Army Jawan Killed: జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో ఏపీకి చెందిన ఆర్మీ హవాల్దర్ ప్రాణాలు కోల్పోయారు. సోమవారం జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ఉగ్రవాదుల దాడి జరిగింది. ఈ దాడిలో శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం వల్లభరాయుడుపేటకు చెందిన ఆర్మీ హవల్దార్ జవాను సనపల జగదీశ్వరరావు (40) అమరుడయ్యారు. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ సమాచారాన్ని ఆర్మీ అధికారులు, కుటుంబ సభ్యులకు తెలిపారు.
మరో ఏడాదన్నరలో పదవీ విరమణ చేయాల్సి ఉండగా జగదీశ్వరరావు ప్రాణాలు కోల్పోవడం కుటుంబాన్ని విషాదంలో నింపింది. 2002లో ఇండియన్ ఆర్మీకి ఎంపికైన జగదీశ్వరరావు, ఆర్మీ జవానుగా విధుల్లో చేరారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లోని హవల్దార్‌గా పని చేస్తున్నారు.
ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం రావడంతో సోమవారం తెల్లవారుజామున విధి నిర్వహణలో భాగంగా కూంబింగ్ చేపట్టారు. ఉగ్రవాదులను అంతం చేసేందుకు నిర్వహించిన ఈ కూంబింగ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో జగదీశ్వరరావు అమరుడయ్యారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
జగదీశ్వరరావుకి తల్లిదండ్రులు మల్లేశ్వరరావు, నారాయణమ్మతో పాటు భార్య సమత, ఇద్దరు కుమార్తెలు మోక్ష ప్రియ (8), దీక్షిత (6) ఉన్నారు. భార్య సమత టెక్కలిలో ఉంటూ నందిగాం మండలం దిమిలాడ సచివాలయంలో మహిళా పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పిల్లలు టెక్కలిలోనే చదువుతున్నారు. భర్త మరణవార్త విని భార్య సమత, పిల్లలను తీసుకొని టెక్కలి నుంచి వల్లభరాయుడిపేటకు చేరుకుంది.
అప్పటికే కుమారుడి మరణవార్త విని తల్లిదండ్రులు, బంధువులు రోదనలు మిన్నంటాయి. సమత, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. దేశం కోసం పని చేసే జవాన్ మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జగదీశ్వరరావు సోదరుడు విఘ్నేశ్వరరావు కూడా ఆర్మీలోనే పని చేస్తున్నారు. జగదీశ్వరరావు మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
జమ్మూకాశ్మీర్‌లోని దొడా జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఒక ఆర్మీ అధికారి, నలుగురు జవాన్లు మరణించారు. సోమవారం రాత్రి దొడా జిల్లాలకు 55 కిలో మీటర్ల దూరంలో ఉన్న దేశా ఫారెస్ట్ బెల్ట్ సమీపలంలో రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా సైనికులు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఈ ఘటన జరిగింది. రాత్రి 9 గంటల సమయంలో ఉగ్రవాదులు మరోసారి జరిపిన కాల్పుల్లో ఐదుగురు ఆర్మీ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)