అమరావతిలో సభ జరిగిన వేదిక మీద నుంచి చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లు అనేక అబద్దాలను మాట్లాడారని.. మాజీమంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఆ సభ చూసిన తరువాత అమరావతి అనేది ఒక అంతులేని కథ, దానికి సశేషం ఉండదు అని భావన రాష్ట్ర ప్రజలకు కలిగిందన్నారు. మొదటి నుంచి రాజధానిని అడ్డం పెట్టుకుని ఎలా జేబులు నింపుకోవాలన్నదే చంద్రబాబు ఆలోచన అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
'నిజంగా రాజధానిని నిర్మించే చిత్తశుద్ది చంద్రబాబుకు లేదు. రాష్ట్ర విభజన తరువాత అనుభవం ఉందని చంద్రబాబుకు ప్రజలు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. రాజధాని లేని రాష్ట్రానికి గొప్ప రాజధానిని, కొత్త నగరాన్నే తీసుకువస్తానంటూ.. చంద్రబాబు ఊదరగొట్టారు. 2014 నుంచి 19 మధ్య ముఖ్యమంత్రిగా అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.48 వేల కోట్ల పనులు చేపడుతున్నట్లు ప్రకటించారు. రూ.41 వేల కోట్లకు టెండర్లు పిలిచారు. అయిదేళ్ల చంద్రబాబు పాలనలో అమరావతి కోసం చేసిన ఖర్చు ఎంతా అని చూస్తే.. కేవలం రూ.5,587 కోట్లు మాత్రమే. అవికూడా తాత్కాలిక భవనాలే' అని అంబటి వివరించారు.
'రాష్ట్రం విడిపోయి, ఏళ్ల తరబడి రాజధాని లేకుండా ఏపీ ఇబ్బందులు పడుతోంది. రాజధానిని నిర్మించుకోవాలి. ఆర్థిక పరిస్థితి బాగోలేదు. హైదరాబాద్ వంటి నగరాన్ని కోల్పోయాం. పదేళ్ల పాటు హైదరాబాద్‌లోని మౌలిక సదుపాయాలను వినియోగించుకునేందుకు విభజన చట్టం మనకు వీలు కల్పించింది. విభజనతో గాయపడి, ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రం అత్యంత ఖరీదైన ఒక నగరాన్ని నిర్మించే స్థాయిలో ఉందా. ఎంతో పాలనా అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు ఆలోచించలేదు?' అని రాంబాబు ప్రశ్నించారు.
'రైతుల నుంచి 33 వేల ఎకరాలను సేకరించే సమయంలో.. వారికి అద్భుతమైన ఫ్లాట్స్ ఇస్తామని, వారిని లక్షాధికారులను చేస్తామని చెప్పారు. నేటికీ 33 శాతం మంది రైతులకు ఫ్లాట్‌లను రిజిస్టర్ చేయలేదు. అమరావతికి పేరు పెట్టింది, అమరావతిని విధ్వంసం చేస్తున్నదీ చంద్రబాబే. ఏకంగా రూ.లక్ష కోట్లతో రాజధాని నగరాన్ని నిర్మించే ఆర్థిక వనరులు ఏపీకి ఉన్నాయా? లేకపోయినా నిర్మిస్తానని చంద్రబాబు ఎలా ప్రజలను మభ్యపెట్టారు? ఇవ్వన్నీ ప్రశ్నించినందుకు వైసీపీ అమరావతికి వ్యతిరేకం అంటూ మాపైన బుదరజల్లారు' అని అంబటి వ్యాఖ్యానించారు.
'చంద్రబాబు భయంకరమైన అప్పులు చేస్తూ.. రాజధాని నిర్మాణం కోసం అని చెబుతున్నారు. ఇప్పటికే ఏకంగా రూ.52 వేల కోట్ల అప్పులు తీసుకువచ్చారు. గతంలో జగన్ ప్రభుత్వం అప్పులు చేస్తుంటే.. అది తప్పని, రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు అమరావతి నిర్మాణం పేరుతో ఏడీబీ బ్యాంక్ నుంచి రూ.15 వేల కోట్లు, కెఎఫ్‌డబ్ల్యు నుంచి రూ.5 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.26 వేల కోట్లు, సీఆర్‌డీఏ కమిట్ అయిన అప్పులు మరో రూ.21 వేల కోట్లు. ఇది ఎంత వరకు సమంజసం? ఈ రూ.52 వేల కోట్లు పారదర్శకంగా ఖర్చు చేస్తున్నారా?' అని రాంబాబు ప్రశ్నించారు.
'చంద్రబాబు అమరావతి అనే భ్రమరావతి ఊహాచిత్రాన్ని చూపి ప్రజలను మోసం చేస్తున్నారు. గత అయిదేళ్లలో చేయలేని రాజధానిని, మూడేళ్లలో చేయగలనని ఎలా చెబుతున్నారు? అమరావతి ప్రాంతంలోని ప్రజలు దీని గురించి ఆలోచించాలి. గతంలో మట్టీ, నీరు తెచ్చి మా ముఖాన కొట్టారని చంద్రబాబు ప్రధాని నరేంద్రమోదీపై విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఏకంగా పాచిపోయిన లడ్డూలు ఏపీకి ఇచ్చారని దుయ్యబట్టారు. ఈ రోజు వేదికపై అదే నాయకులు ప్రధాని నరేంద్రమోదీని పొగడ్తలతో ముంచెత్తారు' అని ఎద్దేవా చేశారు.
సంబంధిత కథనం