AP Heat Wave : ఏపీలో భానుడి భగభగలు, వడదెబ్బకు ముగ్గురు బలి-amaravati heat wave prevails many districts three died with sun stroke ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Heat Wave : ఏపీలో భానుడి భగభగలు, వడదెబ్బకు ముగ్గురు బలి

AP Heat Wave : ఏపీలో భానుడి భగభగలు, వడదెబ్బకు ముగ్గురు బలి

HT Telugu Desk HT Telugu
Jun 01, 2024 04:35 PM IST

AP Heat Wave : ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో తీవ్ర ఉష్ణోగ్రతలకు వడదెబ్బ తగిలి ముగ్గురు మృతి చెందారు.

ఏపీలో భానుడి భగభగలు, వడదెబ్బకు ముగ్గురు బలి
ఏపీలో భానుడి భగభగలు, వడదెబ్బకు ముగ్గురు బలి

AP Heat Wave : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తీవ్రతరం అయ్యాయి‌. ఒకపక్క తీవ్ర ఉక్కపోత, మరో తీవ్రంగా ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గ‌త మూడు రోజులుగా ఎండ‌లు ప్రజ‌ల‌ను బెంబేలెత్తిస్తున్నాయి. 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వ‌ర‌కు తీవ్రమైన ఎండ‌లు, ఉక్కపోత‌తో ప్రజ‌లు అవ‌స్థలు ప‌డుతున్నారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో వడదెబ్బ తగిలి వివిధ ప్రాంతాల్లో ముగ్గురు మృతి చెందారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మక్కువ మండలంలో చెముడు గ్రామానికి చెందిన కరణం కూర్మినాయుడు (67) వడదెబ్బకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయం పొలంలో పని చేస్తున్న కొద్ది సేపటికే అపస్మారక స్థితిలో పడిపోయారు. అయితే పక్కనే ఉన్న అరటి తోటలో పని చేస్తున్న రైతులు వచ్చి చూడగా అప్పటికే కూర్మినాయుడు మృతి చెందాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న కూర్మినాయుడు మరణంతో ఆ కుటుంబం కృంగిపోయింది.‌

మరోవైపు విజయనగరం జిల్లా ఎల్ కోట మండలం గొల్జాం గ్రామానికి చెందిన తూర్పాటి సూరిబాబు (36) వడదెబ్బతో మృతి చెందాడు. సూరిబాబు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు. పని ముగించుకుని తన స్వగ్రామానికి వెళ్తుండగా వేపాడ మండలం పాటూరు సమీపంలో వడదెబ్బకు గురయ్యాడు. అక్కడికక్కడే పడిపోయి స్పృహ కోల్లోయాడు. వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. సూరిబాబు అప్పటికే మృతి చెందాడు. మృత‌దేహాన్ని ఎస్.కోట ప్రభుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. బాప‌ట్ల జిల్లా దొన‌కొండ మండ‌లం తెల్లబాడు గ్రామంలో వ‌డ‌దెబ్బకు అంకాల సిద్ధయ్య (62) మృతి చెందాడు. గొర్రెలను మేత కోసం పొలానికి తోలుకెళ్లాడు. ఎండ తీవ్రంగా ఉండ‌టంతో వ‌డ‌దెబ్బకు గురై పొలంలోనే సొమ్మసిల్లి ప‌డిపోయాడు. దీంతో తోటి గొర్రెల కాప‌రులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి సిద్ధయ్య కుటుంబానికి స‌మాచారం ఇచ్చారు. కుటుంబ స‌భ్యులు ఘ‌టనా స్థలానికి చేరుకొని ఆటోలో సిద్ధ‌య్యను ఆసుప‌త్రికి త‌ర‌లించే ప్రయ‌త్నం చేశారు. అయితే సిద్ధయ్య అప్పటికే మృతి చెందాడు.

విజ‌య‌న‌గ‌రంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

విజ‌య‌న‌గ‌రంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు యువ‌కులు మృతి చెందారు. విజ‌య‌న‌గ‌రం ప‌ట్టణంలోని పెద్ద చెరువు రామానాయుడు రోడ్డులో జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో లంకప‌ట్నానికి చెందిన కిశోర్ (19), పొడుగు హేమంత్ (18) ఇద్దరూ క‌లిసి కోట వ‌ద్ద నున్న త‌న అమ్మమ్మకు క్యారేజీ ఇచ్చి ద్విచ‌క్ర వాహ‌నంపై తిరిగి ఇంటికి వెళ్తున్న సమ‌యంలో ప‌క్కనున్న డివైడ‌ర్‌ను ఢీ కొన‌డంతో కిశోర్ అక్కడికక్కడే మృతి చెంద‌గా, తీవ్రంగా గాయ‌ప‌డిన హేమంత్‌ను ఆసుప‌త్రి త‌ర‌లించే ప్రయ‌త్నం చేశారు. మార్గమ‌ధ్యలోనే హేమంత్ చ‌నిపోయారు.

విశాఖ‌ప‌ట్నం జిల్లా ప‌ర‌వాడ మండ‌లంలో సింహాద్రి యాష్ పాండు వ‌ద్ద ఇద్దరు కార్మికుల‌ను లారీ ఢీకొట్టడంతో ఒక‌రు అక్కడిక‌క్కడే మృతి చెందారు. మ‌రొక‌రు తీవ్ర గాయాల‌తో ప్రాణాప్రాయ‌స్థితిలో ఉన్నాడు. వేముల‌పూడి గ్రామానికి చెందిన విన‌య్ కుమార్ (30), మాక‌వ‌ర‌పాలెం మండ‌లం గిడుతూరు గ్రామానికి చెందిన ఎం. దిలీప్ కుమార్ (20) ఇద్దరూ లోడింగ్ జ‌రుగుతున్న లారీ కింద ప‌డుకున్నారు. ఇద్దరూ మ‌త్తు నిద్రలో ఉన్నప్పుడు డ్రైవ‌ర్ చూసుకోకుండా లారీని స్టార్ట్ చేశాడు. దీంతో వారి మీద నుంచి లారీ వెళ్లిపోవ‌డంతో విన‌య్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయాలు పాలైన దిలీప్ కుమార్‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం