Amaravati Real Estate : అమరావతిలో రియల్ బూమ్, వేగంగా పెరుగుతున్న భూముల ధరలు
Amaravati Real Estate : అమరావతిలో రియల్ బూమ్ మొదలైంది. రాజధాని పనులు ప్రారంభం అవుతుండడం, టెండర్ల ప్రక్రియ మొదలుకావడంతో రియాల్టర్లు భూముల అభివృద్ధిపై దృష్టిపెట్టారు. దీంతో పాటు ప్రభుత్వం రియల్ రంగాన్ని ప్రోత్సహించేలా చర్యలు చేపడుతుంది.
Amaravati Real Estate : ఏపీ రాజధాని అమరావతికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం సర్వవిధాలా ప్రయత్నాలు చేస్తుంది. అమరావతికి కేంద్రం నుంచి నిధులు సాధించడంతో పాటు కొత్త ప్రాజెక్టులు సాధించేందుకు కృషి చేస్తుంది. రాజధాని అమరావతి పనులు వేగం పుంజుకోవడంతో విజయవాడ-గుంటూరు ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి.
వైసీపీ హయాంలో మూడు రాజధానుల ప్రణాళికతో అమరావతి పనులు ముందుకుసాగలేదు. అమరావతి ప్రాజెక్టులలో పెట్టుబడులు నిలిచిపోవడంతో రియల్ ఎస్టేట్ డెవలపర్లు వెనకడుగు వేశారు. అయితే ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం, కేంద్రంలో సీఎం చంద్రబాబు కీలకంగా మారడంతో అమరావతిలో మళ్లీ రియల్ బూమ్ స్టార్ట్ అయ్యింది. భూమి విలువ, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు డిమాండ్ పెరుగుతుందని డెవలపర్లు ఆశిస్తున్నారు.
"2014, 2019 మధ్య సీఎం చంద్రబాబు పాలనలో అమరావతి రాజధాని నగరంలో, చుట్టుపక్కల భారీ ఆర్థిక కార్యకలాపాలు జరుగుతాయని ఆశించి, అనేక మంది రియల్టర్లు, బిల్డర్లు విజయవాడ, గుంటూరులలో రియల్ ఎస్టేట్ వెంచర్లు, నిర్మాణాలపై పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. కానీ వైసీపీ ప్రభుత్వం అమరావతి ప్రాజెక్టును నిలిపివేయడంతో వారికి ఎదురుదెబ్బ తగిలింది" అని ఏపీ చాప్టర్ బిల్డర్, కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) అభిప్రాయపడింది.
అమరావతిలో రియల్ బూమ్
గత ఐదేళ్లలో ఏపీ నుంచి చాలా మంది పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను తెలంగాణ రాజధాని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు మళ్లించారు. ముఖ్యంగా నార్సింగి, కోకాపేట, గండిపేట వంటి ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ బూమ్ భారీగా పెరిగింది. కొందరు విశాఖపట్నంపై ఆసక్తి చూపారు. ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగం పుంజుకోవడంతో రియల్ ఎస్టేట్ డెవలపర్లలో మళ్లీ ఆశలు రేకెత్తాయి. అయితే గతంలో ఉన్నంత వేగం చూపకపోయిన...కాస్త జాగ్రత్తగా ఆచీతూచీ పెట్టుబడులు పెడుతున్నారు.
అమరావతి రాజధాని పనులు, ఔటర్ రింగ్ రోడ్, బై-పాస్ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులు వంటి మౌలిక సదుపాయాల కార్యకలాపాలు ఊపందుకున్న తర్వాత, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఊపందుకుంటాయని రియాల్టర్లు భావిస్తు్న్నారు. విజయవాడ-గుంటూరు ప్రాంతంలో భూమి విలువలో ఇప్పటికే క్రమంగా పెరుగుతోంది. ఈ ప్రాంతంలో ప్రజలు భూములు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందు వరకూ చదరపు గజానికి రూ.20,000 కంటే తక్కువ ఉన్నాయి.
చంద్రబాబు ఏర్పడిన తర్వాత భూముల విలువ క్రమంగా పెరుగుతోందని రియాల్టర్లు అంటున్నారు. ఏప్రిల్ 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచారు. అయితే అమరావతి ప్రాంతాన్ని ఈ పెంపు నుంచి మినహాయించారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడం, నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్న విధానం రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ప్రభుత్వం రూ.20,000 కోట్ల విలువైన పనులకు టెండర్లను ఖరారు చేయడం, ఈ నెలలో రూ.65 వేల కోట్ల విలువైన అమరావతి పనులను ప్రధాని మోదీ చేతుల మీదుగా పునః ప్రారంభించే ప్రణాళికతో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది.
మరో 44 వేల ఎకరాల భూసేకరణ
తాడేపల్లి, ఉండవల్లి, మంగళగిరి ప్రాంతాలలో భూమి విలువలో పెరుగుదల కనిపిస్తుంది. చదరపు గజానికి రూ.40,000 నుంచి రూ.60,000 వరకు ధరలు పలుకుతున్నాయని ఓ రియాల్టర్ తెలిపారు. రాబోయే సంవత్సరంలో ఇక్కడ చదరపు గజం విలువ రూ.1 లక్షకు చేరుకోవచ్చని అభిప్రాయపడ్డారు.
అమరావతిని మహానగరంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్రా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం వద్ద 53 వేల ఎకరాలకు పైగా భూములు ఉండగా, మరో 44 వేల ఎకరాలు భూసేకరణ చేపట్టాలని భావిస్తుంది. ఈ భూసేకరణ పూర్తైతే ప్రభుత్వ మరిన్నీ మౌలిక ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో అమరావతి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని రియాల్టర్లు భావిస్తున్నారు.
టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఆహ్వానం
సిలికాన్ సిటీ బెంగళూరుకు చెందిన టాప్-5 రియల్ ఎస్టేట్ సంస్థలకు సీఆర్డీఏ అధికారులు ఇటీవల సమావేశం అయ్యారు. మున్సిపల్ మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు బెంగళూరులో ఆ సంస్థలతో సమావేశమై అమరావతిలో పెట్టుబడులకు కోరారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామని, అవసరమైన భూములు ఇస్తామని హామీ ఇచ్చారు. మరికొన్ని రోజుల్లో దేశంలో టాప్ -10 రియల్ ఎస్టేట్ కంపెనీలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది.
సంబంధిత కథనం