Schools Holiday : తుపాను ఎఫెక్ట్, ఈ జిల్లాల్లో బుధవారం కూడా స్కూళ్లకు సెలవు!
Schools Holiday : మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం కూడా పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
Schools Holiday : మిచౌంగ్ తుపాను ఏపీపై విరుచుకుపడింది. తుపాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. మిచౌంగ్ సృష్టించిన అల్లకల్లోలం రైతాంగాన్ని నిండా ముంచింది. తుపాను తీరం దాటిన ఈదురు గాలులు, భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లోని పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కూడా సెలవు ప్రకటించింది. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. తుపాను తీవ్రత దృష్ట్యా గత రెండు రోజులుగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
యూజీసీ నెట్ పరీక్షలపై తుపాను ప్రభావం
యూజీసీ నెట్ పరీక్షలపై తుపాను ఎఫెక్ట్ పడింది. బుధవారం నుంచి దేశవ్యాప్తంగా యూజీసీ నెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ పరీక్షలకు అభ్యర్థులు హాజరుకాలేని పరిస్థితులు ఉన్నాయి. బుధవారం ఇంగ్లీష్, హిస్టరీ సహా పలు లాంగ్వేజెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే తుపాను కారణంగా బుధవారం నిర్వహించే పరీక్షలు రాయలేకపోతున్నామని, ఈ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థులు యూజీసీని కోరుతున్నారు. మిచౌంగ్ తుపాను ఏపీ, తమిళనాడును అతకాకుతలం చేసింది. చాలా ప్రాంతాలు జలదిగ్బంధనంలో ఉన్నాయి.
పలు విమానాలు రద్దు
మిచౌంగ్ తుపాను ఏపీలో బీభత్సం సృష్టింస్తోంది. తుపాను ప్రభావంతో కురుస్తోన్న వర్షాలకు పలు ప్రాంతాల నుంచి విశాఖకు రావాల్సిన విమానాలను రద్దు అయ్యాయి. బుధవారం విజయవాడ, కర్నూలు నుంచి రావాల్సిన రెండు విమాన సర్వీసులను ఇండిగో సంస్థ రద్దు చేసింది. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంటలు నీట మునిగి రైతు తీవ్రంగా నష్టపోయారు. ధాన్యం తడిసిపోయిందని ఆవేదన చెందుతున్నారు.
నిలిచిన విద్యుత్ సరఫరా
ప్రకాశం జిల్లాలో నిన్నటి నుంచి పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టంగుటూరు, జరుగుమిల్లి మండలాల్లో సింగరాయకొండ, కొండపి విద్యుత్ సరఫరా అంతరాయం కలిగింది. నిన్నటి నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఒంగోలులో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బాపట్ల జిల్లాలో సైతం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. నిజాంపట్నం మండలం, చినగంజాం మండలాలలో కరెంట్ సప్లై నిలిచిపోయింది. నిన్నటి నుంచి ప్రజలు విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు జిల్లాలోని కాకుమాను, పెదనందిపాడు మండలాల్లో, పల్నాడు జిల్లాలోని గురజాల, కారంపూడి, అచ్చంపేట మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందుల పడుతున్నాయి.