Air India Kuwait service: ప్రయాణికుల్ని వదిలి కువైట్ వెళ్లిపోయిన విమానం..
Air India Kuwait service: విజయవాడ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు పున: ప్రారంభించిన తొలిరోజే ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా రీ షెడ్యూల్ చేయడంతో ప్రయాణికులు వెళ్లాల్సిన విమానాన్ని మిస్ అయ్యారు.
Air India Kuwait service: ఎయిర్ ఇండియా నిర్వాకంతో విమాన ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. విజయవాడ అంత్జాతీయ విమానాశ‌్రయం నుంచి విదేశీ సర్వీసులు ఆర్నెల్ల క్రితం నిలిచిపోయాయి. ప్రజా ప్రతినిధుల చొరవ, కేంద్ర పౌర విమానయాన శాఖకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో విజయవాడ నుంచి కువైట్‌కు నేరుగా సర్వీసుల్ని ఎయిర్ ఇండియా ప్రారంభించింది.
బుధవారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా కువైట్‌కు ప్రత్యేక విదేశీ సర్వీసును అధికారులు ప్రారంభించారు. ప్రయాణికుల స్పందన ఎలా ఉందో తెలుసుకోడానికి అక్టోబర్ 28 వరకు ప్రయోగాత్మకంగా సర్వీసులు నడుపుతామని ప్రకటించింది. ప్రతి బుధవారం కువైట్‌కు విమానాన్ని నడుపుతున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించడంతో 80మందికి పైగా ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సంస్థ ప్రతి బుధవారం కువైట్ సర్వీసును నడిపేందుకు ముందుకు వచ్చిందని, అక్టోబరు 28వ తేదీ వరకు ఈ ప్రత్యేక సర్వీసు కొనసాగనుందని అధికారులు ప్రకటించారు. ఉదయం 9.55 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సుమారు 66 మంది ప్రయాణికులతో విమానం కువైట్‌కు బయలుదేరి వెళ్లింది. తిరిగి రాత్రి 8.35 గంటలకు విజయవాడ చేరుకుంది.
ప్రయాణికుల్ని వదిలేసి వెళ్లి పోయిన విమానం…
ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున దుబాయ్,కువైట్ దేశాల్లో వలస కార్మికులుగా పనిచేస్తుంటారు. వారంతా హైదరాబాద్, చెన్నై విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. విజయవాడ విమానాశ్రయం నుంచి విమానం అందుబాటులోకి రావడంతో చాలామంది టిక్కెట్లు కొనుగోలు చేశారు. తొలి సర్వీసులో మధ్యాహ్నం 1.10కి విమాన షెడ్యూల్ ఇచ్చారు.
బుధవారం ఉదయం 9.55 గంటలకే విమానం వెళ్లిపోవడంతో విమానాశ్రయానికి వచ్చిన వారు ఖంగుతిన్నారు. విమానం వెళ్లిపోవడం ఏమిటని ఎయిర్ ఇండియా అధికారులతో వాగ్వాదానికి దిగారు. మారిన సమయంపై సమాచారం ఇవ్వక పోవడంపై సంస్థ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విమానం రీ షెడ్యూల్ చేసినట్లు, బయలు దేరే సమయం మారిందన్న విషయాన్ని వ్యక్తిగత మెయిల్స్, సెల్‌ఫోన్లతో పాటు సోషల్ మీడియాలో ముందే తెలియజేశామని చెప్పారు. చాలా మంది నిరక్షరాస్యులు కావడం, సోషల్ మీడియా,ఫోన్లలో సమాచారం అందకపోవడం వంటి కారణాలతో తమకు తెలియలేదని ఆందోళనకు దిగారు. సమాచార లోపం కారణంగా కువైట్ వెళ్లకుండా ఉండిపోయిన 16 మంది ప్రయాణికులు విమానాశ్రయంలో నిరసనకు దిగారు. ప్రయాణికుల ఆందోళనతో వారిని వచ్చే వారం కువైట్ విమానంలో పంపుతామని హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు.