క్వాంటమ్ టెక్నాలజీకి అమరావతే కేంద్రం: సిలికాన్ వ్యాలీ తరహాలో క్వాంటమ్ వ్యాలీ-amravati to emerge as quantum valley hub for quantum technology cm chandrababu vision ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  క్వాంటమ్ టెక్నాలజీకి అమరావతే కేంద్రం: సిలికాన్ వ్యాలీ తరహాలో క్వాంటమ్ వ్యాలీ

క్వాంటమ్ టెక్నాలజీకి అమరావతే కేంద్రం: సిలికాన్ వ్యాలీ తరహాలో క్వాంటమ్ వ్యాలీ

HT Telugu Desk HT Telugu

సిలికాన్ వ్యాలీ మాదిరిగానే అమరావతి ప్రపంచ క్వాంటమ్ వ్యాలీగా ప్రత్యేక గుర్తింపు పొందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (ఫైల్ ఫోటో) (PTI)

అమరావతి: సిలికాన్ వ్యాలీ మాదిరిగానే అమరావతి ప్రపంచ క్వాంటమ్ వ్యాలీగా ప్రత్యేక గుర్తింపు పొందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండాలని, అందుకు ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్ మార్గదర్శిగా నిలవాలని ఆయన అన్నారు. సోమవారం సచివాలయంలో ఐటీ రంగ నిపుణులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ దిశగా కీలక ఆదేశాలు జారీ చేశారు.

క్వాంటమ్ వ్యాలీ ఎకోసిస్టమ్ ఏర్పాటుపై విస్తృత చర్చ

అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేయడంపై ఐటీ నిపుణులతో సీఎం చంద్రబాబు విస్తృతంగా చర్చించారు. ఈ నెల 30న విజయవాడలో క్వాంటమ్ మిషన్‌పై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ వర్క్‌షాప్‌కు ఐటీ, ఫార్మా, ఆగ్రో, హెల్త్ రంగాల ప్రతినిధులు, విశ్వవిద్యాలయాలు, కళాశాలల నిపుణులు, స్టార్టప్‌లు, ఇన్నోవేటర్లను ఆహ్వానించనున్నారు. క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం నుంచి ప్రతి అంశంపై అత్యంత శ్రద్ధ తీసుకోవాలని, భవన నిర్మాణం కూడా అత్యంత ఐకానిక్‌గా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

రెండు దశల్లో రూ.4,000 కోట్లతో ఏపీ క్వాంటమ్ మిషన్

సమీక్షా సమావేశంలో అధికారులు ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్ అజెండా, కార్యాచరణను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. క్వాంటమ్ ఇన్నోవేషన్ హబ్‌గా రాష్ట్రాన్ని నిలపడం, జాతీయ క్వాంటమ్ మిషన్‌లో భాగస్వామ్యం కావడం, నాలెడ్జ్ ఎకానమీని బలోపేతం చేయడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యాలు.

క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్-మెట్రాలజీ, క్వాంటమ్ మెటీరియల్స్-డివైజ్‌లపై ఈ మిషన్ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ముఖ్యమంత్రి స్వయంగా ఈ మిషన్‌కు నేతృత్వం వహిస్తారు. ఐటీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐటీ కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, మిషన్ డైరెక్టర్, నిపుణుల కమిటీ ఈ మిషన్‌లో భాగస్వాములుగా ఉంటారు.

ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్‌ను రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. మొదటి దశ 2025-2027 వరకు, రెండవ దశ 2027-2030 వరకు కొనసాగుతుంది. మొదటి దశలో మౌలిక వసతుల కల్పన, విద్య-పరిశోధన, పైలట్ ప్రోగ్రామ్‌లపై దృష్టి పెడతారు. రెండవ దశలో ఏపీ గ్లోబల్ లీడర్‌షిప్‌గా ఎదగడం, వాణిజ్యం, ఎగుమతి సామర్థ్యం పెంపొందించుకోవడం వంటివి ప్రధానంగా ఉంటాయి. ఈ మిషన్‌కు వచ్చే ఐదేళ్లలో దాదాపు రూ.4,000 కోట్లు ఖర్చు కానుందని అధికారులు అంచనా వేశారు.

త్వరలోనే ఈ క్వాంటమ్ మిషన్ కోసం ప్రత్యేకంగా ఒక డైరెక్టర్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్‌కు ఐబీఎం (IBM) సారథ్యం వహిస్తుంది.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.