AP Civil Judge Recruitment : ఏపీ సివిల్ జడ్జి పరీక్షల్లో తెలంగాణ యువతి ఫస్ట్, జూ.సివిల్ జడ్జిగా ఎంపిక
AP Civil Judge Recruitment : ఏపీ సివిల్ జడ్జి నియామకాల్లో తెంలగాణ యువతి సత్తా చాటింది. సివిల్ జడ్జి పరీక్షల్లో యువతి అలేఖ్య ప్రథమ స్థానం సాధించింది.
AP Civil Judge Recruitment : ఏపీలో సివిల్ జడ్జి నియామక పరీక్ష ఫలితాల్లో తెలంగాణ యువతి సత్తా చాటింది. హైకోర్టు నిర్వహించిన సివిల్ జడ్జి పరీక్షల్లో తెలంగాణ యువతి అలేఖ్య ఫస్ట్ ప్లేస్ సాధించి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. తెలంగాణలోని హనుమకొండకు చెందిన మాధవీలత, పరిమి మనోజ్ కుమార్ దంపతుల కుమార్తె అలేఖ్య.. హైదరాబాద్ లో లా చదివారు. ప్రస్తుతం అలేఖ్య హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదువుతున్నారు. అలేఖ్య తల్లి మాధవీలత రంగారెడ్డి జిల్లా కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్నారు. తల్లి స్ఫూర్తితో తానూ జడ్జి కావాలనుకున్నానని అలేఖ్య తెలిపారు. ఏపీ హైకోర్టు నిర్వహించిన సివిల్ జడ్జి నియామకాల్లో ఫస్ట్ ర్యాంకు సాధించి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. అలేఖ్యను రంగారెడ్డి జిల్లా కోర్టుల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు దీకొండ రవీందర్, ప్రధాన కార్యదర్శి పట్టోళ్ల మాధవరెడ్డి అభినందించారు.
ఏపీ సివిల్ జడ్జి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీసెస్‌లో భాగంగా 39 సివిల్ జడ్జి పోస్టుల(జూనియర్ డివిజన్)ను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
ముఖ్య వివరాలు:
- రిక్రూట్ మెంట్ ప్రకటన - ఏపీ హైకోర్టు (ఏపీ స్టేట్ జ్యుడీషియల్ సర్వీసు)
- ఉద్యోగాలు - సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)
- మొత్తం ఖాళీలు - 39 పోస్టులు( ఇందులో 32 ఖాళీలు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. మరో 7 ఖాళీలు ట్రాన్స్‌ఫర్ ద్వారా అవుతాయి)
- అర్హత -లా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
- వయోపరిమితి - 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు అయిదేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల మినహాయింపు ఉంటుంది.
- దరఖాస్తు -ఆన్ లైన్ విధానంలో చేయాలి.
- అప్లికేషన్ ఫీజు - రూ.1500 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి.
- దరఖాస్తులు ప్రారంభం - 31 జనవరి 2024.
- దరఖాస్తులకు తుది గడువు 01 మార్చి 2024.
- స్క్రీనింగ్ టెస్ట్ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ - 15 మార్చి 2024.
- స్క్రీనింగ్ పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష)- 13 ఏప్రిల్ 2024.
- ప్రాథమిక కీ విడుదల/ అభ్యంతరాల స్వీకరణ: 18 ఏప్రిల్ 2024.
- ఎంపిక ప్రక్రియ - స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ తదితరాల ఆధారంగా తుది జాబితా ఉంటుంది.
- ఎగ్జామ్ టైం - 2 గంటలు
- స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష కేంద్రాలు - గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖ.