ఏపీలోనూ 'హైడ్రా' తరహా సంస్థ...! ప్రభుత్వం సిద్ధమవుతోందా..?
తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై కొరడా ఝులిపిస్తోన్న ‘హైడ్రా’ దేశంలోనే సంచలనంగా మారింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లోనూ అక్రమ నిర్మాణాలపై సర్కార్ ఫోకస్ పెట్టే ఆలోచనలో ఉంది. తెలంగాణ తరహాలోనే ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.
తెలంగాణలో ‘హైడ్రా’ చర్యలపై సాధారణ ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఏపిలో కూడా అలాంటి తరహా చర్యలకు ప్రభుత్వం యోచిస్తోంది. హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. తెలంగాణ మాదిరిగా చెరువులు, నల్లాలను ఆక్రమించుకుని చేసిన నిర్మాణాలకంటే… ప్రభుత్వ భూములను కబ్జా చేసి, స్థలాలను ఆక్రమించుకొని నిర్మాణాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కువగా ప్రభుత్వ భూములు కబ్జాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. అలాగని అంతకుముందున్న ప్రభుత్వంలో కూడా సర్కార్ భూముల కబ్జాపై ఆరోపణలు లేకపోలేదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ భూముల కబ్జా ఆరోపణలు ఉన్నాయి.
అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తోందనేది ఆసక్తిగా ఉంది. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై చర్చలు తీసుకునేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజంగానే ఆక్రమణలపై టీడీపీ కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తే… కబ్జాదారుల జాబితాలో అధికార పార్టీకి చెందిన నేతలు ఉన్నా చర్యలు తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఉంటుంది.
ఇటీవలే రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ విశాఖపట్నంలో మాట్లాడుతూ… కబ్జా చేసిన వారికి వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ భూములు, పార్క్ స్థలాలు.. ఏవైనా ఆక్రమిస్తే తిరిగి ఇచ్చేయాలని సూచించారు. లేదంటే ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఆక్రమణలపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు ఉన్నాయని, వాటి పరిధిలో ఆక్రమణకు గురైన భూములను స్వచ్చందంగా ఇచ్చేయాలని లేదంటే ప్రభుత్వమే లాక్కుంటుందని మంత్రి స్పష్టం చేశారు. నిర్మాణాలుంటే తామే వచ్చి కూల్చేస్తామని స్పష్టం చేశారు. అవసరమనుకుంటే హైదరాబాద్‌లో మాదిరిగా ఏపీలో కూడా హైడ్రా తరహా సంస్థను ఏర్పాటు చేసి చర్యలు చేపడతామని స్ఫష్టం చేశారు.
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అడుగు ముందుకేసి ఆక్రమణదారులు కబ్జా చేసిన భూములు తిరిగి ఇవ్వకపోతే హైడ్రా తరహా చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో భూకబ్జాదారుల్లో వణుకు మొదలైందనే చర్చ జరుగుతోంది.