CS Neerabh Kumar Prasad : ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలం మరో 6 నెలలు పొడిగింపు
CS Neerabh Kumar Prasad : ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్రం మరో 6 నెలలు పొడిగించింది. ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
CS Neerabh Kumar Prasad : ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు సీఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలాన్ని జులై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎస్ గా నీరభ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పదవీ కాలం ముగుస్తుండడంతో... ఏపీ ప్రభుత్వం ఈ నెల 16న కేంద్రానికి లేఖ రాసింది. నీరభ్ కుమార్ పదవీ కాలాన్ని పొడిగించాలని కోరింది. 1987వ బ్యాచ్ కు చెందిన నీరభ్ కుమార్ పదవీ కాలాన్ని ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్ 16(1) ప్రకారం మరో 6 నెలలు పొడిగిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. దీంతో తదుపరి సీఎస్ గా 1987వ బ్యాచ్ కు చెందిన నీరభ్ కుమార్ ప్రసాద్ ను నియమించారు. సీఎస్ రేసులో ఆర్పీ సిసోడియా, విజయానంద్ పేర్లు ప్రముఖంగా వినిపించినా చివరకు నీరభ్ కుమార్ వైపు సీఎం చంద్రబాబు మొగ్గుచూపారు. నీరభ్ కుమార్ ప్రసాద్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ జీఏడీ పొలిటికల్ సెక్రటరీ జీవో 1034 జారీ చేశారు. 1987 బ్యాచ్‌కు చెందిన నీరభ్ కుమార్.. గతంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్ గా పనిచేశారు. సీఎస్ బాధ్యతలు చేపట్టే సమయానికి రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు.
కేంద్ర సర్వీసుల నుంచి ఏపీకి
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొందరు అధికారులను జీఏడీకి అటాచ్ చేసింది. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని వీరిపై విమర్శలు రావడంతో కొందరు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా వేటు వేశారు. మరోవైపు కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఏపీ కేడర్ అధికారులను తిరిగి రాష్ట్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతుంది. ఏపీ కేడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి పీయూష్ కుమార్ ను ఏపీకి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీనికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పీయూష్ కుమార్ ప్రస్తుతం కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగంలోని అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పీయూష్ కుమార్ ను ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించే అవకాశాలు ఉన్నాయి.
మరో సీనియర్ అధికారి మహేష్ చంద్రలడ్హా ఐపీఎస్ ను ఏపీ సర్వీస్‌లోకి పంపాలని కేంద్రాన్ని కోరింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్డా ప్రస్తుతం సీఆర్పీఎఫ్ ఐజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏపీ కేడర్ 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన మహేష్ చంద్ర లడ్డా గతంలో ఏపీలోని వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయనను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించే అవకాశం ఉందని సమాచారం. సీఎం చంద్రబాబు సీనియర్ అధికారులను తిరిగి రాష్ట్రానికి రప్పించి పాలనను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.