Southwest Monsoon : రాబోయే 24 గంటల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు- ఏపీ, తెలంగాణలోకి ఎప్పుడంటే?
Southwest Monsoon : రాబోయే 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు కేరళను తాకిన నాలుగైదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తరించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
Southwest Monsoon : రాబోయే 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అలాగే నైరుతు రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది.
నాలుగైదు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రోహిణి కార్తె ప్రభావంతో ఎండలు మరింత ముదురుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. వచ్చే 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని ప్రకటించింది. ఈ ఏడాగి అంచనా వేసిన సమయం కంటే ముందే నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు తెలుస్తోంది. రుతుపవనాలు కేరళను తాకిన నాలుగైదు రోజుల్లో ఏపీ, తెలంగాణలో విస్తరిస్తాయని వాతావరణ విశ్లేషకులు అంటున్నారు. నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా పడతాయని ప్రజలు భావిస్తు్న్నారు. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అడపదడపా వర్షాలు కురుస్తున్నాయి.
రుతుపవనాల కదలికకు అనుకూల పరిస్థితులు
వచ్చే 24 గంటల్లో కేరళలో రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముంద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, మాల్దీవుల్లోని మిగిలిన భాగాలు, కొమోరిన్ ప్రాంతంలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. లక్షదీప్ లోని కొన్ని ప్రాంతాలు, కేరళ, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం రుతుపవనాలు మరింత ముందుకు సాగనున్నాయని పేర్కొంది.
రాబోయే మూడు రోజులు ఎండలే
ఏపీ, యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజుల వాతావరణ సూచనలు అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో రాబోయే మూడు రోజులు వాతావరణ పొడిగా ఉండే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వెల్లడిచింది. దక్షిణ కోస్తాంధ్రలో రాబోయే మూడు రోజులు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30-40 కి.మీ వేగంగా బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో ఇవాళ, రేపు వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది. ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే గరిష్ణ ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలో ఎండలు
తెలంగాణలో మళ్లీ ఎండలు దంచుతున్నాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. చాలా జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలో గత రెండు మూడు రోజులుగా మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. చాలా జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాగల మూడు రోజులు పగటిపూట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేరకు పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.
సంబంధిత కథనం