Ambedkar Statue: అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ మళ్లీ వాయిదా..!-ambedkar statue unveiling postponed again in vijayawada ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Ambedkar Statue Unveiling Postponed Again In Vijayawada

Ambedkar Statue: అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ మళ్లీ వాయిదా..!

Sarath chandra.B HT Telugu
Nov 27, 2023 06:41 AM IST

Ambedkar Statue: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ మళ్లీ వాయిదా పడింది. ఈ ఏడాది ఏప్రిల్ 14 నుంచి పలుమార్లు వాయిదా పడిన విగ్రహావిష్కరణ మళ్లీ వాయిదా వేశారు.

విజయవాడలో నిర్మించిన అంబేడ్కర్ విగ్రహం
విజయవాడలో నిర్మించిన అంబేడ్కర్ విగ్రహం

Ambedkar Statue: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున భారీ వ్యయంతో నిర్మిస్తున్న అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం పూర్తైనా ఆవిష్కరణకు మాత్రం ముహుర్తం ఖరారు కాలేదు. నవంబర్ 26న విగ్రహావిష్కరణ ఉంటుందని కొన్ని నెలలుగా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ చెబుతూ వచ్చారు. గడువు దగ్గర కొచ్చేసరికి అధికారులు సైలెంట్ అయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

దాదాపు రూ.400కోట్ల రుపాయల వ్యయంతో విజయవాడలో నిర్మిస్తున్న అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ మరోసారి వాయిదా పడింది. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుందని కొన్ని నెలలుగా ఏపీ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఆ గడువు కూడా వెళ్లిపోయినా విగ్రహావిష్కరణకు మోక్షం దక్కలేదు.

విజయవాడ నగరంలో అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం కోసం 2020లో పనులు ప్రారంభించారు. ఏడాదిలోగా విగ్రహ నిర్మాణం పూర్తి చేయాలని భావించినా డిజైన్లు ఖరారు చేసి, పనులు ప్రారంభించేసరికి రెండేళ్లు గడిచిపోయాయి. హర్యానాలో తయారు చేసి విజయవాడకు తీసుకొచ్చిన విడిభాగాలకు కొద్ది నెలల క్రితమే ఆకృతినిచ్చారు. 125 అడుగులు ఎత్తైన విగ్రహంతో పాటు మరో 80 అడుగుల ఎత్తున నిర్మించిన పీఠంతో కలిపి 205 అడుగల విగ్రహాన్ని నిర్మించారు.

విగ్రహ నిర్మాణంతో పాటు మ్యూజియం, ల్యాండ్ స్కేపింగ్, అంబేడ్కర్ స్మృతి వనం పనులు పూర్తి కాకపోవడంతో విగ్రహావిష్కరణ వాయిదా పడుతోంది. మరోవైపు ఎన్నికల నాటికి అంబేడ్కర్ విగ్రహావిష్కరణ పూర్తి చేయాలనే భావనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ముందే విగ్రహావిష్కరణ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చినా పెద్దగా ఫలితం ఉండదనే ఉద్దేశంతోనే నిదానంగా పనులు నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

జనవరిలో ఆవిష్కరించే అవకాశం...

జనవరిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ జరిగే అవకాశం ఉందని విజయవాడ కార్పొరేషన్ వర్గాలు చెబుతున్నాయి.రాజకీయ వర్గాల్లో మరో రకమైన ప్రచారం జరుగుతోంది. జనవరి చివరి వారంలోనే కేంద్రంలో ఎన్నికలకు సంబంధించిన కీలక ప్రకటన రావొచ్చని చెబుతున్నారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం తర్వాత ఏ క్షణంలోనైనా సాధారణ ఎన్నికల ప్రకటన వెలువడొచ్చని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో జనవరి చివరి నాటికి అసెంబ్లీ ఎన్నికల వాతావరణం నెలకొంటుంది.ఆ సమయంలో విగ్రహావిష్కరణ చేసే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంబేడ్కర్ విగ్రహ నిర్మాణంతో పాటు అదే ఖర్చుతో బోలెడు పనులు తలకెత్తుకోవడంతో వాటిని పూర్తి చేయడానికి జాప్యం జరుగుతోందని చెబుతున్నారు.

WhatsApp channel