Bifuracation Issues: విభజన లెక్కలు తేలాల్సిందే.. నేడు ఢిల్లీలో కీలక భేటీ-an important meeting will be held in delhi today on the resolution of andhra pradesh division issues ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  An Important Meeting Will Be Held In Delhi Today On The Resolution Of Andhra Pradesh Division Issues

Bifuracation Issues: విభజన లెక్కలు తేలాల్సిందే.. నేడు ఢిల్లీలో కీలక భేటీ

Sarath chandra.B HT Telugu
Nov 21, 2023 09:55 AM IST

Bifuracation Issues: ఆంధ్రప్రదేశ్‌కు పునర్విభజనతో ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని, విభజన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విభజన సమస్యలపై ఢిల్లీలో కీలక సమావేశం జరుగనున్న నేపథ్యంలో అధికారులకు సిఎం మార్గనిర్దేశం చేశారు.

అధికారుల బృందంతో చర్చిస్తున్న సిఎం జగన్
అధికారుల బృందంతో చర్చిస్తున్న సిఎం జగన్

Bifuracation Issues: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తవుతున్నా, చట్టంలో పేర్కొన్న అంశాలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని, ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల పురోగతిపై మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఢిల్లీలో కీలక సమావేశం జరుగనున్న నేపథ్యంలో సిఎం సమీక్షించారు. ఢిల్లీలో జరిగే సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.

సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎస్, వివిధ శాఖల ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు.

పోలవరం, ప్రత్యేక హోదా ప్రస్తావించండి..

రాష్ట్ర విభజనలో అప్పుల్లో 58% ఏపీకి, 42% తెలంగాణకు కేటాయించారని రెవెన్యూ మాత్రం 58% తెలంగాణకు, 42% ఏపీకి వచ్చిందని సిఎం జగన్ వివరించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ఆదాయాలు ఏ రకంగా పెరుగుతాయని, ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదని, పోలవరానికి నిధుల రాకలో సమస్యలున్నాయని తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలూ రాలేదని గుర్తు చేశారు.

విభజన కష్టాల నుంచి రాష్ట్రం ఏవిధంగా బయటకు రాగలుగుతుందని పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై సమావేశంలో దృష్టిపెట్టాలని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పట్ల కేంద్రం తప్పనిసరిగా ప్రత్యేకత చూపించాల్సిన అవసరముందని గుర్తు చేశారు.

అప్పుడే విభజన నష్టాల నుంచి రాష్ట్రం గట్టెక్క గలుగుతుందన్నారు. విభజన వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే విభజన చట్టంలో హామీలిచ్చారని హైదరాబాద్‌ రూపేణా పారిశ్రామిక, రోడ్డు రవాణా, విద్యా సంస్థల పరంగా ఇలా అన్ని రకాల మౌలిక సదుపాయాలను కోల్పోయామని జగన్ వివరించారు. దీనివల్ల రాష్ట్రానికి రెవెన్యూ రూపంలో చాలా నష్టపోయామని దీన్ని సర్దుబాటుచేస్తూ విభజన చట్టంలో ఆయా రంగాల మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కేంద్రం హామీలిచ్చిందని గుర్తు చేశారు.

విభజన చట్టంలో ఉన్న స్ఫూర్తి ఇప్పుడు అమల్లో కూడా కనిపించాల్సిన అవసర ముందని ఇవి నెరవేరితే ఏపీలో వసతులు సమకూరి వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయన్నారు. రెవెన్యూ క్రమంగా పెరుగుతూ వస్తుందని రాష్ట్రం పురోగమిస్తేనే దేశం కూడా పురోగమిస్తుందని చెప్పారు.

ఏపీకి కొత్తగా సెంట్రల్‌ అగ్రికల్చర్‌ వర్సిటీని కోరుతున్నామని కచ్చితంగా ఇది వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. దుగరాజపట్నంలో పోర్టు నిర్మాణం, కడపలో స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం హామీ ఇచ్చిందని స్టీల్‌ ప్లాంటుకు సమీపంలోని ఎన్‌ఎండీసీ నుంచి గనులు కేటాయించాలన్నారు. అప్పుడే ప్రతిపాదిత స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి మార్గం సులభమవుతుంది. వీటకోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు.

విశాఖ, విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మారుస్తామన్నారని విశాఖలో నేవీ కార్యకలాపాల వల్ల పౌరవిమానాలకు ఇబ్బంది వస్తోందని గుర్తు చేశారు. ఎయిర్‌ పోర్టును వేరేచోటకు బదిలీచేయాల్సిన అవసరం ఏర్పడిందని, ప్రస్తుతం భోగాపురం ఎయిర్‌పోర్టును నిర్మిస్తున్నారు. దీనికి కనెక్టివిటీ చాలా ముఖ్యమన్నారు.

ఎయిర్ పోర్టు నుంచి రహదారి ఏర్పాటుకు కేంద్రం ఇతోధికంగా సహాయం అందించాలని విశాఖ సిటీ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుసంధానం చేసే రహదారి అంశంపై కేంద్రంతో జరుగుతున్న సమావేశంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భూ సేకరణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. విజయవాడ లాంటి ఎయిర్‌ పోర్టుల్లోనూ భూ సేకరణ ఖర్చులను రాష్ట్రమే భరించాల్సి వస్తోందన్నారు.

విశాఖ మెట్రో రైలుపై ఒత్తిడి తెండి

విశాఖ మెట్రో రైలు అంశాన్ని కూడా కొలిక్కి తీసుకురావాలన్నారు. ప్రైవేట్‌ డెవలపర్‌ 60% భరిస్తున్నందున, భూ సేకరణ సహా మిగిలిన 40% కేంద్రం భరించేలా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. 2 రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన పెండింగ్‌లో ఉందని, దీనికోసం ఒత్తిడి తీసుకురావాలి. పలు బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై కూడా దృష్టి పెట్టాలన్నారు.

విశాఖ నుంచి రాయలసీమ ప్రాంతానికి అత్యంత వేగంగా నడిచే రైళ్ల కోసం హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని, విశాఖ-వయా ఉమ్మడి కర్నూలు జిల్లా మీదుగా కడపకు అత్యంత వేగంగా నడిచే రైళ్లకోసం ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు. దీనివల్ల 3 ప్రాంతాల మధ్య రాకపోకలు సులభమవుతాయి. విశాఖ రైల్వే జోన్‌ అంశంపై కూడా దృష్టిపెట్టాలన్నారు.

అధికార వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిలో భాగంగా మూడు రాజధానులను ప్రకటించిన నేపథ్యంలో ప్రాంతాల మధ్య సమతుల్యమైన, సమగ్రమైన అభివృద్ధి మన బాధ్యత అని సిఎం జగన్ పేర్కొన్నారు. మూడు ప్రాంతాలను అనుసంధానిస్తూ రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఇప్పటికే పలు రోడ్ల నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని భవిష్యత్తులో కూడా వీటిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమగ్రమైన సహకారం, సహాయం అవసరం. దీనికోసం సమావేశంలో కేంద్రాన్ని గట్టిగా కోరాలని రాష్ట్రం తరపున ఢిల్లీకి వెళ్లే అధికారులకు సూచించారు.

WhatsApp channel