Nellore Crime: నెల్లూరు జిల్లాలో ఘోరం, ఎనిమిదేళ్ల బాలికపై పదో తరగతి విద్యార్థులు అఘాయిత్యం...
Nellore Crime: నెల్లూరు జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికపై పదో తరగతి చదువుతున్న విద్యార్థులు సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆడుకుంటున్న బాలికకు తినుబండరాలిస్తామని ఆశ చూపించి, పొదల్లోకి తీసుకెళ్లి ఒకరి తరువాత ఒకరు అత్యాచారానికి ఒడిగట్టారు.

Nellore Crime: నెల్లూరులో ఎనిమిదేళ్ల బాలికపై పదో తరగతి విద్యార్థులు అత్యాచారానికి పాల్పడటం సంచలనం సృష్టించింది. ఒకరు నోటిని మూస్తే, మరొకరు అత్యాచారానికి ఒడిగట్టారు. ఇలా ఇద్దరూ ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి, అక్కడి నుంచి పరారయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులుపై పోక్సో కేసు నమోదు చేశారు.
ఈ ఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెకంటాచలం మండలంలోని ఒక గ్రామంలో పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆదివారం కూడా స్పెషల్ క్లాసులను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం స్పెషల్ క్లాస్‌కు విద్యార్థులు హాజరయ్యారు.
ఇద్దరు విద్యార్థులు స్పెషల్ క్లాస్‌లు ముగిసిన తరువాత సాయంత్రం స్నాక్స్ తినేందుకు స్కూల్ ప్రహరీ దూకి పక్కనే ఉన్న కాలనీకి వెళ్లారు. ఆ కాలనీలో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలికను చూసి, ఆ బాలిక వద్దకు వెళ్లారు. బాలికకు తినుబండారాలు ఇస్తామని ఆశ చూపించారు. దీంతో ఆ బాలిక తినుబండాలిస్తారని వారితో వెళ్లింది. సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాలిక కేకలు వేసేందుకు ప్రయత్నించింది. అయితే కేకలు వినిబడకుండా ఇద్దరిలో ఒకరు బాలిక నోటిని మూస్తే, మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు.
ఇలా ఇద్దరు ఒకరి తరువాత ఒకరు అత్యాచారానికి పాల్పడి, ఆ బాలికను అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయారు. కొద్ది సేపటి తరువాత బాలిక తేరుకొని, భయపడుతూ ఇంటికి వెళ్లింది. బాలిక భయపడి ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. కానీ ఆదివారం సాయంత్రం నుంచి బాలిక ముభావంగా ఉంది.బాలిక మంగళవారం అనారోగ్యానికి గురైంది. దీంతో కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఒక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల్లో బాలికపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో బాలికను కుటుంబ సభ్యులు నిలదీయడంతో జరిగిన విషయాన్ని వివరించింది.
గురువారం బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు. ఇద్దరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలిక కుటుంబ సభ్యులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పిలిచి పోలీసులు విచారిస్తున్నారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)