రాక్టు కండక్టర్‌తో పాటు ఓ మహిళ మృతి చెందారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా, మరేదైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణలంక పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్లాట్‌ఫాంకు దూసుకొచ్చిన బస్సును సామర్థ్య పరీక్షల కోసం తరలించారు.
ప్రమాదానికి గురైన బస్సును కాలం చెల్లినా నడుపుతున్నారని ఆర్టీసి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రలోనే అతి పెద్ద బస్ టెర్మినల్‌లో నిత్యం వేల సంఖ్యలో బస్సులు రాకపోకలు సాగిస్తున్నా దానిని విస్తరించే ప్రయత్నాలు చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయనే విమర్శ ఉంది.
ఆర్టీసి బస్సు ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సు గేర్ పడకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని డ్రైవర్ స్పష్టం చేశారు. గేర్ బ్లాక్ అయ్యిందని, రివర్స్ గేర్ పడిందనే ఉద్దేశంలో యాక్సిలేటర్ తొక్కడంతో ముందుకు దూసుకెళ్లిందని చెప్పారు. రివర్స్ గేర్ పడకపోవడాన్ని గుర్తించలేదని చెప్పారు.
బాధితులకు రూ.5లక్షల పరిహారం.. ఆర్టీసీ ఎండి
విజయవాడ బస్టాండ్‌లో ఆటోనగర్ డిపోకు చెందిన బస్సు ప్రమాదానికి గురైనట్లు ఆర్టీసి ఎండీ ద్వారకా తిరుమల రావు చెప్పారు. 24మంది ప్రయాణికులతో బయల్దేరుతుండగా ప్లాట్‌ఫామ్ మీదకు దూసుకు వచ్చిందని చెప్పారు. కుమారి అనే ప్రయాణికురాలితో పాటు బస్సు ముందు నిలబడి ఉన్న ఔట్ సోర్సింగ్ కండక్టర్ కమ్ బుకింగ్ క్లర్క్ స్పాట్ లో చనిపోయినట్లు చెప్పారు.
బారికేడ్లు దాటుకుని స్టాల్స్ వైపుకు వచ్చిందన్నారు. యాంత్రిక తప్పిదమా, మానవ తప్పిదమా అనేది తెలియాల్సి ఉందన్నారు. బ్రేక్ ఫెయిల్ అయ్యిందా, డ్రైవర్ పొరపాటు చేశాడా అనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. ప్రమాదం జరిగినపుడు బస్సు ఏ గేర్‌లో ఉందనేది తెలియాల్సి ఉందన్నారు.
ప్రమాదంలో ఏడాదిన్నర చిన్నారి అయాన్ష్ కూడా ప్రాణాలు కోల్పోయిందని, మరో ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదంలో మరణించిన ముగ్గురికి ఆర్టీసీ తరపున ఐదు లక్షల పరిహారం చెల్లిస్తామన్నారు. గాయపడిన బుకింగ్ క్లర్క్ సురేష్‌బాబు, సుకన్యలకు ఆర్టీసీ చికత్స అందిస్తుందని చెప్పారు.
బస్టాండ్ ప్రాంగణంలో పరిమిత వేగంలో ప్రయాణించాలనే నిబంధన ఖచ్చితంగా అమలు చేస్తున్నామని, ఆర్టీసీ ప్రాంగణాల్లో జీరో టోలరెన్స్ నిబంధన పక్కాగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. డ్రైవర్‌కు గతంలో ఎలాంటి యాక్సిడెంట్ ట్రాక్ లేదన్నారు. డ్రైవర్ అల్కహాల్ సేవించి లేడని స్పష్టం చేశారు. విధుల్లోకి వచ్చే ముందు అల్కహాల్ టెస్ట్ చేసిన తర్వాత బస్సులు అప్పగిస్తామన్నారు. కొద్ది రోజులుగా సిక్‌లో ఉండి ఇటీవల విధుల్లో చేరినట్లు గుర్తించామన్నారు.
ఆర్టీసీలో జరిగే ప్రతి ప్రమాదంపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని ఆర్టీసీ ఎండి చెప్పారు. బస్సు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉందన్నారు. 24గంటల్లోనే ప్రమాదంపై నివేదిక వస్తుందని చెప్పారు. డ్రైవర్ ఫిట్‌నెస్ వచ్చాకే విధుల్లో చేరినట్టు చెప్పారు. బస్సు డ్రైవర్ల విషయంలో ఏ వయసు వారికి ఎలాంటి సర్వీసులు అప్పగించాలనే దానిపై ప్రమాణాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు.