Amaravati works:రూ. 64వేల కోట్లతో అమరావతి పనులు.. కృష్ణా నది లంక భూముల్లో స్పోర్ట్స్ సిటీ ప్రతిపాదనలు
Amaravati works: అమరావతిలో రూ.64వేల కోట్లతో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించినట్టు మంత్రి నారాయణ వివరించారు. రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా మరో 30 వేల ఎకరాల సమీకరించే ప్రతిపదన పరిశీలిస్తున్నట్టు తెలిపారు.
Amaravati works: అమరావతిలో రూ.64వేల కోట్లతో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించినట్టు మంత్రి నారాయణ వివరించారు. రాజధానిలోని అనంతవరంలో మంగళవారం మంత్రి నారాయణ పర్యటించారు. అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ కోసం కొండలను మంత్రి నారాయణ,సీఆర్డీయే,మైనింగ్ శాఖల అధికారులు పరిశీలించారు.
గత ప్రభుత్వ నిర్వాకంతో అమరావతిలో రాజధాని పనుల ప్రారంభానికి ఆటంకాలు వచ్చాయని, న్యాయపరమైన సమస్యలు అధిగమించేందుకు 8 నెలలు పట్టిందని మంత్రి వివరించారు. 68 పనులకు సంబంధించి 42360 కోట్ల విలువైన పనులకు టెండర్లు పూర్తయ్యాయని, ఈ పనులన్నీ ఇప్పటికే ప్రారంభం అయ్యాయని మంత్రి చెప్పారు.
అమరావతి పనులకు అవసరమైన గ్రావెల్ కోసం గనుల శాఖ 851 ఎకరాలు సీఆర్డీయే కు కేటాయించిందని, గతంలో అనంతవరం కొండను సీఆర్డీయే కు కేటాయించారని గత ప్రభుత్వంలో 8 మీటర్ల లోతు వరకూ తవ్వేశారని, ఇక్కడ భూమిని కూడా ఏదోక అవసరానికి ఉపయోగించాలని చూస్తున్నట్టు చెప్పారు.
రాజధానిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్
రాజధానిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట కట్టాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడలను కలిపి మెగాసిటీగా చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి వివరించారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం కనీసం 5 వేల ఎకరాలు అవసరమవుతాయని, ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటే 30 వేల ఎకరాలు అవసరం ఉంటుందని మంత్రి నారాయణ చెప్పారు.
అదనపు భూమి కోసం భూసేకరణ చేస్తే రిజిస్ట్రేషన్ ధర పై రెండున్నర రెట్లు మాత్రమే వస్తుందని, భూసేకరణ ద్వారా తీసుకుంటే రైతులు నష్టపోతారని... సమీకరణ చేయాలని స్థానిక ఎమ్మెల్యే లు కోరారని, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని, రాజధానిలో 92 పనులను 64,912 కోట్లతో చేపట్టినట్టు మంత్రి వివరించారు.
లంక భూముల్లో స్పోర్ట్స్ సిటీ ప్రతిపాదనలు..
విజయవాడ నగర శివార్లలో కృష్ణానదిలో ఉన్న లంక గ్రామాల్లో అమరావతి స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. నదిలో మెరకగా ఉన్న భూముల్ని సేకరించి స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నారు.దీనికోసం మూలపాడు సమీపంలో ఉన్న పెదలంక, చినలంక గ్రామాల పరిధిలో 1,600 ఎకరాల్ని ప్రాథమికంగా గుర్తించారు.
అత్యాధునిక వసతులతో స్పోర్ట్స్ సిటీని, దానిలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మించే ఉద్దేశంతో భూముల్ని పరిశీలించారు. స్పోర్ట్స్ సిటీకి ప్రతిపాదిస్తున్న ప్రాంతం రాజధాని అమరావతిలోని రాయపూడికి ఎదురుగా కృష్ణా నదిలో ఉంటుంది. అమరావతిని మచిలీపట్నం- హైదరాబాద్ జాతీయ రహదారితో కలుపుతూ నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జికి పక్కనే స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మూలపాడులో ఇప్పటికే రెండు చిన్న క్రికెట్ స్టేడి యంలు ఉన్నాయి.
రాజధాని మాస్టర్ ప్లాన్‌లో భాగంగా అమరావతిలోనే స్పోర్ట్స్ సిటీని ప్రతిపాదించారు. రాజధానిలో భూముల లభ్యత తక్కువగా ఉండ టంతో స్పోర్ట్స్ సిటీకి 100 ఎకరాలకు మించి కేటాయించలేమని సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో స్పష్టం చేశారు. స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు 100 ఎకరాలు చాలవని, క్రికెట్ స్టేడియం నిర్మాణానికే 60 ఎకరాలకు కావాల్సి ఉంటుందని, ప్రత్యామ్నాయంగా కృష్ణా నది లంక భూముల్లో స్పోర్ట్స్ సిటీ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు.
సంబంధిత కథనం