చంద్రబాబు, లోకేష్ పులి మీద స్వారీ చేస్తున్నారు.. స్వారీ ఆపగానే ఆ పులి ఇద్దరినీ మింగేస్తుంది.. అని మాజీమంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్‌ల వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందని ఆరోపించారు. చంద్రబాబు చేతుల్లో పోలీస్ వ్యవస్థ బందీగా మారిందని విమర్శించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ గెలవడం ఖాయమన్న అంబటి.. ప్రతి అక్రమ అరెస్టుకు సమాధానం చెప్తామని స్పష్టం చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు.
'ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సకల శాఖల మంత్రిగా కొత్త అవతారం ఎత్తారు. తనకు సంబంధం లేని మంత్రిత్వ శాఖల్లో లోకేష్ తలదూర్చి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. దొంగ సాక్ష్యాలు.. అబద్ధపు స్టేట్మెంట్స్ తో ఈ ఇద్దరిని అరెస్టు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వీరిని అరెస్టు చేశారు' అని వైసీపీ నేతలు ఆరోపించారు.
'సోలార్ ప్రాజెక్టులను ఏపీలో విస్తారంగా తెచ్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదే. నాటి ముఖ్యమంత్రి జగన్ తెచ్చిన సోలార్ ప్రాజెక్టులను.. తాను తెచ్చినట్లు నారా లోకేష్ చెప్పడం సిగ్గుచేటు. జగన్ పాలనలో 22 వేల కోట్ల రూపాయల విలువైన సోలార్ ప్రాజెక్టులు వచ్చాయి. ఇందులో భాగంగానే రెన్యూ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టింది. వీటిని తానే సాధించినట్లుగా లోకేష్ చెప్పుకుంటూ.. అనంతపురంలో రెన్యూ ప్రాజెక్టుకు భూమి పూజ చేయడం విడ్డూరంగా ఉంది' అని వైసీపీ విమర్శలు గుప్పించింది.
'ప్రజల సమస్యలను మంత్రి నారా లోకేష్ పట్టించుకోవడం లేదు. జగన్ సంక్షేమ పథకాలు ఎందుకు ఆపేశారో చంద్రబాబు, లోకేష్ చెప్పాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఎందుకు విడుదల చేయలేదు. ప్రభుత్వ వసతి గృహంలో అమ్మాయిలకు ఎలుకలు కొరికినా స్పందించలేదు. రెండు రోజుల అనంతపురం పర్యటనలో నారా లోకేష్ సాధించింది శూన్యం' అని వైఎస్సార్సీపీ నాయకులు విమర్శించారు.
అధికార పార్టీకి కొమ్ముకాస్తూ.. వైసీపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారులను గుర్తుపెట్టుకుంటామని.. ఎవరిని వదిలే ప్రసక్తే లేదని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి హెచ్చరించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అరెస్టును ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందన్నారు. లిక్కర్ స్కామ్ జరిగిందంటూ.. విచారణ పేరుతో అరెస్టు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు.
సంబంధిత కథనం