Amaravati Protests : ఇక ఢిల్లీలో అమరావతి రైతుల ఆందోళన… డిసెంబర్ 17,18న ధర్నా
Amaravati Protests అమరావతి రాజధాని నిర్మాణాన్ని కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలకు మూడేళ్లు సమీపిస్తుండటంతో పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. 2019 డిసెంబర్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని వికేంద్రీకరణ నిర్ణయాన్ని ప్రకటించారు. అప్పట్నుంచి రైతులు ఆందోళనలు, నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. మరోవైపు రాజధాని నిర్మాణం ఎటూ తేలకుండా నిలిచిపోయింది.
Amaravati Protests అమరావతి ప్రాంతాన్ని సర్వ నాశనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని రాజధాని పరిరక్షణ సమితి నాయకులు ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఢిల్లీ వేదికగా నిరసనలు తెలపాలని రాజధాని రైతులు భావిస్తున్నారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే ఢిల్లీలో నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. అమరావతి పరిరక్షణ ఉద్యమం మొదలై మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 17,18 తేదీల్లో జంతర్‌మంతర్‌లో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.
డిసెంబర్ 7 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని అమరావతి రైతులు నిర్ణయించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాజధానుల్ని మూడు ప్రాంతాలకు విస్తరించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు మూడేళ్లుగా అమరావతి ప్రాంత రైతులు నిరసనలు తెలియచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గేందుకు ససేమిరా అంటుండటంతో రైతులు తమ నిరసనల్ని రకరకాల పద్ధతుల్లో తెలియచేస్తున్నారు.
మూడు రాజధానుల పేరుతో అమరావతి విధ్వంసానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ దేశ రాజధానిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. రెండ్రోజుల పాటు ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమానికి వివిధ, జాతీయ ప్రాంతీయ పార్టీల నాయకులను ఆహ్వానించాలని నిర్ణయించారు. అమరావతి నుంచి సుమారు రెండు వేల మంది రైతులు, రైతు కూలీలను ప్రత్యేక రైల్లో ఢిల్లీ తీసుకువెళ్లి నిరసనలు తెలపాలని నిర్ణయించారు. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ కోసం అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి రైతు ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులు సమావేశం నిర్వహించారు.
డిసెంబర్ 15న ఢిల్లీ పయనం…..
డిసెంబర్ 15న విజయవాడ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైల్లో రైతులు, రైతు కూలీలు ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. 22బోగీల ప్రత్యేక రైలును ఢిల్లీ ప్రయాణం కోసం ఏర్పాటు చేయనున్నారు. డిసెంబర్ 17,18 తేదీలలో జంతర్‌మంతర్ వద్ద నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 19వ తేదీన భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో రైతు సమస్యలపై నిర్వహించే ర్యాలీలో అమరావతి వరైతులు కూడా పాల్గొంటారు. 19 రాత్రికి ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి కోసమే…
అమరావతి రైతుల హక్కులు కాపాడాలంటూ మూడేళ్లుగా పోరాడుతున్నామని అమరావతి రైతులు చెబుతున్నారు. పోలీసు ఆంక్షల వల్ల అరసవెల్లి పాదయాత్రకు తాత్కలిక విరామం ఇచ్చామని, అమరావతిని కాపాడుకోడానికి రైతులు, రైతు కూలీలు, మహిళలు చేపట్టిన ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తామని ప్రకటించారు. ప్రజల మద్దతుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామని రైతు సంఘాలు చెబుతున్నాయి. తమ పోరాటానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు లభిస్తుందని భావిస్తున్నామని అమరావతి పరిరక్షణ సమితి నాయకులు శివారెడ్డి, గద్దె తిరుపతిరావు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలపై ఢిల్లీలో రైతులు చేసిన పోరాటం స్ఫూర్తిగా అమరావతి రైతులు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.