AP 108 104 Strike Notice : ఏపీలో మరో సమ్మె సైరన్- 108, 104 సిబ్బంది స్ట్రైక్ నోటీసులు
AP 108 104 Strike Notice : ఏపీలో మరో సమ్మె సైరన్ మోగింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 108, 104 సిబ్బంది ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చారు.
AP 108 104 Strike Notice : ఏపీలో ఎన్నికల ముందు సమ్మెల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు వేతనాల పెంపు కోసం సమ్మె చేస్తున్నారు. తాజాగా 108, 104, తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ లో పనిచేస్తున్న 7 వేల మంది సిబ్బంది ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ఈనెల 22లోపు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ఈ నెల 23 నుంచి సమ్మె చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. సమ్మె నోటీసులను ఆరోగ్యశ్రీ సీఈవో, వైద్యశాఖ ప్రత్యేక కార్యదర్శికి అందించారు. అయితే ఈ నెల 22వ తేదీ వరకు వివిధ మార్గాల్లో తమ నిరసన తెలియజేస్తామన్నారు.

అంగన్వాడీల సమ్మె
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె బాట పడుతున్నారు. వేతనాల పెంపు, గ్రాట్యూటీ కోసం అంగన్వాడీలు గత 27 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వంతో పలు దఫాల్లో చర్చలు జరిపినా... అవి విఫలం అయ్యాయి. వేతనాల పెంపుపై స్పష్టత వచ్చే వరకు సమ్మె విరమించమని అంగన్వాడీలు తేల్చిచెప్తున్నారు. అయితే ప్రభుత్వం కూడా తగ్గేదేలే అంటోంది. అంగన్వాడీలను అత్యవసర సేవల్లో చేర్చి జీవో నెంబర్ 2 విడుదల చేసింది. అంగన్వాడీలపై ఎస్మా ప్రకటించింది. ఈ నెల 8లోపు విధుల్లో చేరాలని డెడ్ లైన్ విధించింది. అంతే కాకుండా సమ్మె కాలానికి వేతనాలు తగ్గించింది. ప్రభుత్వ తీరుపై అంగన్వాడీలు మండిపడుతున్నారు. అంగన్వాడీలు అత్యవసర సేవల్లోకి రాకపోయినా జీవో తెచ్చి ఎస్మా ప్రయోగించారని ఆరోపించారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడమని తేల్చిచెబుతున్నారు. ఎన్ని ఒత్తిళ్లు చేసినా తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమించమని స్పష్టంచేశారు. ఇవాళ సాయంత్రంలోగా విధుల్లో చేరకపోతే అంగన్వాడీలకు నోటీసులు జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు న్యాయ సలహా తీసుకుంటుంది. ఎస్మా చట్టం ఉల్లంఘన కింద ఉద్యోగులపై చర్యలకు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది.
మున్సిపల్ కార్మికుల సమ్మె
మరోవైపు పారిశుద్ధ్య కార్మికులు కూడా సమ్మె చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతన నినాదంతో కార్మికులు సమ్మెకు దిగారు. మున్సిపల్ కార్మిక సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు జరిపింది. వేతన పెంపు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపడతామని, హెల్త్ అలెవెన్స్ హామీలను నెరవేరుస్తామని మంత్రుల కమిటీ స్పష్టంచేస్తుంది. అయితే వేతనాలు పెంచితేనే విధుల్లో చేరతామని కార్మికులు అంటున్నారు. తక్షణం సమ్మె విరమించి విధుల్లో చేరితే కార్మికుల డిమాండ్లు అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుంది. సమ్మె కాల్ ఆఫ్ చేస్తే డిమాండ్లపై నోటిఫికేషన్ ఇస్తామన్నారు. పెంపు అంతా వచ్చే ప్రభుత్వంలోనే ఇస్తామని కార్మిక సంఘాలకు మంత్రుల, అధికారుల కమిటీ తేల్చి చెప్పింది. అన్ని కేటగిరీల కార్మికులకు హెల్త్ అలవెన్సులు అనే పేరు లేకుండా మొత్తం వేతనంగానే చెల్లింపులు చేస్తామన్నారు. హెల్త్ అలవెన్సులు రూ.6 వేలు అందులోనే కలిపి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఎక్స్ గ్రేషీయాను కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇస్తామన్నారు. ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు పరిహారం రూ.7 లక్షలకు పెంచాలని కార్మిక సంఘాలు కోరాయని, దానికి ప్రభుత్వం అంగీకరించిందని మంత్రులు, అధికారుల కమిటీ తెలిపింది.