Centre On AP Capital: రాజధానిగా నోటిఫై చేశారు.. అమరావతిపై కేంద్రం కీలక ప్రకటన
Andhra pradesh Capital Issue: అమరావతిని 2015లో ఏపీ ప్రభుత్వం రాజధానిగా నోటిఫై చేసిందని తెలిపింది కేంద్రం. బుధవారం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
Union Govt On Andhra pradesh Capital: ఏపీ రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక ప్రకటన చేసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు... కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుపై తలెత్తిన వివాదం ప్రస్తుతం కోర్టు విచారణలో ఉందన్నారు. "ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 5, 6 కు అనుగుణంగా నూతన రాజధాని ఏర్పాటుకు ఉన్న ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదికను తదుపరి చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ఈ మేరకు అమరావతిని రాష్ట్ర రాజధాని నగరంగా ప్రకటిస్తూ 2015 ఏప్రిల్ 23న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది" అని తెలిపారు.
అనంతరం ఏపీ ప్రభుత్వం ఏపీసీఆర్‌డీఏ చట్టం, 2020ని రద్దు చేసిందని.. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు నగరాలను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సంఘటిత అభివృద్ధి చట్టం, 2020 (ఏపీడీఐడీఏఆర్)ని తీసుకువచ్చిందని కేంద్రమంత్రి వివరించారు. ఈ చట్టం చేసే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని తెలిపారు. ఆ తర్వాత 2021లో ఈ చట్టాన్ని రద్దు చేసిందని.. మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ అప్పీల్ (సివిల్)ను దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ అంశం విచారణలో ఉందని చెప్పుకొచ్చారు.
జాతీయ రహదారుల నిర్మాణంలో ప్లాస్టిక్, ఇనుము, స్టీల్, నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను విరివిగా వినియోగిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. 2019 నుండి ఈఏడాది జనవరి వరకు ఆంధ్రప్రదేశ్లో 209 కిలోమీటర్ల మేర జాతీయ రహదార్ల నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలు వినియోగించినట్లు తెలిపారు. అలాగే హైవేల నిర్మాణంలో 359 లక్షల మెట్రిక్ టన్నుల పైబడి ఫ్లై యాష్ (థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే బూడిద), 7.28 లక్షల టన్నులు నిర్మాణ, కూల్చివేత వ్యర్ధాలు వినియోగించినట్లు వెల్లడించారు. 68 కిలోమీటర్లు మేర రహదారి నిర్మాణంలో ఇనుము, స్టీల్ స్లాగ్ వ్యర్దాలు వినియోగించినట్లు పేర్కొన్నారు.
సంబంధిత కథనం