Ambati Rayudu Quit : అంబటి వికెట్ డౌన్ - వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన
Ambati Rayudu quit From YCP : వైసీపీకి షాక్ ఇచ్చారు అంబటి రాయుడు. వైసీపీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు 'X'(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
Ambati Rayudu quit From YCP : ఇటీవలే వైసీపీలో చేరిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.
క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు… డిసెంబర్ 28వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన పది కొద్దిరోజుల్లోనే రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు చెప్పటం హాట్ టాపిక్ గా మారింది.
గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు కొంత కాలంగా రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడిపై జనసేన కూడా కన్నేసింది. పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు చేసింది. ఇవన్నీ ఇలా ఉన్నప్పటికీ… అంబటి మాత్రం జగన్ ను కలుస్తూ వచ్చారు. ఇదే సమయంలో వైసీపీ అనుకూల ప్రకటనలు చేశారు. అయితే చేరికపై మాత్రం ఓపెన్ కాలేదు. ఈ మధ్య కాలంలో పలు జిల్లాలో తిరుగిన అంబటి రాయుడు…. వైసీపీ పాలనపై ప్రశంసలు కురిపించారు.వ్యూహం సినిమా ఈవెంట్ లో కూడా జగన్ పాలనపై తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. కానీ గత నెల 28వ తేదీన ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.
వైసీపీలో చేరటంతో…. వచ్చే అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో అంబటి పోటీ చేయటం ఖాయమే అన్న చర్చ జోరందుకుంది. ఆయన సొంత జిల్లా అయిన గుంటూరు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం ఉందని… అలా కుదరకపోతే నర్సరావుపేట ఎంపీ టిక్కెట్ ఇవ్వొచ్చన్న అభిప్రాయాలు బలంగా వినిపించాయి. అంతా సవ్యంగా నడిచిపోతుందేమో అనుకున్న టైంలో…. అంబటి రాయుడు సడన్ గా షాక్ ఇవ్వటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే అంబటి రాయుడి రాజీనామాకు ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా..? వంటి అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్