Amaravati : అమరావతి కొత్త రైల్వే లైన్ నాలుగేళ్లలో పూర్తి, అమృత్ భారత్ కింద 20 స్టేషన్ల అభివృద్ధి -విజయవాడ డీఆర్ఎం
Amaravati Railway Line: రైల్వే బడ్జెట్ లో ఏపీకి భారీగా నిధులు కేటాయించారని విజయవాడ డీఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ల కింద 20 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్నారు.
Amaravati Railway Line : రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. ఏపీలోని రైల్వేల అభివృద్ధికి రూ.9,417 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. విజయవాడ రైల్వే డివిజన్‌లో అమృత్ భారత్ స్టేషన్ల కింద 20 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నట్లు విజయవాడ డివిజినల్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలిపారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి రూ.271.43 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు.

అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి విజయవాడ రైల్వే డివిజన్ రూ.4,864.57 కోట్ల స్థూల ఆదాయాన్ని సాధించిందని, విజయవాడ రైల్వే స్టేషన్ రూ. 500 కోట్లకు పైగా ఆదాయాన్ని పొంది ఎన్ఎస్‌జీ-1 హోదాను సాధించిందని డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలిపారు. ఎర్రుపాలెం - నంబూరు మధ్య అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని నాలుగేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ట్రాక్ నిర్మాణానికి అవసరమైన ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
రూ.2,545 కోట్లతో అమరావతికి కొత్త రైల్వే లైన్‌ను గతేడాది అక్టోబర్‌లో కేంద్ర కేబినెట్ ఆమోదించినట్టు డీఆర్ఎమ్ గుర్తుచేశారు. ఈ రైల్వే లైన్ అమరావతి నుంచి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, చెన్నై సహా పలు ప్రాంతాలతో కలుపుతుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది విజయవాడ డివిజన్ నుంచి రూ.5 వేల కోట్లకు పైగా ఆదాయం రాబట్టాలన్నదే లక్ష్యం అన్నారు. విజయవాడ-విశాఖ డివిజన్ మధ్య 128 కిలోమీటర్ల ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థను పూర్తి చేశామని వెల్లడించారు. దీంతో సంక్రాంతి సమయంలో విజయవాడ డివిజన్ లో 86 శాతం రైళ్లు పంక్చువాలిటీతో నడిపినట్లు తెలిపారు.
ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9417 కోట్లు
ఆంధ్రప్రదేశ్ లోని రైల్వేల అభివృద్ధికి రూ.9,417 కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇది గత యూపీఐ ప్రభుత్వ కేటాయింపుల కన్నా 11 రెట్లు ఎక్కువని అన్నారు. ఏపీలో రూ.84,559 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు నడుస్తున్నాయని... రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి సహకారం అందుతోందన్న కేంద్ర మంత్రి అందుకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం ఏపీలోని 16 జిల్లాల మీదుగా 8 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలో మరిన్ని వందే భారత్ రైళ్లను కేటాయిస్తామని అశ్వినీ వైష్ణవ్ అన్నారు. అలాగే 110, 130, 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడవడానికి వీలయ్యే వివిధ రైల్వే ట్రాక్ లను ఏపీలో అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు. ఈ మధ్యనే రూ.6,177 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.