AP Housing For Poor : పేదలకు ఇళ్ల స్థలాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం- గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు విధానం
AP Housing For Poor : పేదలకు ఇళ్ల స్థలాలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2029 నాటికి పేదలందరికీ సొంత ఇల్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే గ్రామీణ పేదలకు 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.
AP Housing For Poor : 2029 నాటికి రాష్ట్రంలో పేదవారందరికీ సొంత ఇల్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం గృహనిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పేదల ఇళ్ల స్థలాలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం కేటాయించాలని సీఎం నిర్ణయించారు. ఈ విషయాన్ని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి ప్రకటించారు. గ్రామాల్లో అర్హులైన పేదలకు 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలాన్ని ఇచ్చే విధానం అమలు చేయనున్నామన్నారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ చేపట్టి లే అవుట్లు వేయని చోట గ్రామీణ పేదలకు 3 సెంట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం
రాబోయే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఇళ్ల నిర్మాణం సీఎం చంద్రబాబు హై ప్రయారిటీ అన్నారు. వచ్చే ఏడాదిలోపు 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్లు పూర్తైనా వారికి పేమెంట్లు చెల్లించలేదన్నారు. ఇలాంటి వారిని గుర్తించి చెల్లింపులు జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. మధ్య తరగతి ప్రజలకు ఎంఐజీ లే అవుట్లని ఏర్పాటు చేస్తామని మంత్రి పార్థసారథి మీడియాకు తెలిపారు.
జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణంపై
జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారని మంత్రి పార్థసారథి తెలిపారు. జర్నలిస్టులకు తక్కువ ధరలకు ఇళ్లను నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు. పోలవరం బాధితులకు ఆర్ అండ్ ఆర్ కింద ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగించే అంశంపై చర్చించామన్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఇళ్ల నిర్మాణాలు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించినా సరైన మౌలిక సదుపాయాలను కల్పించలేదన్నారు. అలాంటి వాటిని గుర్తించి సరైన మౌలిక సదుపాయాలు కల్పించి, నివాసయోగ్యంగా మారుస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గృహ నిర్మాణ శాఖలో రూ.10 వేల కోట్ల మేర నష్టం జరిగిందని ఆరోపించారు. 2014-2019 మధ్య కాలంలో 4.5 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం చేపట్టామని మంత్రి పార్థసారథి గుర్తుచేశారు.
పీఎం ఆవాస్ యోజన కింద రూ. 4 లక్షలు
పీఎం ఆవాస్ యోజన (పట్టణ) 2.0 స్కీమ్ కింద కొత్త లబ్దిదారుల ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు ఆర్థిక సాయం పొందనున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.2.50 లక్షలు అందించనుండగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా మరో రూ.1.50 లక్షలు ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు 2024-25లలో అమలయ్యే పీఎం ఆవాస్ యోజన (పట్టణ) 2.0 పథకం మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి తమ వాటా నిధుల్ని కేటాయించాలని సూచించింది. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ లను సార్వత్రిక ఎన్నికల ముందే రాష్ట్రాలకు కేంద్రం పంపింది. పేదల ఇళ్ల నిర్మాణ పథకాల్లో అవకతవకలు, ఇళ్ల నిర్మాణంలో జాప్యాన్ని పరిశీలించేందుకు ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ప్రతినిధుల బృందాన్ని రాష్ట్రాలకు పంపింది. వీరి నివేదిక మేరకు పీఎం ఆవాస్ యోజన (పట్టణ) 2.0 మార్గదర్శకాల్లో మార్పుచేర్పులు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం అదనపు సహకారం కూడా అందించనుందని ప్రకటించింది. ఈ కొత్త మార్గదర్శకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే ఇవాళ జరిగిన సమీక్షలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
సంబంధిత కథనం