Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ఈ నెల 19న పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు. పవన్ కల్యాణ్ కు సీఎం చంద్రబాబు.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ శాఖలు పవన్ కల్యాణ్ ఆలోచనలకు, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్నాయని ఆ పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారారు. టీడీపీ, బీజేపీ, జనసేన జట్టుకట్టడానికి కీలకంగా వ్యవహరించిన పవన్...కూటమి ప్రభుత్వ గెలుపు కోసం సీట్ల త్యాగాలు చేశారు. కేవలం 21 ఎమ్మెల్యే, 2 ఎంపీల సీట్లతోనే ఎన్నికల బరిలో దిగారు. అయితే ఏపీ ఎన్నికల్లో కూటమి పార్టీలు అనూహ్య విజయాన్ని సాధించాయి. కూటమిలో భాగమైన జనసేన 100 శాతం విజయం నమోదు చేసింది. పోటీ చేసిన 23 స్థానాల్లో(21 ఎమ్మెల్యే, 2 ఎంపీలు) గెలుపొందింది. జనసేన గెలుపుపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. జాతీయ మీడియా సైతం పవన్ కల్యాణ్ గెలుపుపై చర్చించాయి. ఇక కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కు సీఎం చంద్రబాబు సముచిత స్థానం అందించారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక మంత్రిత్వ శాఖలు కేటాయించారు. పవన్ గౌరవం తగ్గకుండా డిప్యూటీ సీఎం పదవిని మరెవ్వరికీ కేటాయించలేదు. దీంతో పాటు జనసేన కోరుకున్న మంత్రిత్వ శాఖలు కేటాయించారు.
అయితే ఎన్నికల్లో విజయం ఒక ఎత్తైతే...పాలనను గాడిలో పెట్టడం మరో ఎత్తు. కూటమి ప్రభుత్వానికి సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కూటమి పాలకులకు రాజధాని, అభివృద్ధి, నిరుద్యోగం, సంక్షేమం ఇలా సవాళ్లతో సవారీ తప్పదని విశ్లేషకులు అంటున్నారు. గత ప్రభుత్వ అప్పులను బ్యాలెన్స్ చేసుకుంటూ... అటు సంక్షేమంతో పాటు అభివృద్ధి, ఉద్యోగాల కల్పనపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు. అయితే ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలకంగా కావడంతో నిధుల రాబట్టుకునేందుకు అవకాశం ఉందని అంటున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ఏపీకి నిధుల కొరత కొంత తీరే అవకాశం ఉందంటున్నారు. కానీ టీడీపీ, జనసేన ప్రకటించిన మేనిఫెస్టోలో సంక్షేమ పథకాల అమలు పెనుసవాల్ మారనుంది. నిధుల కొరతను అధిగమించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కూటమి పాలకులు కష్టపడాల్సిందేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కొత్తగా కేబినెట్ లో చేరిన పవన్ కల్యాణ్ ముందు తన శాఖలపై పట్టుసాధించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రజలకు చేరువగా ఉండే గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖలు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా ఉంటాయి. కేంద్రం నుంచి తగిన నిధులు రాబట్టుకునేందుకు ఈ శాఖలు కీలకం కానున్నాయి. పవన్ కల్యాణ్ తన పలుకుబడితో కేంద్రం నుంచి నిధులు రాబట్టగలిగితే రాష్ట్రాభివృద్ధిలో తన ముద్ర వేసేందుకు అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా పవన్ కల్యాణ్ గెలుపుతో పాటు కీలక బాధ్యతలు చేపట్టనుండడంతో జనసేన పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పాలనలో పవన్ తన మార్క్ చూపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.